Share News

సవాళ్లతో సహవాసం.. జెన్ జీ... జయహో!

ABN , Publish Date - Feb 22 , 2026 | 12:10 PM

పాతికేళ్లు దాటకుండానే కెరీర్‌ అనిశ్చితి... మిగతావారికన్నా వెనకబడుతున్నానా అనే అనుమానం.. మరో పక్క ఏకాగ్రతను దెబ్బతీస్తూ కాలాన్ని హరించివేసే సోషల్‌ మీడియా ప్రభావం! అన్ని దిక్కుల నుంచీ ఎడతెగని సవాళ్ల కెరటాలు... గతంలో ఎన్నడూ లేనంతగా మనదేశ యువతీ యువకులను ముంచెత్తుతున్నాయి.

సవాళ్లతో సహవాసం.. జెన్ జీ... జయహో!

పాతికేళ్లు దాటకుండానే కెరీర్‌ అనిశ్చితి... మిగతావారికన్నా వెనకబడుతున్నానా అనే అనుమానం.. మరో పక్క ఏకాగ్రతను దెబ్బతీస్తూ కాలాన్ని హరించివేసే సోషల్‌ మీడియా ప్రభావం! అన్ని దిక్కుల నుంచీ ఎడతెగని సవాళ్ల కెరటాలు... గతంలో ఎన్నడూ లేనంతగా మనదేశ యువతీ యువకులను ముంచెత్తుతున్నాయి. ఈ అస్తవ్యస్తపు ఉక్కిరిబిక్కిరుల మధ్య ఊపిరి తీసుకుంటూ.. ఈ ప్రపంచంలో తమదైన ముద్ర కోసం ముందుకుసాగుతోంది జనరేషన్‌ జెడ్‌ (జెన్‌ జీ). నేటి యువతరంపై ప్రభావం చూపుతున్న బహుముఖ ఒత్తిళ్లూ, వాటిని సులువుగా, తెలివిగా ఎదుర్కొనే మెలకువలూ.. ఈ కవర్‌ స్టోరీలో!

మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధ రంగం. శత్రు దుర్భేద్యమైన పద్మవ్యూహం ఛేదించి లోపలికి ప్రవేశించాడు అభిమన్యుడు. సహాయం అందించేందుకు వచ్చిన పాండవ వీరులను సైంధవుడు అడ్డుకోవడంతో ఒంటరిగానే అద్భుత పరాక్రమం చూపాడు. రథం కోల్పోయి, నిరాయుధుడై కూడా కౌరవ మహాయోధులను సాహసంతో ఎదుర్కొన్నాడు.

ఆధునిక భారతంలో తమ ఉనికిని వెతుక్కుంటూ పరిశ్రమిస్తున్న మన యువత స్థితిని అభిమన్యుడి పోరాటంతో పోల్చవచ్చు. కౌరవ యోధులు మూకుమ్మడిగా దాడి చేసినట్టు విభిన్నరకాల ఒత్తిళ్ల సవాళ్లు! అయితే ఈ కెరీర్‌ పద్మవ్యూహంలో వారు నిస్సహాయులేమీ కారు. లక్ష్య సాధనలో సీనియర్ల గైడెన్స్‌, ఆత్మీయుల ఆసరా, దారి చూపే మెంటారింగ్‌, మానిసిక స్థైర్యాన్నిచ్చే కౌన్సెలింగ్‌లు వారికి రక్షా కవచాలు. చిక్కులు తొలగించుకొని ముందుకు సాగదల్చుకుంటే వారిని ఏ సైంధవుడూ ఆపలేడు!


book8.2.jpgసంక్లిష్ట తరం

దేశ జనాభాలో 40 శాతం ఉన్న యువత అంటే.. ఉరకలేసే ఉత్సాహం.. ఉల్లాసాలు.. భవిష్యత్‌ స్వప్నాలు.. ఇవి మాత్రమేనా? పరీక్షలూ, కెరీర్లు, కుటుంబ ఆకాంక్షలు, సోషల్‌ మీడియా పోలికలు, జీవితంలో ప్రతిదీ ఇప్పటికే ఆలస్యమైపోయిందనే ఫీలింగ్స్‌...

ఎగ్జామ్స్‌ నుంచి ఎక్స్‌పెక్టేషన్స్‌ వరకూ... మనీ నుంచి మెంటల్‌ హెల్త్‌ వరకూ.. ఈ రోజుల్లో యువత మునుపెన్నడూ ఎరగని హై ప్రెషర్‌ వాతావరణంలో పెరుగుతోంది. అవును, ఇప్పుడున్నది ప్రెషర్‌ జనరేషన్‌ శకం!

