Share News

ఆత్మవిశ్వాసం... అందరికీ సాధ్యమేనా?

ABN , Publish Date - Feb 01 , 2026 | 10:56 AM

ఆత్మవిశ్వాసం ఒక నైపుణ్యం. పరిస్థితులు, గత అనుభవాల నుంచి... నెమ్మది నెమ్మదిగా అభ్యసిస్తే, ఆ నైపుణ్యం ఎవరికైనా ఒంటపడుతుంది. ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు సాయపడుతుంది.

ఆత్మవిశ్వాసం... అందరికీ సాధ్యమేనా?

ఆత్మవిశ్వాసం ఒక నైపుణ్యం. పరిస్థితులు, గత అనుభవాల నుంచి... నెమ్మది నెమ్మదిగా అభ్యసిస్తే, ఆ నైపుణ్యం ఎవరికైనా ఒంటపడుతుంది. ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు సాయపడుతుంది. గొప్ప వ్యక్తులుగా నిలబెడుతుంది. ‘కొన్ని అలవాట్లు మార్చుకుంటే చాలు... కాన్ఫిడెన్స్‌ మీలో పరవళ్లు తొక్కుతుంద’ని అంటున్నారు వ్యక్తిత్వ నిపుణులు. ఇంతకీ మిమ్మల్ని మీరు ఆత్మవిశ్వాసంతో చెక్కుకోవడానికి కావాల్సిన పనిముట్లు ఏమిటి?

నలుగురిలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు నోటి నుంచి మాట పెగలదు. కాళ్లు వణుకుతాయి. మాట తడబడుతుంది. అలా అని మాట్లాడాల్సిన అంశంపై వాళ్లకు అవగాహన లేక కాదు. సబ్జెక్ట్‌పై పూర్తి పట్టు ఉంటుంది. కానీ ఆత్మవిశ్వాసం పిసరంత కూడా ఉండదు. దాంతో ఒక్కమాట కూడా గొంతు దాటి బయటకు రాదు. చాలామందికి ఎదురయ్యే సమస్యే ఇది. అలా అని ఈ సమస్యను అలాగే వదిలేయడం సరైనది కాదంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. కొన్ని అలవాట్లు మార్చుకునేందుకు కృషి చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని వారు సూచిస్తున్నారు. జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలంటే ఆత్మవిశ్వాసం తప్పనిసరి. అది లేకపోతే ఎందులోనూ రాణించలేరు.


book5.3.jpgఆత్మవిశ్వాసంతో ఉండాలంటే ముందుగా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎవరు మీరు? మీ విలువ ఎంత? మీ బలం ఏంటి? బలహీనతలేంటి? మీ లక్ష్యం ఏంటి? ఈ అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండాలి. ఆత్మవిశ్వాసం ఎక్కడో దొరికేది కాదు. ప్రతీ ఒక్కరిలో ఎంతో కొంత ఉంటుంది. అది ఒక నైపుణ్యం. దాన్ని నేర్చుకోవడం ద్వారా, సాధన చేయడం ద్వారా మెరుగుపరుచుకోవచ్చు. ఆత్మవిశ్వాసంతో ఉన్న వ్యక్తులు వారిపై వారు నమ్మకం కలిగి ఉంటారు. తమ సామర్థ్యాలపై పూర్తి నమ్మకంతో ఉంటారు. లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకునేందుకు శ్రమిస్తారు. చివరికి అనుకున్నది సాధిస్తారు.


book5.4.jpgచిన్న చిన్న విజయాలతో...

