విదేశీ గళం... గరం గరం...
ABN , Publish Date - Feb 01 , 2026 | 08:52 AM
ఒక నిమిషం 45 సెకన్ల ‘ఫాస్లా’ అరబిక్ పాట... ‘ధురంధర్’ సినిమాలో హైలైట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారి, బిలియన్ వ్యూస్ దాటింది.
ఒక నిమిషం 45 సెకన్ల ‘ఫాస్లా’ అరబిక్ పాట... ‘ధురంధర్’ సినిమాలో హైలైట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారి, బిలియన్ వ్యూస్ దాటింది. ఆ పాట పాడిన బహరైన్ ర్యాపర్ ఫ్లిప్పెరాచీ రాత్రికి రాత్రే సెన్సేషనల్ సింగర్‌గా మారాడు. ఆ క్రేజ్‌తో ఇండియాలో ఫ్లిప్పెరాచీ సంగీత కచేరీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇంతకు ముందు కూడా బాలీవుడ్ పాటలు పాడి, విదేశీ గాయకులు మాయ చేశారు. ఆ మ్యాజిక్ గీతాల్లో కొన్ని...
అత్యధికంగా డౌన్‌లోడ్
షారుక్ ఖాన్ సూపర్‌హీరోగా నటించిన చిత్రం ‘రా.వన్’. 2011లో విడుదలైన ఈ సినిమా అంతగా హిట్ కాలేదు కానీ, అందులోని ‘ఛమ్మక్ ఛల్లో’ పాట సూపర్ డూపర్ హిట్. అప్పట్లో పెళ్లిళ్లు, కాలేజీ, స్కూల్ ఫంక్షన్లలో తప్పకుండా ఈ పాట మారుమ్రోగేది. విశాల్ - శేఖర్ ద్వయం సంగీతం అందించిన ఈ పాటను అమెరికన్ గాయకుడు ‘అకాన్’తో కలిసి హంసికా అయ్యర్ ఆలపించారు. ఆ ఏడాది అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న వీడియో, పాటగా రికార్డు సృష్టించింది. ‘ఐట్యూన్స్’ టాప్ 10 వరల్డ్ సాంగ్స్‌లో స్థానం సాధించింది. అంతేకాదు ఈ పాటకు విదేశీ గాయకుడైన ఆకాన్ బెస్ట్... ప్లేబ్యాక్ సింగర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకోవడం విశేషం.
ఒకే ఒక్క పాటతో...
ఫ్లిప్పెరాచీ... సమకాలీన సంగీత ప్రపంచంలో ఓ సంచలనం. పూర్తి పేరు హుస్సామ్ అసీమ్. అభిమానులు ముద్దుగా ‘ఫ్లిఫ్’ అని పిలుస్తారు. అయితే ఈ బహ్రెయినీ గాయకుడు నిన్నటిదాకా పెద్దగా ఎవరికీ తెలియదు. వాస్తవానికి ‘ఫాస్లా’ పాట 2024 జూన్‌లోనే విడుదలైంది. అరబ్ దేశాలలో పెద్ద హిట్ కానీ భారతదేశంలో అంతగా తెలియదు. అయితే నేడు అది గ్లోబల్‌గా వైరల్ కావడానికి ‘ధురంధర్’ కారణం. అరబిక్ హిప్ - హాప్ పాటకు తబలా వాయిద్యాన్ని మిక్స్ చేసిన ఫాస్లా వినడానికి అద్భుతంగా అనిపిస్తుంది. తెరమీద ఆ పాటను రెహమాన్ డెకాయిట్ పాత్రధారి అక్షయ్‌ఖన్నా ఎంట్రీకి బ్యాక్‌గ్రౌండ్‌లో వాడారు. ఆ పాటలో అక్షయ్‌ఖన్నా స్టయిలిష్ నడక, స్టెప్పులు కూడా వైరల్‌గా మారాయి. అంతే... ఆ పాట పాడిన గాయకుడి కోసం ఇంటర్నెట్‌లో తెగ వెతికారు జనాలు. ‘ధురంధర్’ చిత్రబృందం తనను సంప్రదించినప్పుడే ఆ పాట హిట్ అవుతుందని ఫ్లిఫ్ భావించారట. ‘కానీ ఇంత పెద్ద హిట్టయ్యి, నా జీవితాన్నే మార్చేస్తుందని అస్సలు ఊహించలేద’ని అంటారు ఫ్ల్లిఫ్. ఈ మార్చిలో విడుదలకు సిద్ధమవుతున్న ‘ధురంధర్’ సీక్వెల్‌లో కూడా ఈ గాయకుడి మరో పాట ఉంటుందని హింట్ ఇస్తున్నారు.
