Share News

వైఫల్యాన్ని విజయంగా మార్చుకోవాలా? చాణక్యుడు చెప్పిన సింపుల్ చిట్కాలు ఇవే..

ABN , Publish Date - Nov 22 , 2026 | 12:02 PM

చాలా మంది జీవితంలో విఫలమైనప్పుడు నిరుత్సాహపడి ప్రయత్నించడాన్ని మానేస్తారు. ఆ వైఫల్యాల నుంచి నేర్చుకుని భవిష్యత్తుకు బాటలు వేసుకోవడం ద్వారా విజయ తీరాలకు చేరుకోవాలనుకుంటే.. చాణక్యుడు 7 సింపుల్ టిప్స్ చెప్పాడు.

వైఫల్యాన్ని విజయంగా మార్చుకోవాలా? చాణక్యుడు చెప్పిన సింపుల్ చిట్కాలు ఇవే..
failure into success

ఇంటర్నెట్ డెస్క్: చాలా మంది జీవితంలో విఫలమైనప్పుడు నిరుత్సాహపడి ప్రయత్నించడాన్ని మానేస్తారు. ఆ వైఫల్యాల నుంచి నేర్చుకుని భవిష్యత్తుకు బాటలు వేసుకోవడం ద్వారా విజయ తీరాలకు చేరుకోవాలనుకుంటే.. చాణక్యుడు 7 సింపుల్ టిప్స్ చెప్పాడు.

జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని కోరుకుంటారు. అయితే అందరూ విజయం సాధించలేరు. కొన్నిసార్లు ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు రావు. మరికొన్ని సార్లు చివరి క్షణంలో ఓటమి ఎదురవుతుంది. కానీ వైఫల్యం జీవితానికి ముగింపు కాదని.. అది కొత్తగా ప్రారంభించడానికి ఓ అవకాశమని చాణక్యుడు చెప్పాడు.


1)

వైఫల్యానికి భయపడకుండా.. దాని నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నించాలి..

తరచుగా ఓ వ్యక్తి పనిలో విఫలమైనప్పుడు, తనను తాను నిందించుకుంటాడు. తాను ఏమీ చేయలేనని, ఈ పనికి తాను సరిపోనని తదితర అలోచనలు అతని మనస్సులో మొదలవుతాయి. అలాంటి సమయంలో వైఫల్యాన్ని ప్రతికూల దృక్పథంతో కాకుండా.. దాని నుంచి నేర్చుకోవడానికి ఓ అవకాశంగా చూడాలి. ఒక పనిలో వైఫల్యం తన తప్పులు, లోపాలను గుర్తించడానికి సహాయపడుతుంది. తాను సరిగ్గా ఎక్కడ విఫలమయ్యానో, ఏ నిర్ణయం తప్పో తెలుసుకుని.. అలా చేయకుండా ఉండేందుకు ఏం చేయాలో ఆలోచించాలి. వైఫల్యం నుంచి నేర్చుకునే నిజమైన పాఠం ఏమిటంటే.. ఓ సారి చేసిన తప్పు మళ్లీ పునరావృతం చేయకుండా ఉండాలి.


2)

ఓర్పు నేర్పుతో కష్టపడటాన్ని ఎన్నడూ వదులుకోవద్దు..

విజయం కేవలం కష్టపడటంతోనే రాదు. అందుకు ఓర్పు కూడా చాలా అవసరం. చాలా మంది తక్కువ సమయంలో గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటారు. అయితే ప్రతిదానికి సమయం పడుతుంది. ఓ లక్ష్యాన్ని సాధించాలంటే నిరంతర ప్రయత్నం చేయాలి. క్లిష్ట పరిస్థితులు ఎదురైనా.. ఆశించిన ఫలితాలు రాకున్న ఓర్పు మాత్రం కోల్పోవద్దు. క్రమం తప్పకుండా ప్రయత్నిస్తుంటే.. కష్టాలను కూడా అధిగమించవచ్చు. కాబట్టి విజయం కోసం తొందరపడకుండా. మీ ప్రయత్నాలను మీరు నమ్మాలి.


3)

సరైన సమయం కోసం వేచి ఉండాలి..

కొన్నిసార్లు మనం కష్టపడి కూడా సరైన ప్రణాళిక లేకుంటే ఆశించిన విజయం లభించదు. అటువంటి పరిస్థితుల్లో నిరాశ చెందకుండా.. పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ప్రతి పనికి సరైన సమయం, అవకాశం చాలా ముఖ్యం. కేవలం అవకాశం రాలేదన్న కారణంతో ప్రయత్నించడం మానేయడం సరికాదు. సరైన సమయం వచ్చే వరకు మీ సన్నాహాలను పటిష్టం చేసుకోవాలి. ఎందుకంటే.. ఓ సారి అవకాశం వచ్చాక.. దాన్ని ఉత్తమంగా ఉపయోగించుకోవడానికి ముందుగా సిద్దంగా ఉండాలి.


