Share News

మొదట నేనే ప్రపోజ్‌ చేశా.. ప్రేమలో గౌరవం కూడా ముఖ్యం

ABN , Publish Date - Feb 14 , 2026 | 08:58 AM

‘‘ప్రేమలో పరస్పర గౌరవం, ఆర్థిక స్వాతంత్య్రం అత్యంత ముఖ్యం’’ అంటారు సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ తొలి కమిషనర్‌ జి. సృజన. ఆమెది ప్రేమ వివాహం.

మొదట నేనే ప్రపోజ్‌ చేశా.. ప్రేమలో గౌరవం కూడా ముఖ్యం

  • జి. సృజన, సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌

‘‘ప్రేమలో పరస్పర గౌరవం, ఆర్థిక స్వాతంత్య్రం అత్యంత ముఖ్యం’’ అంటారు సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ తొలి కమిషనర్‌ జి. సృజన. ఆమెది ప్రేమ వివాహం. అయితే, తన ప్రణయగాథలో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, ఒకరిని మరొకరు ఇంప్రెస్‌ చేసుకోవడం లాంటి సినిమాటిక్‌ విషయాలకు తావులేదని చెబుతున్నారు. ఫిబ్రవరి14 ప్రేమికుల దినోత్సవం. ఈ సందర్భంగా అడ్వకేట్‌ రవితేజతో తన ప్రణయం పరిణయంగా మారిన క్రమం తాలూకు స్మృతులను ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారిలా..!

(హైదరాబాద్‌ సిటీ. ఆంధ్రజ్యోతి)

మాది ప్రేమ వివాహం. నా భర్త పదిరి రవితేజ హైకోర్టు న్యాయవాది. మా పరిచయం చాలా గమ్మత్తుగా జరిగింది. హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీలో నేను పొలిటికల్‌ సైన్స్‌ పోస్టుగ్రాడ్యుయేషన్‌ చదువుతున్నప్పుడు ఆయన విజయవాడలో లా చేస్తున్నారు. రవితేజ అందరితో కలివిడిగా ఉంటారు. నా స్వభావం అందుకు కాస్త భిన్నం. పుస్తకపఠనం, మరీ ముఖ్యంగా సామాజిక శాస్త్రాలపై సంభాషణ మా ఇద్దరి కామన్‌ ఇంట్రస్టులు.


విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా ఉండే రవితేజ అప్పుడప్పుడు మా వర్సిటీకి వస్తుండేవారు. అలా పరిచయమైన అతని చేతిలో ఓ రోజు ‘బీయింగ్‌ అండ్‌ నథింగ్‌ నెస్‌’ పుస్తకం చూసి ఆశ్చర్యపోయాను. ఫ్రెంచ్‌ తత్త్వవేత్త జీన్‌పాల్‌ సార్ర్తే రాసిన ఆ పుసక్తం తత్త్వశాస్త్రంలోనే అత్యంత ప్రభావవంతమైనది. ఆ వయసులో అంత పెద్ద తత్త్వశాస్త్ర పుస్తకాలు చదివే వాళ్లు నాకు అప్పటివరకు మరొకరు కనిపించలేదు. కార్ల్‌ మార్క్స్‌ రచనలతో పాటు రావిశాస్త్రి, శ్రీశ్రీ సాహిత్యమంటే మా ఇద్దరికీ ఇష్టమే. సామాజిక అంశాలపై నిరంతరం చర్చించుకునేవాళ్లం.


city4.2.jpgమూడు నెలల తర్వాత రిప్లయ్‌

రవితేజ మంచి అధ్యయనశీలి. సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై స్పష్టమైన అవగాహన ఆయనకుంది. తాను ఎప్పుడూ మరొకరిని జడ్జిచేయరు. వారు అలా.. వీరు ఇలా లాంటి ఫిర్యాదులు అస్సలుండవు. కాబట్టి ఆయన ముందు మనం నటించనవసరంలేదు. ఇంప్రెస్‌ చేయడానికి ప్రయత్నించనవసం అసలే లేదు. ఆయనలో ఇలాంటి అరుదైన లక్షణాలు నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి. ఒకరోజు నేనే చొరవచేసి ‘మీరంటే నాకు ఇష్టం. అందుకే మాట్లాడుతున్నాను’ అని మొదట ప్రపోజ్‌ చేశాను. కారణం తెలియదుకానీ, ఆయన నుంచి మూడు నెలల తర్వాత సమాధానం వచ్చింది.