పెద్ద విజయాలు మాత్రమే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని అనుకుంటారు. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. చిన్న చిన్న విజయాలు సైతం కాన్ఫిడెన్స్‌ని రెట్టింపు చేస్తాయి. ఒక కథను రాశారు. కానీ అది ప్రచురణకు నోచుకోలేదు. దాంతో అది మీ అపజయాల లెక్కలో ఉండిపోతుంది. దాన్ని కూడా మీరు ఫెయిల్యూర్‌గానే భావిస్తారు. ఇలాంటి మైండ్‌సెట్‌ మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత దిగజారుస్తుంది. దీన్ని అధిగమించాలంటే రోజువారి జీవితంలో చిన్న చిన్న విజయాలను ఒక డైరీలో రాయాలి. ఎవరినో ఇంప్రెస్‌ చేయాల్సిన అవసరం లేదు. పూర్తి చేసిన పనులనే రాయాలి. హోటల్‌ నుంచి ఫుడ్‌ ఆర్డర్‌కు బదులుగా ఇంట్లోనే వంట చేశారు. దాన్ని రాయాలి. మొహమాటం లేకుండా ఇన్‌స్టాలో మీరు మాట్లాడిన లేక డ్యాన్స్‌ చేసిన వీడియోను పోస్ట్‌ చేశారు. అది కూడా గెలుపే. ఒక నెల తరువాత డైరీలో రాసిన వాటిని రివ్యూ చేసుకోండి. మీరు చాలాసార్లు విజయం సాధించి ఉంటారు. ఆత్మవిశ్వాసానికి ఆశ ఉంటే సరిపోదు, ఆధారాలు కూడా కావాలి. అందుకే చిన్న చిన్న విజయాలను కూడా డైరీలో రాయాలి.


‘నో’ చెప్పాలి!

‘నో’ చెబితే ఏమైనా అనుకుంటారేమో! ‘నో’ అంటే నాతో మాట్లాడటం మానేస్తారేమో! ఇలాంటి సందర్భాలు అందరికీ తరచూ ఎదురవుతూనే ఉంటాయి. ఇతరులకు ‘నో’ చెప్పాల్సి వచ్చినప్పుడు మొహమాటంతో వెనకంజ వేస్తారు. చాలా ఇబ్బందిగా ఫీలవుతారు. వాళ్లకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. తమ గురించి చెడుగా అనుకోకూడదని ఎదుటి వ్యక్తికి అర్థం చేయించేందుకు తపన పడతారు. కానీ ఆత్మవిశ్వాసంతో ఉండేవాళ్లు ఈ పనులు చేస్తూ వారి విలువైన సమయాన్ని వృథా చేసుకోరు. విషయం ఏదైనా తటపటాయించకుండా చెప్పేస్తారు. ఎవరైనా మీరు చేయలేని పని గురించి లేక చేయకూడని పని గురించి అడిగితే ‘‘నేను ఆ పని చేయలేను’’ అని స్పష్టంగా చెప్పడం కూడా కాన్ఫిడెన్స్‌కు నిదర్శనమే. ‘‘నా షెడ్యూల్‌ దెబ్బతింటుంది’’ అని కూడా చెప్పొచ్చు. ఇలా చెప్పడం తప్పకుండా ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. కాబట్టి ‘నో’ చెప్పడం అలవాటు చేసుకోవాలి.


book5.2.jpg

వాయిదా వద్దు...

రోజూ వ్యాయామం చేయడం చాలామందికి అతి కష్టమైన పని. ఏదో ఒక సాకుతో వాయిదా వేస్తుంటారు. నిజానికి వ్యాయామం వల్ల చాలా మేలు జరుగుతుంది. శారీరక వ్యాయామంతో కఠినమైన పనులు సైతం చేయగలమనే ఆత్మవిశ్వాసం వస్తుంది. శారీరక వ్యాయామం మొదలుపెట్టడానికి ప్రణాళికలు రచించాల్సిన అవసరం లేదు. డ్యాన్స్‌ చేసినా చాలు. పుషప్‌లు చేయవచ్చు. హార్ట్‌బీట్‌ పెరిగేలా నడిచినా చాలు. ఎలాగైనా శరీరం దృఢంగా మారేలా చూసుకోవాలి. శరీరం, మనసు వేర్వేరు కాదు. శరీరం దృఢంగా మారితే మనసు దానిని అనుకరిస్తుంది. ఫలితంగా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.


డ్రెస్‌ సెన్స్‌ ముఖ్యమే...