వీరిలో ఆత్మవిశ్వాసం.. అభద్రత సమపాళ్లలో కనిపిస్తాయి. తమను ప్రేమించుకుంటారు. అందుకు భిన్నంగా స్వీయ విమర్శలో మునిగిపోతారు. ఈ వైరుధ్యాల భావోద్వేగ సంక్లిష్టత వారి నైజం.

సామాజిక మాధ్యమ వధ్యశిలపై తమ సామర్థ్యంపై సందేహ పరంపర. నిరంతరం వారిని వెన్నంటివుండే నేపథ్య సంగీతం.. మానసిక ఆందోళన!


చిక్కుముళ్లు మూడు

స్మార్ట్‌ ఫోన్లు, సోషల్‌మీడియాతో పెరిగిన తొలి తరం.. జెన్‌ జీ. వీరిని వేధిస్తున్న సమస్యల్లో మూడు ప్రధానమైనవి.

1 విద్య, కెరీర్‌ అనిశ్చితి

‘బాగా చదవకపోతే వెనకబడిపోతావు’ అని స్కూలు నుంచి కాలేజీ వరకూ ఒకటే గట్టిగా చెప్తుంటాం. తర్వాత కూడా ఇతరులతో అంతులేని పోలికలు తీసుకొస్తుంటాం.

స్కూలు, కాలేజీ దశలో విద్యార్థుల్లో 60 శాతానికి మించి మానసిక ఒత్తిడికి గురవుతున్నారని అనేక విద్యా సర్వేలు తేల్చిచెప్పాయి.


book8.3.jpgఒత్తిళ్లు: పరీక్షలు, మార్కులు, ప్లేస్‌మెంట్లు, ఉద్యోగ భద్రతపై అనిశ్చితి, వెనకబడతామేమోనన్న భయం.

ఏం చేయాలి: జేఈఈనో, ఇంకో పరీక్షో కాదు, కెరీర్‌ మాత్రమే మారథాన్‌ అని గుర్తించాలి. నైపుణ్యాలు పెంచుకోవాలి. అందుకు ఆన్‌లైన్‌ వేదికలైన కోర్స్‌ఎరా, స్కిల్‌ ఇండియా, యూట్యూబ్‌ లెర్నింగ్‌లను సద్వినియోగం చేసుకోవాలి. డిజిటల్‌ స్కిల్స్‌, కమ్యూనికేషన్‌ సామర్థ్యాలు, ఇంటర్న్‌షిప్స్‌పై దృష్టి పెట్టాలి.

ర్యాంకులపై మితిమీరిన మోజు వదిలెయ్యాలి. తమ లక్ష్యాల వాస్తవికత గురించి తల్లిదండ్రులతో, మెంటార్లతో అరమరికల్లేకుండా మాట్లాడుతుండాలి.

కెరీర్‌ మారడం, విద్యా సంవత్సరంలో విరామం (గ్యాప్‌ ఇయర్‌)- ఓటమిగానో, వెనకబాటుగానో భావించనక్కర్లేదు. నిజానికివి అభివృద్ధి వైపు వేసే అడుగులే.


2 కుటుంబ... సామాజిక అంచనాలు

కొందరు యువతీయువకులు తమ తల్లిదండ్రుల కన్నా ఎక్కువే సంపాదిస్తున్నారు. కానీ పట్టణాలూ, నగరాల్లోని అద్దెలు, జీవనశైలి ఖర్చుల మూలంగా పొదుపులో వెనకబడివుంటున్నారు. సురక్షిత కెరీర్‌ ప్రయత్నాల వల్ల వారి వివాహ నిర్ణయం, సొంత గృహం/ ఫ్లాట్‌ సమకూర్చుకోవడం బాగా ఆలస్యం అవుతోంది.

మన భారతీయ ఇళ్లల్లో చాలా సందర్భాల్లో ఒత్తిళ్లు అపరిచితుల నుంచి రావు. ఆలనాపాలనా చూసే ఆత్మీయుల నుంచే అవి ప్రేమపూర్వకంగానే వస్తుంటాయి. కుటుంబ ఆకాంక్షలే దేశంలోని యువత ఎదుర్కొంటున్న కీలకమైన ఒత్తిళ్లలో ఒకటిగా యూత్‌ మెంటల్‌ హెల్త్‌ నివేదిక గుర్తించింది.


ఒత్తిళ్లు: సురక్షిత కెరీర్లను ఎంచుకోమనడం, వయసు మీరుతోందని వివాహానికి తొందరపెట్టడం, పరువు మర్యాదల చర్చలు.

