సబ్బు నురగలు... సరికొత్తగా...
ABN , Publish Date - Feb 15 , 2026 | 01:55 PM
ఒకప్పుడు ‘లైఫ్‌బాయ్’ సామాన్యుల సబ్బు... ‘లక్స్’ కొంటే సినిమా తారల్ని చూసినట్టు చూసేవారు. ఇంటిల్లిపాదికి ఒకే సబ్బు... లిరిలైనా, సింథాలైనా.
ఒకప్పుడు ‘లైఫ్‌బాయ్’ సామాన్యుల సబ్బు... ‘లక్స్’ కొంటే సినిమా తారల్ని చూసినట్టు చూసేవారు. ఇంటిల్లిపాదికి ఒకే సబ్బు... లిరిలైనా, సింథాలైనా. కానీ ఇప్పుడో... జమానా మారింది. శరీరతత్వం, సీజన్... ఆర్గానిక్, హెర్బల్, హ్యాండ్‌మేడ్ అంటూ తీరొక్క సబ్బు నురగలు కక్కుతోంది. డ్రైస్కిన్, టాన్, మాయిశ్చరైజ్ అంటూ మెస్మరైజ్ చేస్తున్నాయి. అ‘ధర’హో అనిపిస్తున్న అలాంటి సబ్బులపై ఓ లుక్కేద్దాం...
ఆఫ్రికా అందాల కోసం...
ఎన్నో శతాబ్దాలుగా పశ్చిమ ఆఫ్రికా ప్రజల సౌందర్య ప్రపంచంలో బ్లాక్ సోప్ ప్రసిద్ధి చెందింది. పేరుకి నలుపే కానీ ఈ సబ్బు వర్ణం ముదురు గోధుమ. కొకొ పొడి, వెన్న, కొబ్బరి నూనెతో ఈ సబ్బును తయారుచేస్తారు. కొన్ని చోట్ల షియా వెన్న, తేనె, నిమ్మకాయ, కలబంద, పామాయిల్, అరటి తొక్క పొడి, ఆకులు, బెరడూ వినియోగిస్తున్నారు. ఇవన్నీ చర్మసంరక్షణకు ఉపయోగపడేవే. అయితే అక్కడ శతాబ్దాలుగా వినియోగించడం వల్ల ఆఫ్రికన్ నల్ల సబ్బు గురించి స్థానికులు కొన్ని విశేషాలు ఘనంగా చెబుతారు. ఈ సబ్బు వల్ల నల్ల మచ్చలు, మొటిమల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇందులో ఉన్న చెట్ల బెరడు, ఆకుల వల్ల సాధారణ సబ్బులా మృదువుగా కాకుండా కాస్త గరుకుగా ఉంటుంది. కాబట్టి చర్మాన్ని లోతుగా పరిశుభ్రపరుస్తుంది. బ్లాక్ హెడ్స్‌ను తొలగిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలూ ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం మన దేశంలోనూ ఈ సబ్బు లభించడం విశేషం.
ముల్తానీ సొబగులు
చర్మ సంరక్షణలో పసుపు తరవాత ముల్తానీ మట్టికే భారతీయ మహిళలు అధిక ప్రాధాన్యం ఇస్తారు. సహజసిద్ధమైన ముల్తానీ మట్టితో చేసిన సబ్బులూ మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. ఈ మట్టికి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతో పాటు... చర్మాన్ని చల్లబరిచే స్వభావం కూడా ఉంది. మొటిమలు తగ్గించడానికి, చర్మాన్ని లోతుగా పరిశుభ్రపరచడానికి ముల్తానీ మట్టిని వాడడం మామూలే. కొత్తగా వస్తోన్న ముల్తానీ సబ్బులూ ఈ దిశలో పనిచేయడం విశేషం. ఇన్‌స్టంట్ ఫలితాలు కాకుండా క్రమంగా వినియోగించడం వల్ల సరైన ఫలితాలను పొందవచ్చు.
పరిమళభరితం
లెమన్ గ్రాస్ గురించి ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. చాలామంది తమ ఇళ్లల్లో ఈ గడ్డి మొక్కల్ని పెంచుతున్నారు. ఒత్తిడిని తగ్గించి సత్వరం తాజాదనాన్ని అందించేదిగా నిమ్మగడ్డి టీ మార్కెట్ ప్రచారాలలో ముందుంది. ఇదే ఫార్ములాతో ‘లెమెన్ గ్రాస్’ సబ్బులూ వచ్చేశాయి. వీటిని మరింత సువాసనభరితం చేసేందుకు పుదీనాను చేర్చుతున్నారు. యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్‌తో పాటు యాంటీ మైక్రోబియల్ సుగుణాలు ఈ సబ్బుల్లో ఉన్నాయని చెబుతున్నారు. చర్మం కాంతివంతంగా కనిపించడంతో పాటు మచ్చలు, ముడతలు తగ్గేలా చేస్తుంది.
కుంకుమపువ్వు మృదుత్వం
‘కాంతివంతమైన చర్మం, మచ్చలు లేని ముఖారవిందం, పట్టులాంటి చర్మ మృదుత్వం... మీ సొంతం కావాలంటే కుంకుమ పువ్వుతో చేసిన సబ్బులను వాడండి, చక్కటి ఫలితాల్ని అందుకోండి’ అంటున్నారు కేసరి సబ్బుల తయారీదారులు. కొన్ని కేసరి రేణువులను నానబెట్టిన పాలతో ముఖాన్ని, మెడను శుభ్రపరచుకోవడం అనాదిగా చేస్తున్నదే. దీనివల్ల చర్మం తేజోమయంగా మారుతుంది. ఇదే టెక్నిక్ నేడు కేసరితో సబ్బులు తయారుచేసేలా చేసింది. ఎందుకంటే కేసరిలో యాంటీ ఏజింగ్ ఫార్ములాలు ఉన్నాయి. ఇంకా చర్మంలోని తేమను కాపాడుతుంది. ముడతలను తగ్గించి యవ్వనంగా ఉంచుతుంది.