ఎదుటివారిని ఆకర్షించడం కోసమో, అవతలి వ్యక్తికి నచ్చేలా ఉండటం కోసమో రకరకాల దుస్తులు ఽధరిస్తుంటారు చాలామంది. అలాకాకుండా మీకు నచ్చిన దుస్తులు ధరించాలి. ముందుగా మీకు మీరు నచ్చాలి. మంచి దుస్తులు ధరించినప్పుడు తప్పకుండా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ అప్పియరెన్స్‌పైన దృష్టిపెట్టారంటే ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు అడుగులు వేస్తున్నట్టే. ఆయా సందర్భాలను బట్టి అనువైన దుస్తులు ధరించడం నేర్చుకోవాలి. ఉదాహరణకు ఆఫీసుకు వెళుతున్నట్లయితే ఫార్మల్‌ దుస్తులు ధరించడం, డ్రెస్‌ నీట్‌గా ఉండేలా చూసుకోవడం ద్వారా డిగ్నిఫైడ్‌గా కనిపిస్తారు. తల ఎత్తుకుని ఆత్మవిశ్వాసంతో నడిచేందుకు ఇది మంచి దారి. కాబట్టి అప్పియరెన్స్‌ను ఎట్టిపరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దు.


book5.5.jpgకృతజ్ఞత అవసరం

ప్రతిరోజూ కృతజ్ఞతతో ఉన్న కొన్ని విషయాలను ఒక పేపర్‌పై రాయాలి. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందనేది నిపుణుల మాట. మీరు ఏ విషయం పట్ల కృతజ్ఞతతో ఉన్నారో గుర్తించినప్పుడు, అది మెదడులో సెరటోనిన్‌ స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల సంతోషంగా ఉంటారు. సంతోషంగా ఉంటే మరింత కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టే. ప్రతీరోజు నిద్రపోయే ముందు... ఆ రోజులో ప్రత్యేకమైన క్షణాలు, కలిసిన వ్యక్తులు, నేర్చుకున్న అంశాలకు కృతజ్ఞత చెప్పుకోవాలి. ఈ అలవాటుతో వచ్చే మార్పు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.


భయాన్ని జయిస్తేనే...

భయం ఉన్న చోట ఆత్మవిశ్వాసం ఉండదు. భయం మిమ్మల్ని వెనక్కి నెడుతుంది. భయం నలుగురిలో మాట్లాడనివ్వదు. ఆ భయాన్ని జయించాలంటే ఆత్మవిశ్వాసం ఉండాలి. భయాన్ని పోగొట్టుకోవాలంటే ప్రతీవారం మిమ్మల్ని భయపెట్టే ఒక పనిని ఉద్దేశపూర్వకంగా ఎంచుకోవాలి. మొదటి ప్రయత్నంలో ఓటమి ఎదురైనా, క్రమక్రమంగా భయం తొలగిపోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఓటమి గురించి భయపడుతూ... ప్రయత్నించడం మానేస్తే ఎలా? ఎప్పుడో ఒకసారి అడుగు ముందుకు వేయాలి కదా? అది ఇప్పుడే ఎందుకు కాకూడదు అని అనుకోండి. భయాన్ని పారతోలి చూడండి. ఆత్మవిశ్వాసం అదే ఉప్పొంగిపోతుంది.


  • ముందుగా మిమ్మల్ని భయపెట్టే అంశాల గురించి పేపర్‌పై రాయాలి.

  • వాటి తీవ్రత ఆధారంగా 1 నుంచి 10 లోపు రేటింగ్‌ ఇవ్వాలి.

  • ఎక్కువ భయపెట్టే అంశాన్ని మొదటి స్థానంలో రాయాలి. అతి తక్కువ భయపెట్టే అంశాన్ని 10వ స్థానంలో రాయాలి.

  • ఇప్పుడు అతి తక్కువ భయపెట్టే అంశం నుంచి మొదలుపెట్టాలి. దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవాలి.

  • ఈ లెవెల్‌ను కంఫర్టబుల్‌గా దాటితే తొమ్మిదో లెవెల్‌కు వెళ్లాలి. నర్వస్‌గా అనిపిస్తే రిలాక్సేషన్‌ వ్యాయామాలు చేయాలి.