ఏం చేయాలి: యువత తమ వైఖరినీ, అభిప్రాయాలనూ తల్లిదండ్రులతో స్పష్టంగా చెబుతుండాలి. మనసుకు నచ్చకపోతే అపరాధభావన లేకుండా గౌరవప్రదంగా ‘నో’ చెప్పడం నేర్చుకోవాలి. తమ అంతరంగం అర్థం చేసుకోగలిగిన ఆత్మీయ వ్యక్తుల సహకారం తీసుకోవచ్చు. భావాలు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారానే అవగాహన సాధ్యం. ఘర్షణ పడటం వల్ల మనస్తాపాలు పెరగటం తప్ప ఫలితమేమీ ఉండదు.

యవ్వన దశలో ప్రతిఒక్కరికీ కెరీర్‌లోనూ, సంబంధ బాంఽధవ్యాల విషయంలోనూ అనిశ్చితి ఓ భాగమని గ్రహించాలి. అది వ్యక్తిగత లోపమేమీ కాదు.


book8.4.jpg3 సోషల్‌ మీడియా.. పోలికలు

24/7 కనెక్టివిటీ, మొబైల్‌ నోటిఫికేషన్ల జోరుతో మెదడు శాశ్వత అలర్ట్‌ మోడ్‌లో కొనసాగుతూవస్తోంది. మానసిక ఒంటరితనం మిగిలి హెచ్చుస్థాయి ఆందోళనలు, సరిగా నిద్ర పట్టని రుగ్మతలు పెరుగుతున్నాయి.

ఇతరులతో పోల్చుకుని వారిని గుడ్డిగా అనుకరించే విషవలయంలోకి సోషల్‌ మీడియా యువతను లాగేస్తోంది. విజయవంతమైన వ్యక్తులుగా అందరినీ ఆకర్షించాలనీ, సమ్మోహనకర జీవనశైలితో అదరగొట్టెయ్యాలనీ కలలు కనే ధోరణి పెరుగుతోంది.

వ్యక్తిగత గోప్యతకు దూరంగా ‘కెమెరా ఎదురుగా’ ఎదిగేస్తున్న జెన్‌ జీ.. విమర్శలను భరించలేని సున్నితత్వంతో సతమతమవుతోంది. బయటివారి నుంచి లైక్స్‌, కామెంట్స్‌ ద్వారా స్వీయ విలువ పెరుగుతుందనే భ్రమ చాలామందిలో కనిపిస్తోంది.


ఒత్తిళ్లు: అవాస్తవిక విజయాలు, ఇతరుల శరీరాకృతితో పోలికలు, ముఖ్య సమాచారమేదో తప్పిపోతుందనే భయం (ఫియర్‌ ఆఫ్‌ మిస్సింగ్‌ అవుట్‌- ఫోమో), రోజుకు 6-7 గంటల సగటు స్ర్కీన్‌ టైమ్‌లో చూసే, చదివే అంశాలతో ఆందోళన, భావోద్వేగ అలసట, పైపై మెరుగుల జీవనశైలి, ప్రమాణాల కోసం వెంపర్లాట.

ఏం చేయాలి: తమను న్యూనత పరిచే స్వభావమున్న సమాచారం పట్టించుకోకుండా వదిలెయ్యాలి. స్ర్కీన్‌ టైమ్‌ తగ్గించుకోవాలి. రీల్స్‌పై కాకుండా రియల్‌ లైఫ్‌ మెరుగుదలపై దృష్టిపెట్టాలి. ఆన్‌లైన్‌ ఆమోదాల కన్నా ఆఫ్‌లైన్‌ ఉన్నతి ముఖ్యం.

ప్రతిరోజూ మంచి అలవాట్లు సాధన చేయాలి. నడక, దినచర్య రాయడం, మెడిటేషన్‌, సోషల్‌ మీడియా వినియోగాన్ని కట్టడి చేయడం అవసరం.


book8.5.jpgకృత్రిమ మేధతో కలవరం

2026లో ఉద్యోగ సాధన విషయంలో 84 శాతం మంది భారతీయ యువ వృత్తినిపుణులు సంసిద్ధతతో లేరని ఇటీవలి అధ్యయనం చెపుతోంది. ఎందుకంటే .. సంప్రదాయ ప్లేస్‌మెంట్ల పంథాకు భిన్నంగా ఏఐ డ్రివెన్‌ నియామకాలు పెరిగాయి. నిర్దిష్టమైన, ఉన్నత స్థాయి నైపుణ్యాలున్నవారికి మాత్రమే అవకాశాలు దక్కుతున్నాయి.