4)

ఏ పని ప్రారంభించే ముందే సరైన ప్రణాళిక వేసుకోవాలి..

కేవలం కోరిక ఉంటే సరిపోదు. ఆ కోరికను నెరవేర్చుకోవడానికి సరైన ప్రణాళిక ఉండాలి. ఓ పనిలో విఫలమైతే.. అదే పద్దతిలో మళ్లీ ప్రయత్నించే బదులు, మీ ప్రణాళికను సమీక్షించుకోవాలి. మీరు నిర్ణయించుకున్న మార్గం సరైనదేనా? ఆ పని సాధించేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవాలి. అవసరమైతే పాత పద్దతిని పక్కన పెట్టి కొత్త ప్రణాళికను రూపొందించు కోవాలి. ఈ కొత్త ప్రణాళిక తప్పులను తగ్గించి.. లక్ష్య సాధనకు మార్గాన్ని సుగమం చేస్తుంది.


5)

ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని డామినేట్ చేయనివ్వకండి..

వైఫల్యం తర్వాత ప్రతికూల ఆలోచనలు రావడం సహజం. అయితే మిమ్మల్ని మీరు నిరంతరం తక్కువ అంచనా వేసుకోవడం, ఇతరులతో పోల్చుకోవడం ఆత్మవిశ్వాసం తగ్గడానికి దారి తీస్తుంది. ఓ విషయంలో విఫలమైనంత మాత్రాన జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరని కాదు. కాబట్టి మిమ్మల్ని మీరు ముందుగా నమ్మాలి. సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండడంతోపాటు మీ సామర్థ్యాల పట్ల అవగాహనతో ఉండాలి. నేటి వైఫల్యం రేపటి విజయానికి ఉపయోగపడుతుందని గుర్తించుకోవాలి.


6)

సరైన వ్యక్తులతో స్నేహం చేయండి..

మన జీవితంలో మనం సాంగత్యం చేసే వ్యక్తులు మన ఆలోచనలు, నిర్ణయాలపై తీవ్ర ప్రభావం చూపుతారు. మనం విఫలమైన సమయాల్లో మనకు అండగా నిలబడటానికి సరైన వ్యక్తులు ఉండటం చాలా ముఖ్యం. కొందరు కష్ట సమయాల్లో మనలో మనోధైర్యాన్ని పెంచుతారు. మరికొందరు మనల్ని నిరుత్సాహపరుస్తారు. ఈ నేపథ్యంలో ఎల్లప్పుడూ మనల్ని ప్రోత్సహించే, మంచి సలహాలు ఇచ్చే వారు.. మన తప్పులను వివరించే వ్యక్తుల సాంగత్యంలోనే ఉండాలి. మంచి సాంగత్యం ఓ వ్యక్తికి సరైన మార్గాన్ని చూపించడంలో సహాయపడుతుంది.


7)

నేర్చుకోవడం ఎప్పుడూ ఆపవద్దు..

విజయం సాధించాలంటే.. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడం అవసరం.జ్ఞానాన్ని ఓ వ్యక్తికి ఉన్న సంపదగా భావిస్తారు. కానీ సంపద కన్నా జ్ఞానం మేలని చాణక్యుడు తెలిపారు. ఓ పనిలో విఫలమైనా.. దాని నుంచి పొందిన అనుభవం తదుపరి ప్రయాణానికి ఉపయోగపడుతుంది. కొత్త నైపుణ్యాలను సంపాదించుకోవాలి, సమాచారాన్ని పొందడం ద్వారా మిమ్మల్ని మీరు మెరుగు పరచుకోవడానికి ప్రయత్నించాలి. మీరు ఎంతగా నేర్చుకుంటే.. తదుపరి సవాళ్లను అంత సులభంగా ఎదుర్కోవచ్చు.

జీవితంలో విఫలమైనా ప్రయత్నించడం ఆపవద్దు. తప్పులను అంగీకరించాలి. వాటి నుంచి నేర్చుకోవాలి. అందుకు కొద్దిగా ఓపికగా ఉండాలి. నూతన ఉత్సాహంతో మళ్లీ ప్రారంభించాలి. ఓటమి శాశ్వతం కాదని గుర్తించాలి. సరైన ఆలోచలు, కృషితోపాటు నిలకడతో పరిస్థితిని మార్చగల శక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

సుఖనిద్రకు ‘ఇండోర్’ మంత్రం

ఉదయం ఈ 8 పొరపాట్లు అస్సలు చేయకండి

Updated Date - Nov 22 , 2026 | 12:26 PM