మిమ్మల్ని భయపెట్టే అంశాలను ఎదుర్కోవడానికి అవసరమైతే ప్రొఫెషనల్‌ సపోర్టు తీసుకోవాలి. అలాగే మీరు నటించిన వీడియోను ఈరోజే పోస్ట్‌ చేయండి. మీరు మాట్లాడాల్సిన అంశాలను సాకులు చూపిస్తూ తప్పించుకోకుండా ఈరోజే మాట్లాడి చూడండి. ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లండి. మీరు సరైన వ్యక్తి కాకపోయినా ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేయండి. భయం అనేది ఒక భావన మాత్రమే. అది మీ మెదడులో మాత్రమే ఉంటుంది. ఎవరు ఎలా కామెంట్‌ చేస్తారోనని భయపడుతూ పోస్ట్‌ చేయకుండా ఎందుకుండాలి? తిరస్కరిస్తారేమో అని భయపడుతూ దరఖాస్తు చేయకుండా ఎందుకుండాలి? ఈ పనులు చేసి చూడండి. భయం పత్తా లేకుండా పోతుంది.


సర్కిల్‌ మంచిదైతే...

మీరేంటో మీ స్నేహితులను చూసి చెప్పేయవచ్చని అంటారు. కాబట్టి ఎప్పుడూ మంచి సర్కిల్‌లో ఉండండి. మంచి వ్యక్తులు, సానుకూల దృక్పథంతో నడుచుకునే వారితో స్నేహం చేయడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ చుట్టూ ఉండే వారి ప్రభావం తెలియకుండానే మీపై చాలా ఉంటుంది. కాబట్టి మంచివాళ్లతో కలిసి ప్రయాణం చేయండి. మంచి సర్కిల్‌ను ఎంచుకోండి. వారి ఆలోచనలు, చర్యలు మీలో కొంతైనా ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. కొందరు మీరు ఆత్మవిశ్వాసంతో ఉండటాన్ని కూడా తట్టుకోలేరు. మిమ్మల్ని కిందకు లాగాలని ప్రయత్నిస్తారు. అటువంటివారిని పట్టించుకోవాల్సిన పనిలేదు.


అలవాట్లకూ ఉందో లెక్క...

ఎవరికీ కూడా పుట్టుకతో ఆత్మవిశ్వాసం ఉండదు. జీవితంలో రోజూ జరిగే సంఘటనలు, శిక్షణ లాంటివి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కొన్ని అలవాట్లు నెమ్మదిగా మిమ్మల్ని కాన్ఫిడెన్స్‌తో నడుచుకునేలా తీర్చిదిద్దుతాయి. కాబట్టి మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షించే మూడు విషయాలతో ప్రారంభించండి. అవి సాధారణమైన విషయాలే అనిపించేంత వరకు వాటిని కొనసాగించండి. ఆ తరువాత మిమ్మల్ని బాగా ఆకర్షించే మరికొన్ని అంశాలను జోడించుకుంటూ వెళ్లండి. అనుకున్నవన్నీ రోజూ జరగవు. ఏది జరిగినా కృతజ్ఞతతో ఉండండి. జరిగిపోయిన దాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోవద్దు. జరుగుతున్న ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలి.


అదొక ట్రాప్‌...

ఉదయం నిద్ర లేవగానే బెడ్‌పై నుంచి కాలుకింద పెట్టకుండానే ఫోన్‌ చేతుల్లోకి తీసుకుంటారు. వాట్సాప్‌, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌... అన్నీ తిరగేసిన తరువాతే మంచంపై నుంచి దిగుతారు. నిజంగా మీకు అంత అత్యవసరమైన మెసేజ్‌లు వచ్చే అవకాశం ఉందా? నిద్ర లేవగానే ఫోన్‌ చెక్‌ చేయాలా? అంటే అవసరం లేదు. అత్యవసరంగా చూడాల్సిన మెసేజ్‌లు ఏమీ ఉండవని తెలిసినా ఫోన్‌ చూడకుండా ఉండలేరు. ఇది మీ మానసిక స్థితిపై ఒకరకంగా ప్రభావం చూపుతుంది. ఇతరులు పెట్టిన వాట్సాప్‌ స్టేటస్‌ చూడగానే, మీకు తెలియకుండానే రియాక్షన్‌ మోడ్‌లోకి వెళ్లిపోతారు. ఫేస్‌బుక్‌లో ఎవరో పెట్టిన పోస్టు మీ ఆలోచనా ధోరణిని మార్చేస్తుంది. అంటే ఆ రోజు మీ మానసిక స్థితి సోషల్‌ మీడియాపై ఆధారపడి ఉంటోంది. మీరు కొత్తగా ఆలోచించడం మానేసి ఎవరో తెలియని వాళ్లతో పోల్చుకోవడంతో సరిపెడుతున్నారు. ఇది క్రమంగా మీలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ఉదయాన్నే ఫోన్‌కు దూరంగా ఉండండి. దానికి బదులుగా కాసేపు వ్యాయామం చేయడం... పేపర్‌ చదవడం వంటి పాజిటివ్‌ అలవాట్లు మీలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి.