కృత్రిమ మేధ (ఏఐ) మూలంగా కొలువులకు ముప్పు ఏర్పడుతోందన్న భయం తక్కువేమీ లేదు. అందుకే జెన్‌ జీలో 57 శాతం మంది కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రాముఖ్యం ఇస్తున్నారు.


పెరుగుతున్న ధరలు, భద్రత లేని ఉద్యోగాలు ఓ పక్క.. వీలైనంత త్వరగా సంపాదించాల్సిన అనివార్యత మరో పక్క. చాలామందికి 8 గంటల కొలువు ద్వారా వచ్చే సంపాదన ఆర్థిక భద్రతకు సరిపోక పార్ట్‌టైమ్‌ పనులవైపు చూస్తున్నారు. ఇలా యువత రకరకాల ఆదాయ మార్గాల వెంటబడుతూ ఒత్తిడికి గురవుతోంది.

పరిష్కారంగా.. బడ్జెటింగ్‌, పొదుపు, మదుపు లాంటి ఆర్థిక అంశాల గురించి ప్రాథమికంగానైనా అవగాహన పెంచుకోవాలి. కంటెంట్‌ క్రియేషన్‌, డిజైన్‌, ట్యూటరింగ్‌, ఫ్రీలాన్సింగ్‌, గిగ్‌ వర్క్‌ లాంటి పార్ట్‌టైమ్‌ జాబ్స్‌తో అదనపు సంపాదన ఆచరణ సాఽధ్యమే. అయితే.. సోషల్‌ మీడియా విజయ గాథలతో తమను పోల్చుకొని నిరాశపడే ధోరణి తగ్గించుకోవాలి.


book8.6.jpgమానసిక ఆరోగ్యం

దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థలు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీలు). వీటిలో ఏటా సగటున 12 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని నివేదికలు చెపుతున్నాయి. కోర్సులపరమైన ఒత్తిడి, ఫెయిలవుతామనే భీతి, కుంగుబాటుల పర్యవసానాలే ఇవి.

విద్యలోనైనా, ఉద్యోగ దశలోనైనా కేంద్రీకృత ఒత్తిడిని తగ్గించుకోవాలంటే విరామం తీసుకోవడం, అభిరుచులను ఆస్వాదించడం, తీరుబడి కార్యకలాపాల్లో నిమగ్నం కావడం అవసరం. స్నేహితులతో ఆంతరంగిక విషయాలు పంచుకుంటూ ఉండాలి. అవసరమైతే హెల్ప్‌లైన్స్‌ను ఉపయోగించుకోడానికి వెనకాడకూడదు. ఒంట్లో బాగా లేనప్పుడు డాక్టరును సంప్రదించి మందులు వాడతాం కదా? అలాగే మనసంతా దిగులు, నిరాశ కమ్ముకున్నపుడు నిపుణుల కౌన్సెలింగ్‌, నార్మలైజ్‌ థెరపీ తీసుకోవటంలో కించపడాల్సిన పనేమీ లేదు.

పొరపాట్లు జరిగితే, ఓటమి ఎదురైతే ఎవరికి వారు తమను తాము నిందించుకోవడం సరి కాదు. స్నేహితులను ఓదార్చినట్టు తమపై ప్రేమ, దయ చూపించుకోవాలి (సెల్ఫ్‌ కంపాషన్‌). దీంతో మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది.


చివరిగా..

ఏమాటకా మాట చెప్పుకోవాలి. ఒత్తిళ్ల వలయంలో పడిపోతున్న కొత్త తరం యువతీయువకులు అంత నిరాశావాదులేమీ కాదు. బద్ధకాన్ని దరి చేరనీయకుండా తరగని ఉత్సాహంతో ముందుకు దూసుకుపోయేవాళ్లే ఎక్కువ.

అత్యంత వేగంగా మారిపోతున్న ప్రపంచంలో త్వరితంగా నేర్చుకోవడం, వేగంగా దేనిలోనైనా ఇమిడిపోగలగడం వీరికి మౌసుతో పెట్టిన విద్య. ఈ ఎదుగుదలే వారి దృష్టిలో గెలుపు. అది ఒక పరీక్ష నెగ్గటమో, ఫ్యాట్‌ పే ప్యాకెట్టో కాదని వారికి తెలుసు.

