Sankranti Fly kites Tradition: మకర సంక్రాంతి 2026.. గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారో తెలుసా?
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:55 AM
సంక్రాంతి పండుగ రోజు దేశవ్యాప్తంగా పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ గాలిపటాలు ఎగురవేస్తుంటారు. అయితే, ఈ గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారో తెలుసా? ఈ సంప్రదాయం వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: మకర సంక్రాంతి పండుగను దేశవ్యాప్తంగా వివిధ పేర్లు, వివిధ సంప్రదాయాలతో ఘనంగా జరుపుకొంటారు. సంక్రాంతి అంటేనే గాలిపటాల సందడి గుర్తుకొస్తుంది. కానీ గాలిపటాలు ఎగురవేయడం వెనుక కూడా కొన్ని కారణాలు, నమ్మకాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సంక్రాంతి రోజు దేశంలోని చాలా ప్రాంతాల్లో పిల్లలు, పెద్దలు అందరూ గాలిపటాలు ఎగురవేస్తారు. ఈ సంప్రదాయం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. కొందరు దీన్ని శ్రీరాముడి కాలం నుంచి వస్తున్న సంప్రదాయంగా చెబుతారు. మరికొందరు మొఘలుల కాలంలో ప్రాచుర్యం పొందిందని అంటారు.

హిందూ పురాణాల ప్రకారం..
కవి తులసీదాస్ రచించిన రామచరితమానస్ ప్రకారం, శ్రీరాముడు మకర సంక్రాంతి రోజున మొదటిసారిగా గాలిపటం ఎగురవేశారని చెబుతారు. ఆయన ఎగురవేసిన గాలిపటం చాలా ఎత్తుకు వెళ్లి ఇంద్రలోకానికి చేరిందని నమ్మకం. అప్పటి నుంచి సంక్రాంతి రోజు గాలిపటాలు ఎగురవేయడం ఆనవాయితీగా మారిందని హిందువుల విశ్వాసం.

ఆరోగ్య ప్రయోజనాలు..
సంక్రాంతి పండుగ శీతాకాలంలో రావడం వల్ల చలి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఎండలో గాలిపటాలు ఎగురవేయడం వల్ల శరీరానికి విటమిన్ డి లభిస్తుంది. ఇది ఎముకలను బలంగా ఉంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా అవసరం. అలాగే గాలిపటం ఎగురవేస్తున్నప్పుడు చేతులు, భుజాలు, వీపు కండరాలు కదులుతుంటాయి. దారాన్ని పట్టుకుని.. గాలిపటాన్ని నియంత్రించడం వల్ల.. చేతుల్లో పట్టు, బలం పెరుగుతుంది. అలాగే కండరాలు బలపడతాయి. ఇది ఒక మంచి వ్యాయామం లాంటిదని పెద్దలు అంటారు.

చరిత్ర ప్రకారం..
గాలిపటాలకు సుమారు 2,000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇవి మొదట చైనాలో ప్రారంభమయ్యాయి. అప్పట్లో సందేశాలను పంపడానికి గాలిపటాలను ఉపయోగించేవారు. చైనా యాత్రికులు ఫాహియన్, హ్యూయెన్ త్సాంగ్.. భారతదేశానికి గాలిపటాల సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. మొదట యుద్ధాల సమయంలో సమాచారం పంపేందుకు ఉపయోగించగా, తరువాత మొఘలుల కాలంలో ఢిల్లీలో గాలిపటాల పోటీలు జరిగేవి. ఆ తర్వాత క్రమంగా గాలిపటాలు ఎగురవేయడం ఒక సరదా ఆటగా, పండుగ సంప్రదాయంగా మారింది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.
Also Read:
తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
For More Latest News