Orange Peel Benefits: నారింజ తొక్కల ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..
ABN , Publish Date - Jan 16 , 2026 | 02:20 PM
నారింజ పండ్లు తిన్నాక తొక్కలను పారేస్తున్నారా.. అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాలి. ఆరోగ్యానికి, అందానికి అద్భుతమైన లాభాలనిచ్చే నారింజ తొక్కలు ఇంట్లోనే సహజ ఔషధంగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నారింజ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలుసు. కానీ, చాలా మంది నారింజ పండు తిన్నాక తొక్కను నిర్లక్ష్యంగా పారేస్తారు. నిజానికి నారింజ తొక్కల్లోనూ ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందానికీ చాలా ఉపయోగపడతాయి. నారింజ తొక్కలను సరిగ్గా వినియోగిస్తే ఇంట్లోనే సహజ చికిత్సలాగా ఉపయోగించుకోవచ్చు.
నారింజలో ఏ, బి, సి విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవే లక్షణాలు తొక్కలోనూ ఉంటాయి. నారింజ తొక్కలను ఎండబెట్టి పొడిగా చేసి, ఫేస్ ప్యాక్‌లుగా, టీగా, హెయిర్ ప్యాక్‌లుగా వాడుకోవచ్చు. ఇప్పుడు నారింజ తొక్కల వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు చూద్దాం.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది
నారింజ తొక్కల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్, ఆమ్లత్వం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. నారింజ తొక్కల పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
చుండ్రు తగ్గుతుంది
నారింజ తొక్కల పొడిని కొబ్బరి నూనెలో కలిపి పేస్ట్ చేసి జుట్టుకు రాస్తే చుండ్రు తగ్గుతుంది. జుట్టు మృదువుగా మారుతుంది.
చర్మానికి మంచి ఔషధం
నారింజ తొక్కల పొడిని ముఖానికి రాస్తే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇందులోని విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సాయపడతాయి. చర్మంలోని అధిక నూనెను నియంత్రిస్తాయి, ముడతలు తగ్గేలా చేస్తాయి.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
నారింజ తొక్కల్లోనూ విటమిన్-సి సమృద్ధిగా ఉంటుంది. ఈ తొక్కలతో టీ తయారుచేసుకుని తాగితే శరీరానికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది.
బరువు తగ్గడంలో సాయపడుతుంది
నారింజ తొక్కల టీ.. ఆకలిని నియంత్రించడంలో సాయపడుతుంది. అతిగా తినే అలవాటు తగ్గుతుంది. ఇందులోని ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మెటబాలిజాన్ని మెరుగుపరచి బరువు తగ్గేందుకు దోహదపడతాయి.
చేతులు, కాళ్లకు సహజ క్లెన్సర్
నారింజ తొక్కలు చేతులు, కాళ్లకు సహజ క్లెన్సర్‌గా పనిచేస్తాయి. చేతులు, కాళ్లపై నారింజ తొక్కలను రుద్దితే చర్మం శుభ్రంగా మారుతుంది. మురికి, మృతకణాలు తొలగిపోతాయి. సహజ స్క్రబ్‌లా పనిచేసి చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది.
నోటి దుర్వాసన తొలగిస్తుంది
నారింజ తొక్కల్లో యాంటీబాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి నోటిలోని బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. నారింజ తొక్కను కొద్దిగా నమిలితే నోటి దుర్వాసన తగ్గుతుంది. గొంతు సమస్యలు కూడా తగ్గుతాయి.
నారింజ తొక్కలను వ్యర్థంగా పారేయకుండా ఆరోగ్యం, అందం కోసం సహజంగా ఉపయోగించుకుంటే ఎన్నో లాభాలు పొందవచ్చు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.
Also Read:
తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
For More Latest News