వాఫిల్ తరహా...
పిల్లలూ పెద్దలూ చాలా ఇష్టంగా తినేవి వాఫిల్స్. కేక్‌లను తలపించే వాఫిల్స్‌పైన తేనె పోస్తారు. పండ్లు, క్రీములతో అలంకరిస్తారు. వీటి రుచి అద్భుతం. ఇప్పుడు అచ్చంగా వాఫిల్స్‌లాంటి సబ్బులు వచ్చేశాయి. అచ్చుల్లో పోసి చతురస్ర, వృత్తాకారాల్లో ‘వాఫిల్ సోప్’లను తయారుచేస్తున్నారు. ఉత్తుత్తి క్రీమ్, బటర్, సిరప్‌లతో పైన అలంకరిస్తున్నారు. ఈ సబ్బులను కొబ్బరి నూనె, కొకొ బటర్, ఆలివ్ ఆయిల్ తదితరాలతో... అన్ని రకాల చర్మాలకి తగినట్టుగా రూపొందించడం విశేషం. ప్రస్తుతం మార్కెట్లో చాక్లెట్, క్యారమెల్, వెనీలా, స్ట్రాబెర్రీ క్రష్ వాఫల్ సోప్ మొదలైనవి అందుబాటులో ఉన్నాయి. ఈ సోప్‌లను మెషీన్ల మీద కాకుండా హ్యాండ్‌మేడ్‌గా చేస్తారు. చూడటానికి అందంగా, స్నానం చేస్తుంటే చక్కని సువాసనలతో తాజాదనాన్ని అందిస్తాయి.
బొగ్గు మెరుపులు
ఇటీవల చర్మసంరక్షణలో సహజ, సమగ్రమైన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ఫ్యాక్టరీల్లో తయారైన వాటి కన్నా సహజసిద్ధమైన పదార్థాలతో, చేతులతో తయారుచేసిన సబ్బుల వినియోగం పెరిగింది. ఈ కోవలోకే వస్తాయి బొగ్గు పొడి (చార్‌కోల్)తో తయారుచేసిన సబ్బులు. ఇవి చర్మ రంధ్రాల్లోని మలినాలు, ధూళిని లోతుగా శుభ్రపరుస్తాయి. మృతకణాలను తొలగించి చర్మాన్ని డిటాక్స్ చేస్తాయి. చార్‌కోల్ సబ్బులలో మేక పాలతోపాటు ఆముదం, కొబ్బరి నూనెలను చేర్చి బేస్‌ను తయారుచేస్తారు. అందుకే ఇవి మలినాలు తొలగించడంతో పాటు చర్మాన్ని తాజాగా ఉంచుతాయి. అయితే ఈ సబ్బుల్ని ఎక్కువగా వినియోగించొద్దు. ఎందుకంటే వీటి వల్ల చర్మం పొడారినట్టు అవుతుంది.
లావెండర్ లావణ్యం
పూల సువాసనే కాదు... అలాంటి లుక్‌తో ఆకర్షణీయమైన సబ్బులు మార్కెట్‌ను నేడు ఊపేస్తున్నాయి. అవే ‘లావెండర్ సోప్’లు. లావెండర్ ఆకులు చేర్చి షియా వెన్నతో చేసిన ఈ సబ్బులను అచ్చుల్లో వేసి పూలరెక్కల లాంటి ప్రత్యేకమైన రూపాన్ని తీసుకువస్తున్నారు. షియా బటర్‌లో విటమిన్ ఎ, ఇ, ఎఫ్‌లు ఉండడం వల్ల చర్మ రక్షణలో ఎంతో కీలకపాత్ర వహిస్తుంది. చర్మం మృదువుగా, తేజోమయంగా మారుతుంది. చర్మానికి మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుంది. అలాగే లావెండర్ సువాసనల వల్ల ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి, మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. కొంతమంది సబ్బు ఉత్పత్తిదారులు పొద్దుతిరుగుడు పూలు, గులాబీ రేకులు, తేయాకులు లాంటివి కూడా ఇందులో చేర్చి కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.
చూడటానికి ముచ్చటగా, పరిమళభరితంగా... ఒక్కొక్కరి శరీరతత్వానికి తగ్గట్టుగా పర్సనల్ ఛాయిస్‌తో... సూపర్‌మార్కెట్లో ఆకర్షిస్తున్న కొత్తరకం సబ్బుల వైపు నవతరం మొగ్గుచూపుతోంది. ఆలోవెరా, గ్లిజరిన్, చార్‌కోల్, ఆప్రికాట్... నేచురల్, ఆర్గానిక్, బొటానికల్... హైడ్రేట్, డిటాక్స్, టాన్, యాంటీ ఏజింగ్ అంటూ సరికొత్త పదాలతో జలకాలాటలో జతకూడుతున్నాయి. ఏదేమైనా... రెగ్యులర్ సబ్బులు ఎన్ని ఉన్నా... ‘అబ్బో’ అనిపిస్తున్న కొత్తరకం సబ్బుల నురగలో యువతరం ఉరకలేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
‘నేనే రాజు.. నేనే మంత్రి..’ అదే నిజమా..!
గుమ్మడి నర్సయ్యకు గౌరవ డాక్టరేట్
Read Latest Telangana News and National News