బలం... బలహీనత...

మీ బలహీనతలను మాత్రమే తెలుసుకుంటే సరిపోదు. మీలోని బలాలనూ గుర్తించాలి. బలాన్ని, బలహీనతను... రెండింటినీ యాక్సెప్ట్‌ చేయాలి. ఏయే అంశాలకు ప్రశంసలు లభించాయి? ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు? మీరు నేర్చుకున్న నైపుణ్యాలు ఎంటి? ఈ అంశాల గురించి ఒక పేపర్‌పై రాయండి. దానివల్ల మీలోని బలాలను ఎలా ఉపయోగించుకోవచ్చో మీకు అర్థమవుతుంది. తరువాత రకరకాల అవకాశాలను వెదకండి. రెట్టింపు ఆత్మవిశ్వాసంతో అనుకున్నది సాధిస్తారు.


పోల్చుకోవడం సరికాదు...

ప్రతీ విషయాన్ని ఇతరులతో పోల్చుకోవడం ఇటీవల బాగా పెరిగింది. జీతాన్ని పోల్చుకోవడం, ఇన్‌స్టాలో ఫాలోవర్స్‌ను పోల్చుకోవడం వంటివి సాధారణంగా కనిపించినా అవి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఎవరి జీవితం వారిది. ఎవరి దారులు వారివి. కాబట్టి ముందుగా పోల్చుకోవడం ఆపండి. పోల్చుకోవడం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందనేది నిజం. అలాగే మీలో మీకు నచ్చే అంశాలు ఏమిటో బాత్‌రూమ్‌లోని అద్దంపై రాయండి. లేక స్టికీ నోట్‌పై రాసి అతికించండి. మీలోని పాజిటివ్‌ అంశాల గురించి రిమైండ్‌ చేసుకోవడానికి ఇదొక మార్గం. ముఖ్యంగా మీరు నర్వస్‌గా ఉన్నప్పుడు... తిరిగి గాడిలో పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. మీలోని అమేజింగ్‌ క్వాలిటీస్‌ను రిమైండ్‌ చేసుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మోటివేట్‌ చేసేందుకు కొన్నిసార్లు ఒక అర్థవంతమైన కోట్‌ లేదా పదబంధం మీ గుండెను తాకుతుంది. అది మీ కాన్ఫిడెన్స్‌ బూస్ట్‌ అయ్యేందుకు తోడ్పడుతుంది.


చిన్నవే అయినా...

కూరగాయల సంచితో మెట్లు ఎక్కేందుకు ఇబ్బందిపడుతున్న బామ్మకు సహాయం చేయడం... తెలియని వారి కోసం డోర్‌ తెరిచిపట్టుకోవడం... ఇవి చిన్న పనులే కానీ కాన్ఫిడెన్స్‌ బూస్ట్‌ అయ్యేందుకు సహాయపడతాయి. ఒకరికి సహాయం చేయడం వల్ల మెదడులో ఆక్సిటోసిన్‌ విడుదల పెరుగుతుంది. ప్రతీరోజూ లక్ష్యాలను నిర్దేశించుకోవడం, వాటిని సాధించేందుకు కృషి చేయడం కూడా ఆ కోవకు చెందినవే. అరగంట వర్కవుట్‌ కావచ్చు. పార్కులో కాసేపు రిలాక్స్‌గా కూర్చోవడం కావచ్చు. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని పూర్తి చేస్తే అది మూడ్‌పై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది. కాన్ఫిడెన్స్‌ పెరిగేందుకు ప్రతీరోజూ ఏదో ఒకటి కొత్తగా నేర్చుకునేందుకు ప్రయత్నించాలి.