వన్‌ ట్రాక్‌ మైండ్‌ సెట్‌ను జెన్‌ జీ తిరస్కరిస్తోంది. నైపుణ్యాల సాధనకూ, తరగతి గదుల వెలుపల నేర్చుకోవడానికీ ప్రాముఖ్యం ఇస్తోంది. అకడమిక్‌ డిగ్రీలు మాత్రమే సరిపోవు.. వాటికున్న ప్రాధాన్యమే స్కిల్స్‌, స్కోర్లు, కంటెంట్‌ క్రియేషన్‌, ఇంటర్న్‌షిప్‌లు, ఆన్‌లైన్‌ కోర్సులకు కూడా ఉంటోందని.. ఈ తరం యువతీ యువకులు సరిగానే గుర్తిస్తున్నారు.


‘నీ ప్రోగ్రెస్‌ ఎలా ఉంది?’ అని సగటు భారతీయ యువతను అడిగితే వారిచ్చే సమాధానం- ‘ఒత్తిడి విపరీతంగా ఉంది. నిజమే. అయినా పర్లేదు. సక్సెస్‌ కోసం ఓపిగ్గా ప్రయత్నిస్తూనే ఉంటా’.

గెలిచే దారి కనపడకుండా చేసే ఒత్తిళ్లు వీరికి పెద్ద అవరోధం. పరిష్కారాలను వెతక్కుండా అవి వాటికవే మాయమైపోవు. చేయాల్సిందల్లా తగిన అవగాహన పెంచుకోవడం, ఆసరా స్వీకరించడం, తట్టుకుని, పుంజుకుని నిలబడటం. ఈ ఎరుక కొత్త తరంలో కనిపించడం శుభ పరిణామం!

- సండే డెస్క్‌


zzzz.jpgయువతరం స్వరం

జెన్‌ జీ తమ మనోగతానికి

అక్షర రూపం ఇస్తే... అదెలా

ఉంటుందో చూద్దామా?

  • ‘ఆంక్షలూ, ఆకాంక్షల మధ్య పెరిగాం మేం.

  • మార్పును స్వాగతిస్తాం. దానిలో భాగమవుతాం.

  • గట్టిగా పోటీ పడతాం, ఇట్టే ఇమిడిపోతాం కొత్తదేదైనా

చకచకా నేర్చుకుంటాం.

  • తప్పులు గమనించుకుంటాం. శ్రద్ధగా సరిదిద్దుకుంటాం.

  • ఫలితాల్లో ఓటమి ఎదురుకావొచ్చు కానీ మా ప్రయత్నాల్లో కాదు.


  • ఆన్‌లైన్‌లో జీవిస్తాం.. నిజ జీవితానికీ విలువ ఇస్తాం.

  • పెద్దలు చెప్పింది వింటాం.

    కానీ గుడ్డిగా అనుసరించలేం.

  • అర్థవంతమైన సంభాషణ కోరుకుంటాం. అర్థం లేని నియంత్రణ కాదు.

  • మా ప్రశ్నల్లో బలాన్నీ.. నిజాయితీలో ధైర్యాన్నీ చూడండి.

  • మాపై నమ్మకం ఉంచండి.

  • రేపటి మా ఉన్నతిని గమనించండి!


మీకు తెలుసా?

  • 10 మంది భారతీయ విద్యార్థుల్లో ఏడుగురు తమ విద్యాభ్యాస కాలంలో అశాంతికీ, తీవ్ర అలసటకూ గురవుతున్నారు.

  • యువతీయువకుల్లో 67 శాతం మందిలో విద్య, కెరీర్‌ ఒత్తిడి వారి మానసిక ఆరోగ్యంపై అధిక ప్రభావం చూపుతోంది.

  • రోజుకు 6-7 గంటల సగటు స్ర్కీన్‌ టైమ్‌ మూలంగా యువతలో ఆత్మవిశ్వాసం తగ్గి, ఆందోళనలు అధికమవుతున్నాయి.

  • 18 -30 ఏళ్ల వయసున్నవారిలో కౌన్సెలింగ్‌, థెరపీలను కోరుకునేవారి సంఖ్య గత కొద్దిఏళ్లలో గణనీయంగా పెరిగిందనేది మానసిక వైద్య నిపుణుల మాట.

  • ఎక్కువమంది యువత భయం.. ఓడిపోతామని కాదు, వెనకబడతామని.


ఈ వార్తలు కూడా చదవండి:

చందమామ ‘చిన్న’బోతోంది

జీపీ భవనం కోసం అప్పు..సొంత భూమి తనఖా

Read Latest Telangana News and National News

Updated Date - Feb 22 , 2026 | 12:28 PM