అంతర్జాతీయ బంగాళాదుంప దినోత్సవం.. ఈ కూరగాయ వెనుక ఉన్న ఆసక్తికర చరిత్ర తెలుసా?
ABN , Publish Date - May 30 , 2026 | 05:15 PM
ప్రతి సంవత్సరం మే 30న అంతర్జాతీయ బంగాళాదుంప దినోత్సవాన్ని జరుపుకుంటారు. బంగాళాదుంపల చరిత్ర, ఆరోగ్య ప్రయోజనాలు, ఆయుర్వేద ప్రాధాన్యం, అలాగే వాటిని సరైన విధంగా తీసుకోవడం ద్వారా కలిగే లాభాల గురించి తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినియోగించే కూరగాయల్లో బంగాళాదుంప ఒకటి. ఇది కేవలం ఒక సాధారణ కూరగాయ మాత్రమే కాదు.. కోట్లాది మందికి ఆహార భద్రతను అందించే ముఖ్యమైన పంట. రైతులకు కూడా ఇది ప్రధాన జీవనాధారం. బంగాళాదుంపల ప్రాముఖ్యాన్ని గుర్తుచేసేందుకు ప్రతి సంవత్సరం మే 30న అంతర్జాతీయ బంగాళాదుంప దినోత్సవాన్ని జరుపుకుంటారు.
గ్లోబల్ వార్మింగ్, నీటి కొరత వంటి సవాళ్లు పెరుగుతున్న ఈ కాలంలో బంగాళాదుంప ఒక ఆశాజనకమైన పంటగా గుర్తింపు పొందుతోంది. గోధుమలు, వరి పంటలతో పోలిస్తే తక్కువ నీటితో పెరుగుతుంది. తక్కువ సమయంలోనే దిగుబడి ఇస్తుంది.
బంగాళాదుంపల చరిత్ర
బంగాళాదుంపలు మొదట దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వత ప్రాంతంలో పుట్టాయి. సుమారు 8 వేల సంవత్సరాల క్రితం పెరూ, బొలీవియా ప్రాంతాల్లోని ప్రజలు మొదటిసారిగా వీటిని సాగు చేసినట్లు చరిత్ర చెబుతోంది. 16వ శతాబ్దంలో స్పానిష్ యాత్రికులు వీటిని ఐరోపాకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి. భారతదేశానికి బంగాళాదుంపలు 17వ శతాబ్దంలో పోర్చుగీసువారి ద్వారా వచ్చాయని చెబుతారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక బంగాళాదుంపలను ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ కూడా ఒకటి. బంగాళాదుంపల ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) 2023లో మే 30ను అంతర్జాతీయ బంగాళాదుంప దినోత్సవంగా ప్రకటించారు. 2024 నుంచి ఈ దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకుంటున్నారు.

బంగాళాదుంపల్లోని పోషకాలు
బంగాళాదుంపల్లో విటమిన్-సి, పొటాషియం, విటమిన్-బి6, ఫైబర్, కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. శరీరానికి శక్తిని అందించడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. సరైన విధంగా వండుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఆయుర్వేదం ఏమి చెబుతోంది?
ఆయుర్వేదం ప్రకారం బంగాళాదుంపలు శరీరానికి బలాన్ని, శక్తిని అందిస్తాయి. గుండెమంట, ఎసిడిటీ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయని చెబుతారు. అయితే ఎక్కువ నూనెలో వేయించి తినడం, అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరగడం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వంటి సమస్యలు రావచ్చు.

బంగాళాదుంపలను నూనెలో వేయించకుండా ఉడికించి తినడం మంచిది. తొక్కతో పాటు తింటే ఎక్కువ ఫైబర్ లభిస్తుంది. ఉడికించిన తర్వాత కొద్దిసేపు చల్లారనిచ్చి తింటే రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా సహాయపడుతుంది. జీలకర్ర, అల్లం, పసుపు వంటి మసాలాలతో వండితే సులభంగా జీర్ణమవుతాయి.
జాగ్రత్త
మొలకలు వచ్చిన లేదా పచ్చగా మారిన బంగాళాదుంపలను తినకపోవడం మంచిది. వీటిలో సోలనిన్, చాకోనిన్ అనే విషపూరిత పదార్థాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇవి తలనొప్పి, వికారం, కడుపునొప్పి వంటి సమస్యలకు కారణమవుతాయి. కాబట్టి అలాంటి బంగాళాదుంపలను ఉపయోగించకుండా పారేయడం ఉత్తమం.

భారతదేశంలో బంగాళాదుంప సాగు
ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, గుజరాత్ రాష్ట్రాలు దేశంలో ప్రధాన బంగాళాదుంప ఉత్పత్తి కేంద్రాలు. దాదాపు ప్రతి భారతీయ వంటింట్లో బంగాళాదుంపకు ప్రత్యేక స్థానం ఉంది. కూరలు, చాట్‌లు, స్నాక్స్, దోసెలు వంటి అనేక వంటకాలలో ఇది కీలక పదార్థంగా ఉపయోగిస్తారు. సరైన విధంగా వండుకుని, మితంగా తీసుకుంటే బంగాళాదుంప ఆరోగ్యానికి మేలు చేసే ఆహారంగా నిలుస్తుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఫ్రిజ్ ఓవర్‌లోడ్ చేస్తే భారీ నష్టం!
మందులు వాడేటప్పుడు ఈ 3 తప్పులు చేయొద్దు..