ఎప్పుడూ పాజిటివ్‌ మైండ్‌సెట్‌తో ఉండేందుకు ప్రయత్నించే అలవాటు ఆత్మవిశ్వాసం పెరిగేందుకు సహాయపడుతుంది. ఆఫీసుకు బయలుదేరే సమయంలో షర్ట్‌పై కాఫీ పడింది. కోపంతో అరవడం, అప్‌సెట్‌ కావడంవల్ల ఏం ప్రయోజనం? దానికి బదులుగా షర్ట్‌ మార్చుకుని బయలుదేరాలనే పాజిటివ్‌ మైండ్‌సెట్‌ను ఏర్పరచుకోవాలి. ఆత్మవిశ్వాసం అనేది ప్రతీ ఒక్కరిలో ఉంటుంది. అయితే దానిని గుర్తించి, సాధన చేస్తే తప్పకుండా మీ వశం అవుతుంది. అప్పుడిక ప్రపంచం సరికొత్తగా కనిపిస్తుంది. గుండెల్నిండా శ్వాస పీల్చుకుని ఆ ప్రపంచంలోకి అడుగేయండి. కచ్చితంగా విజయం వరిస్తుంది. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా ఎందరినో విజయతీరాలకు చేర్చింది ఇదే మరి.

- సండే డెస్క్‌


  • గత ఏడాది నిర్వహించిన ఒక గ్లోబల్‌ సర్వేలో... ప్రపంచవ్యాప్తంగా 72 శాతం మంది తాము ఆత్మవిశ్వాసంతో ఉన్నట్టు ఫీలవుతుంటామని అన్నారు.

  • 5 నుంచి 12వ తరగతి చదువుతున్న బాలికల్లో ఆత్మవిశ్వాసం పాళ్లు గణనీయంగా తగ్గినట్టు మరో అధ్యయనంలో తేలింది. దీనికి కారణం సోషల్‌ మీడియా ఎక్కువగా చూడటమేనని వెల్లడైంది.

  • ‘ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ ఇండియన్‌ సైకాలజీ’ ప్రకారం గ్రామీణ విద్యార్థుల కన్నా పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో కాన్ఫిడెన్స్‌ లెవెల్స్‌ ఎక్కువగా ఉంటున్నాయి.

  • పదహారేళ్ల యువతీయువకుల్లో ప్రతీ ముగ్గురిలో ఒకరు ఆత్మవిశ్వాసం లేమితో ఉన్నారు. దీనికి సోషల్‌ మీడియాతో పాటు శరీర సౌష్ఠవం కూడా కారణం అని ఇటీవల ఒక సర్వేలో తేలింది.


  • గతంలో ఎదురైన అపజయాలు, ప్రతికూల అనుభవాలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. బాల్యంలోని పరిస్థితులు, జీవితానుభవాలు ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపుతాయి.

  • ఇతరులతో పోల్చుకుంటూ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం వల్ల కాన్ఫిడెన్స్‌ తగ్గిపోతుంది. ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తూ కూర్చుంటే ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. భయం కాన్ఫిడెన్స్‌ని చంపేస్తుంది. నెగెటివ్‌ థింకింగ్‌ వైపు ఎట్టిపరిస్థితుల్లో వెళ్లొద్దు.

  • ప్రతీది పరిపూర్ణంగా ఉండాలని కోరుకున్నవారిలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి ఆలోచనలు కాసేపు పక్కన పెట్టండి.


ఈ వార్తలు కూడా చదవండి.

ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

కుప్పానికి ప్రగతి కళ

Read Latest Telangana News and National News

Updated Date - Feb 01 , 2026 | 11:00 AM