ర్యాప్ యువరాణి
‘మణికే మగే హితే’... శ్రీలంకలో 2020లో విడుదలై హిట్టయిన ప్రేమగీతం. యోహనీ డిసిల్వా అనే శ్రీలంక ర్యాప్ గాయని యూట్యూబ్‌లో దానికి కవర్ సాంగ్ చేసి 200 మిలియన్ వ్యూస్ అందుకుంది. దాంతో అనేక భాషల్లో ఈ పాటను అనువదించారు. ‘ర్యాప్ ప్రిన్సెస్ ఆఫ్ శ్రీలంక’గా యోహనీ పేరు మారుమోగింది. విన్న వెంటనే హమ్ చేయాలనిపించే పాట. అందుకే అందరి నోళ్లలో నానుతూ పెద్ద హిట్ కొట్టింది. అలా చివరికి ‘థాంక్ గాడ్’లోకి వచ్చింది. 2022లో విడుదలైన ఈ చిత్రంలో యోహనీనే హిందీలో పాడడం విశేషం. నోరా ఫతేహి, సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన ఈ పాటను జుబిన్ నౌత్యాల్‌తో కలిసి యోహనీ ఆలపించారు. ఆ తరవాత ప్రత్యేక సంగీత కచేరీలకు యోహనీ భారతదేశం కూడా వచ్చారు.
ఆస్ట్రేలియా గాయని
అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన ‘బ్లూ’... అమెరికాలో హిట్టయిన ‘ఇంటూ ది బ్లూ’ సినిమా ప్రేరణతో తీశారు. ఆస్ట్రేలియాలో ఎంతో ప్రసిద్ధి చెందిన గాయని కిలీ మినోగ్ ‘చిగివిగీ’ అనే పాట పాడడమే కాదు, అక్షయ్‌తో కలిసి తెరపై నర్తించడం విశేషం. ఈ డ్యూయెట్‌ను సోనూ నిగమ్, కిలీ మినోగ్ పాడారు. 2009లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పల్టీకొట్డడంతో పాట అంతగా పాపులర్ కాలేదు. పైగా ఎ.ఆర్. రెహ్మాన్ సంగీత నిర్దేశకత్వంలో ఇంత పేలవమైన పాటా అని విమర్శలూ వచ్చాయి. అయితే కిలీ మినోగ్ గళం వెరైటీగా అందరికీ నచ్చింది.
బాలీవుడ్ బాద్షాతో డిప్లో
షారుక్ ఖాన్, అనుష్క శర్మ నటించిన ‘జబ్ హ్యారీ మెట్ సేజల్’ చిత్రం విడుదలకు ముందే మంచి హైప్‌ను క్రియేట్ చేసుకుంది. కారణం... 2017లో విడుదలైన ఈ చిత్రంలోని ‘ఫుర్’ అనే పాట. అది ఆ ఏడాది ఛార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఎందుకంటే ఆ పాటను అమెరికన్ డీజే, ప్రొడ్యూసర్ డిప్లో, సంగీత దర్శకుడు ప్రీతమ్ కలిసి రూపొందించారు. సినిమాలో ఉన్న పాటలో డిప్లో కనిపించలేదు. కానీ ప్రొమోషనల్ వీడియో సాంగ్‌లో షారుక్‌తో పాటు డిప్లో కనిపించి సంగీతప్రియులను అలరించారు.
తళుక్కుమన్న ‘స్నూప్’
అక్షయ్‌కుమార్, కత్రీనా కైఫ్ జంటగా నటించిన ‘సింగ్ ఈజ్ కింగ్’ ఎంత పెద్ద హిట్టో వేరే చెప్పక్కర్లేదు. 2007లో విడుదలైన ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ అప్పట్లో అతి పెద్ద సంచలనం. ఈ సినిమాకు ప్రీతమ్ సంగీతాన్ని అందించారు. అయితే టైటిల్ సాంగ్‌కు మాత్రం సంగీతాన్ని బ్రిటిష్ బ్యాండ్ ఆర్‌డిబి అందించింది. ఈ పాటకు మరో విశేషమూ ఉంది. ‘సింగ్ ఈజ్ కింగ్’ పాటలో అమెరికన్ ర్యాపర్, గాయకుడు స్నూప్ డాగ్, అక్షయ్‌తో కలిసి స్టెప్పులు వేశారు.
‘ధూమ్’ ధామ్...
అప్పట్లో దేశాన్ని ఓ ఊపు ఊపిన పాట ‘ధూమ్ మచాలే’. యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో 2004 లో వచ్చిన ‘ధూమ్’కు సీక్వెల్స్ వస్తూనే ఉన్నాయి. అభిషేక్ బచ్చన్, ఈషా డియోల్ నటించిన ఈ చిత్రంలోని ‘ధూమ్ మచాలే’ పాట ఎంత పెద్ద హిట్టో చెప్పాల్సిన పనిలేదు. ఆ ఏడాది టాప్ సాంగ్‌గా నిలిచింది. హిందీ వెర్షన్ పాటను సునిధీ చౌహాన్ పాడితే... ఇంగ్లీష్‌లో రీమిక్స్ చేసిన పాటను థాయి - అమెరికన్ పాప్ సింగర్ తాతా యంగ్ ఆలపించి, నర్తించింది కూడా. ప్రత్యేక మ్యూజిక్ వీడియోగా ఈ పాటను విడుదల చేశారు. 2004, 2005లలో ఆసియాలోని అనేక దేశాల మ్యూజిక్ ఛార్ట్‌లలో ఈ పాట టాప్ వన్‌గా నిలవడం విశేషం.
ఈ వార్తలు కూడా చదవండి.
ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News