ఈగలు, దోమలు బొద్దింకలతో విసిగిపోయారా? ఈ ఒక్కటి ట్రై చేయండి చాలు..
ABN , Publish Date - Jan 31 , 2026 | 04:28 PM
ఇంట్లో ఈగలు, దోమలు, బొద్దింకల బెడదతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకున్నా ఈ కీటకాలు ఇంట్లోకి వస్తునే ఉంటాయి. అయితే వీటిని తరమికొట్టడానికి ఈ ఒక్క చిట్కా ట్రై చేయండి.
ఇంటర్నెట్ డెస్క్: ఇంటి మూలలు, వంట గది, బయట ప్రదేశాల్లో ఈగలు, దోమలు, బొద్దింకలు ఎక్కువగా పెరుగుతుంటాయి. అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచడం చాలా అవసరం. అయితే కొన్నిసార్లు ఎంత శుభ్రంగా ఉంచినా ఈగలు, దోమలు, బొద్దింకలు ఇంట్లోకి రావడం సహజం. ఇవి ఇంటి వాతావరణాన్ని చెడగొట్టడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. వీటిని తరిమికొట్టేందుకు చాలామంది మార్కెట్లో దొరికే స్ప్రేలు, పురుగుమందులు వాడుతుంటారు. కానీ ఇవి చిన్న పిల్లలు, పెంపుడు జంతువులకు ప్రమాదకరం కావొచ్చు. అయితే రసాయనాలు అవసరం లేకుండా సహజంగా ఈ కీటకాలను దూరం పెట్టే మార్గం ఉంది.. అదే కర్పూరం. పూజల్లో ఉపయోగించే కర్పూరం.. ఈగలు, దోమలు, బొద్దింకలు తదితరాలను తరిమికొట్టడంలోనూ చాలా ఉపయోగపడుతుంది.
కర్పూరం..
వంటగదిలో బొద్దింకలు ఎక్కువగా సింక్ దగ్గర, పైపుల దగ్గర దాక్కుంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. దీని కోసం కర్పూరం తీసుకుని టిష్యూ పేపర్ లేదా పలుచని గుడ్డలో చుట్టి కిచెన్‌లో పెట్టండి. కర్పూరం వాసన వల్ల బొద్దింకలు, ఇతర కీటకాలు పారిపోతాయి.
ఈగలు, దోమలను తరిమికొట్టండిలా..
కర్పూరం పొగ సాధారణ ఈగలు, దోమలను కూడా దూరం చేస్తుంది. కర్పూరం వెలిగించి దోమలు ఎక్కువగా ఉండే చోట పెట్టండి. కర్పూరం వాసన వల్ల దోమలు, ఈగలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అంతేకాదు ఇంట్లో మంచి సువాసన కూడా వస్తుంది.
కర్పూరం వాడే మరికొన్ని మార్గాలు..
రెండు కర్పూరాలను నీటిలో కలిపి స్ప్రే బాటిల్‌లో పోయండి. ఈ నీటిని మూలలు, పడక దగ్గర, తలుపులు కిటికీల వద్ద స్ప్రే చేయండి. దోమలు దూరంగా ఉంటాయి.
దీపంలో వేప నూనె పోసి కర్పూరం వెలిగించండి. ఈ దీపాన్ని తలుపులు, కిటికీల దగ్గర పెట్టడం వల్ల ఈగలు, దోమలు లోపలికి రావు.
ఇంటిని శుభ్రం చేసే నీటిలో కర్పూరం పొడిని కలపండి. దీన్ని వంటగది కౌంటర్లు సహా మొత్తం ఇంటిని తుడవడానికి ఉపయోగించవచ్చు. ఇది కీటకాలను అడ్డుకోవడమే కాకుండా ఇంటిని సువాసనతో నింపుతుంది.
ఇలా కర్పూరం వాడితే రసాయనాలు అవసరం లేకుండా.. ఈగలు, దోమలు, బొద్దింకల సమస్య నుంచి సహజసిద్ధంగా ఉపశమనం పొందొచ్చు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?
పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?
For More Latest News