Signs Of Cheating: మోసం చేసే వారి ప్రవర్తనలో కనిపించే మార్పులు ఇవే
ABN , Publish Date - Jan 15 , 2026 | 12:13 PM
రిలేషన్‌షిప్‌లో నమ్మకం అనేది అత్యంత కీలకం. కానీ కొన్నిసార్లు ప్రవర్తనలో మార్పులు మనలో అనుమానాన్ని కలిగిస్తాయి. మోసం చేసే ముందు అమ్మాయి లేదా అబ్బాయిల ప్రవర్తనలో కొన్ని సంకేతాలు కనిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: బంధం ఏదైనా కానీ నమ్మకం చాలా ముఖ్యమైంది. ప్రేమ, పెళ్లి, స్నేహం ఏ బంధమైనా సరే.. నమ్మకమే బలమైన పునాది. అయితే, కొన్నిసార్లు మన అనుకునే వ్యక్తి ప్రవర్తనలో అనూహ్యమైన మార్పులు కనిపిస్తే అనుమానం కలగడం సహజం. మోసం చేయబోతున్నారా, లేదా? అనే విషయం ఒక్క లక్షణం చూసి నిర్ణయించలేము. కానీ నిపుణుల ప్రకారం, కొన్ని మార్పులు పదేపదే కనిపిస్తే అవి సంకేతాలుగా ఉండవచ్చని చెబుతున్నారు.
మాట్లాడే విధానంలో మార్పు
ప్రేమగా మాట్లాడే వ్యక్తి నిర్లక్ష్యంగా మాట్లాడడం ప్రారంభిస్తే అది గమనించాల్సిన విషయం. చిన్న విషయాలకే చిరాకు పడటం, మాటల్లో ఆసక్తి తగ్గిపోవడం కనిపించవచ్చు.
ఎక్కువగా బిజీగా ఉండటం
బిజీగా ఉండే సమయాల్లోనూ నీకు టైమ్ ఇచ్చే వ్యక్తి.. పని ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, మీటింగ్ అంటూ తప్పించుకోవడం మొదలుపెడితే సందేహం కలగొచ్చు. ముందు మీ అభిప్రాయాలు, భావాలు పట్టించుకున్న వ్యక్తి ఇప్పుడు పట్టించుకోకపోవడం, మీ మాటలను లైట్‌గా తీసుకోవడం, మీతో గడిపే సమయం తగ్గించడం గమనించవచ్చు.

మొబైల్ పట్ల అధిక జాగ్రత్త
ఫోన్‌ను ఎప్పుడూ లాక్‌లో ఉంచడం, మెసేజెస్ వచ్చిన వెంటనే తొలగించడం, కాల్స్ బయటకు వెళ్లి మాట్లాడటం, మీరు దగ్గరికి వస్తే ఫోన్ దాచడం వంటి అలవాట్లు మార్పు సూచించవచ్చు.
జీవనశైలిలో ఆకస్మిక మార్పులు
డ్రెస్సింగ్ స్టైల్ మారడం, అకస్మాత్తుగా ఫిట్‌నెస్, డైటింగ్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టడం కూడా కొన్నిసార్లు భావోద్వేగ మార్పునకు సంకేతం కావచ్చు. చిన్నచిన్న విషయాలకే పెద్ద గొడవలు చేయడం, మాటల్లో దూరం పెంచడం, బంధాన్ని భారంగా చూపించడం కూడా మార్పునకు సంకేతం కావచ్చు.

కొత్త స్నేహాలు
ఇంతవరకు తెలియని కొత్త ఫ్రెండ్స్, కొత్త గ్రూప్ అంటూ ఎక్కువ సమయం గడపడం, ఆ వివరాలు చెప్పకుండా దాచడం కూడా అనుమానానికి కారణం కావచ్చు.
ఈ లక్షణాలు కనిపించినంత మాత్రాన మోసం చేస్తున్నారని తేల్చేయడం తప్పు. పని ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు, మానసిక ఒత్తిడి వల్ల కూడా ఇలాంటి మార్పులు రావచ్చు. వారిలో ఏదైనా మార్పు కనిపిస్తే వెంటనే అనుమానం పెట్టుకోవడం కంటే, ఓపికగా మాట్లాడటం, భావాలు పంచుకోవడం ఉత్తమ మార్గం. నమ్మకం, గౌరవం ఉన్న చోటే బంధం నిలుస్తుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.
Also Read:
మకర సంక్రాంతి 2026.. ఈ 4 తప్పులు చేస్తే అదృష్టం దూరమవుతుంది..
గాలిపటాల మధ్య ఘుమ ఘుమలు.. సంక్రాంతి స్పెషల్ వంటకాలు ఇవే..
For More Latest News