టపాకాయల వల్ల గాయాలయ్యాయా.. మొదటి 5 నిమిషాల్లో ఇలా చేయండి
ABN , Publish Date - Nov 08 , 2026 | 07:28 PM
దీపావళి అంటే నచ్చనివారు ఎవరైనా ఉంటారా.. కొంత మంది టపాకాయల కోసం ఇష్టపడితే.. మరికొంతమంది స్వీట్ల కోసం.. ఇలా.. పిల్లలకు, పెద్దలకు అందరికీ ఇష్టమైన దీపావళి రోజు జాగ్రత్తగా టపాకాయలు పేల్చాలి. లేదంటే గాయాలపాలవుతారు. మరి గాయాలైతే మొదటి 5 నిమిషాల్లో ఏం చేయాలో తెలుసుకుందామా..
దీపావళి అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. కానీ.. టపాకాయలు పేల్చేటప్పుడు గాయాలైతేనే.. బాధగా ఉంటుంది. దీపావళి.. వెలుగులు, బాణాసంచా, మిఠాయిలతో పాటు కాలిన గాయాలను కూడా తన వెంట తీసుకువస్తుంది. ఈ రోజు టపాకాయల వల్ల చాలా మందికి గాయాలు అవుతుంటాయి. మరి అటువంటి సమయంలో మొదటి 5 నిమిషాల్లో ఏం చేయాలో మీకు తెలుసా..
1. ఆలస్యం అమృతం విషం
చిన్న గాయాలే కదా.. రేపు డాక్టర్‌ను సంప్రదిద్దాం. ఇప్పుడైతే టపాకాయలు కాల్చేద్దాం.. పండగ క్షణాన్ని ఎందుకు మిస్సవడం అనుకుంటారు చాలామంది. అది చాలా పెద్ద తప్పు. ఆలస్యం అమృతం విషం అంటారు. ఆలస్యం చేస్తే చిన్న గాయమైనా.. ప్రమాదంగా మారే అవకాశాలుంటాయి. గాయమైన మొదటి 5 నిమిషాలు చాలా ముఖ్యమైనవి. ముందు ప్రమాదం జరిగిన చోటు నుంచి దూరంగా వెళ్లి..15 నుంచి 20 నిమిషాల పాటు కాలిన గాయాన్ని చల్లని నీటి కింద ఉంచాలి. చల్లటి నీరు మంటను తగ్గించి.. నొప్పిని తగ్గిస్తుంది. అంతేకాకుండా.. వాపు, బొబ్బలు రాకుండా సహాయపడుతుంది.
2.చిట్కాలను పాటించకండి.
గాయమైన వెంటనే కొంతమంది.. ఇంటి చిట్కాలు ఫాలో అవుతారు. టూత్‌పేస్ట్ రాయడం, వెన్న అద్దడం, ఐస్‌తో రుద్దడం లాంటివి చేయకూడదు. అలా చేయడం ద్వారా కాలిన గాయం మరింత లోతుగా మారి.. ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటుంది. ఐస్ చర్మానికి మరింత నష్టం కలిగించవచ్చు.
3. ఆభరణాలను తీసేయండి
చేతికి గాయాలైతే.. వెంటనే ఉంగరాలు, కడియాలు, గాజులు లాంటి ఆభరణాలను తీసేయాలి. అనంతరం గాయాన్ని నీటితో కడిగి.. శుభ్రమైన, వదులైన గుడ్డతో కప్పాలి. చర్మానికి దుస్తులు అంటుకుని ఉంటే గట్టిగా లాగకూడదు. దుస్తులకు మంటలు అంటుకుంటే.. కిందపడి దొర్లండి. లేదంటే మందపాటి క్లాత్‌తో మంటలను ఆర్పి వేయండి.
4. కాలిన గాయాలపైన ఏర్పడిన బొబ్బలను పగల్చకూడదు.
గాయమైన వెంటనే చర్మంపై బొబ్బలు ఏర్పడతాయి. చాలామంది ఆ బొబ్బలను గుచ్చి పగలగొడతారు. ఈ తప్పును అస్సలు చేయకండి. బొబ్బలపై ఏర్పడిన ఈ పొర చర్మానికి సహజమైన రక్షక కవచంలా పనిచేస్తుంది.
5. ఆసుపత్రికి ఎప్పుడు వెళ్లాలి. అసలు వెళ్లాలా, వద్దా..
మిగతా కాలిన గాయాల కంటే టపాసుల వల్ల అయ్యే గాయాలు భిన్నమైనవి. ఇందులో హానికరమైన రసాయనాలు ఉంటాయి. దీని వల్ల ఇన్ఫెక్షన్ సోకి.. టెటానస్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలి. గాయాలపాలైన వెంటనే.. ఆసుపత్రికి వెళ్లడం ఉత్తమం.
6. ఈ లక్షణాలు ఉంటే కచ్చితంగా ఆసుపత్రికి వెళ్లండి
చర్మం తెల్లగా, గోధుమరంగులో కాలిపోయినట్లు ఉన్నా.. లేదా నలుపు రంగులో మాడిపోయినట్లు కనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. పిల్లలు, వృద్ధులు, గర్భిణిలు, మధుమేహం గలవారు డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం. తీవ్రమైన తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడినా.. ఆసుపత్రికి వెళ్లాలి. గాయంపై చీము కారుతున్నా, గాయం తీవ్రంగా ఎర్రగా మారి దుర్వాసన వచ్చినా.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.