బహుమతులు చిరాకు

ప్రేమ అనగానే ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం. షాపింగ్‌లకు వెళ్లడం లాంటి సినిమాటిక్‌ సంఘటనలు మా ప్రణయగాథలో దాదాపుగా లేవనే చెప్పాలి. బహుమతులు తీసుకోవడం, ఇవ్వడమంటే నాకు చిరాకు. సెంట్రల్‌ యూనివర్సిటీ క్యాంప్‌సలో ఇద్దరం కలిసి నడుస్తూ గంటల కొద్దీ కబుర్లాడుకునేవాళ్లం. అదీ రాజనీతి, తత్త్వశాస్త్ర విషయాల మీదే. ఎప్పుడైనా కాఫీ షాపులకు వెళ్లినా రవాణఖర్చులు ఎవరివి వారివే. ప్రేమలో పరస్పర గౌరవంతో పాటు ఆర్థిక స్వాతంత్య్రం కూడా ఉండాలని బలంగా నమ్ముతాను. రవితేజ అభిప్రాయాన్ని మౌనంగా వింటాను. మరొక సమయంలో నా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తాను. కనుక మా మధ్య ఇగోకు తావులేదు.


city4.3.jpg

నాన్నతో మా ప్రేమ గురించి..

మా నాన్న జి. బలరామయ్యగారు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఐఏఎస్‌ అధికారిగా సుపరిచితులే. ఆయన సామ్యవాది. ‘పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను’ అని ఒకరోజు నాన్నతో చెప్పాను. ‘రవితేజనే కదా!’ అని అడిగారు. అమ్మ మొదట అంగీకరించకపోవడంతో నాన్నే నచ్చచెప్పారు. అలా 2011, ఫిబ్రవరి 26న రవితేజ, నేను రిజిస్టర్‌ మ్యారేజీ చేసుకున్నాం. మా ఇంట మొట్టమొదటి ప్రేమ వివాహం నాదే. రవితేజ అమ్మానాన్నలదీ ప్రేమవివాహమే. మా అత్తామామ కూడా విద్యావంతులే కాదు, స్వేచ్ఛ, సమానత్వాన్ని ప్రేమించే మనుషులు కూడా. అలాంటి విశాలభావాలు కలిగిన ఇంటికి కోడలిగా వెళ్లడం నా అదృష్టం.


మంచి స్నేహితుడు కూడా..

రవితేజ నాకు జీవితభాగస్వామి మాత్రమే కాదు మంచి స్నేహితుడు కూడా. పెళ్లికి ముందు మూడుసార్లు యూపీఎస్సీ పరీక్షలో అపజయమే పలకరించింది. గ్రూప్‌1 రాసి ఉద్యోగంలో చేరాను. కానీ నాన్న స్ఫూర్తితో ఐఏఎస్‌ అవ్వాలనుకున్న నేను అక్కడి వరకు వెళ్లలేకపోయానే అన్న వెలితి నాలో ఉండేది. అలాంటి సమయంలోనే ‘సివిల్స్‌కు ఇంకో అవకాశం ఉందికదా’ అని రవితేజ గుర్తుచేశారు. ఢిల్లీలో కోచింగ్‌కు వెళ్లినపుడు నాకు అవసరమైన వసతులు, సౌకర్యాలన్నీ తానే చూసుకున్నాడు. సివిల్స్‌ మీద దృష్టిపెట్టాను. ఆ ప్రయత్నంలో 44వ ర్యాంకు వచ్చింది. ఒకవిధంగా నన్ను మోటివేట్‌ చేసింది మాత్రం రవితేజనే. కనుక ఆ క్రెడిట్‌ కూడా ఆయనకే దక్కుతుంది. ప్రస్తుతం మాకు ఒక బాబు. మా ఇంటిలో అన్ని పనులూ అందరం చేస్తాం. నిజానికి నాకన్నా బాబుకు వాళ్లనాన్నే మంచిగా అన్నం తినిపిస్తారు.


ప్రయాణాలు ఇష్టం

సాధారణంగా భార్య సివిల్‌ సర్వీసెస్‏లో ఉండి, భర్త నాన్‌ సివిల్‌ సర్వీసెస్‌ అయినప్పుడు ఆ కుటుంబాల్లో కలతలు, కలహాలు తలెత్తడం సహజం. కానీ నన్ను పూర్తిగా అర్థం చేసుకొనే భర్త దొరకడం నా అదృష్టం. పెళ్లికి ముందు అమ్మా నాన్నా... ఇప్పుడు అమ్మా నాన్న, స్నేహితుడు అన్నీ నాకు రవితేజనే. ఇద్దరం కలిసి ఏడాదికి రెండుసార్లు టూర్‌కు వెళతాం. కేవలం వినోదమే కాదు కొత్త సంస్కృతులు, జీవనవిధానం, చరిత్ర వంటివి తెలుసుకోవడం కూడా మా ప్రయాణాల ప్రధాన ఉద్దేశం. ప్రేమికులంటే ఇలా ఉండాలి. ప్రేమ అంటే ఇదీ లాంటి తీర్పులు వెలువరించను. కానీ ప్రేమలో ఒకరిపట్ల మరొకరికి గౌరవం తప్పనిసరిగా ఉండాలి అంటాను.


ఈ వార్తలు కూడా చదవండి:

విధ్వంసం నుంచి వికాసం వైపు పరుగు

అల్లు వారి.. పెళ్లి ప‌నులు షురూ

Read Latest Telangana News and National News

Updated Date - Feb 14 , 2026 | 09:05 AM