Share News

lifestyle: సంతోషాన్ని పట్టుకుందాం!

ABN , Publish Date - Jan 18 , 2026 | 11:33 AM

ప్రస్తుతం ప్రపంచం విచిత్రమైన సందిగ్ధంలో ఉంది. ఇల్లు, కారు, బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ... ఇలా అన్నీ ఉంటాయి కానీ, ముఖంపై చిరునవ్వు ఉన్న వాళ్లని వేళ్ల మీద లెక్కించే రోజులు వచ్చాయి.

lifestyle: సంతోషాన్ని పట్టుకుందాం!

తొలకరి జల్లులకు మనసు పులకరిస్తుంది... గాల్లో సాగుతోన్న నీలి మేఘాలను చూడగానే మనసు తేలికపడుతుంది... కొత్త దుస్తులు వేసుకున్నప్పుడు, నచ్చింది తిన్నప్పుడు తెలియని ఉత్సాహం మనసుకు కలుగుతుంది... ఇవన్నీ ఆ సమయంలో మనల్ని సంతోషంలో ఓలలాడించేవే. అంటే... సంతోషం బాహ్య విషయాలపై ఆధారపడి ఉందా? లేక అంతర్గత అనుభూతి వల్ల కలుగుతోందా? కోరుకుంటే సంతోషాన్ని సాధించవచ్చా? దాన్ని ఓ సాధనంగా అలవరుచుకోవచ్చా??

ప్రస్తుతం ప్రపంచం విచిత్రమైన సందిగ్ధంలో ఉంది. ఇల్లు, కారు, బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ... ఇలా అన్నీ ఉంటాయి కానీ, ముఖంపై చిరునవ్వు ఉన్న వాళ్లని వేళ్ల మీద లెక్కించే రోజులు వచ్చాయి. ‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా’ ... అందరిలో ఏదో తెలియని నిరాశ, నిర్లిప్తత, అశాంతి, అలజడి. ఒకప్పుడు సిటీలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు కట్టుకున్నానని ఘనంగా చెప్పుకునేవారు... ఇప్పుడు మూడు బెడ్‌రూమ్‌ల ఫ్లాట్‌ ఉన్నా సంతృప్తి ఉండడం లేదు. అందుకే లైఫ్‌స్టయిల్‌ జబ్బులు, మానసిక వ్యాధులు దండయాత్ర చేస్తున్నాయి. వీటన్నింటినీ చూసి, అనేక పరిశోధనలు చేస్తున్న మానసిక శాస్త్రవేత్తలు ‘సంతోషాన్ని ఓ హాబీలా అలవర్చుకోమ’ని సలహాలిస్తున్నారు. అయితే సంతోషాన్ని అలా సాధించవచ్చా? అది సాధ్యమేనా??


book5.jpgఅదో సూత్రం...

ప్రతీ అంశాన్ని గణాంకాలతో, సులభంగా అర్థం అయ్యేలా చెప్పడం నేటి ట్రెండ్‌. సంతోషాన్ని కూడా అచ్చం అలాగే 50-40-10ని ‘హ్యాపీనెస్‌ రూల్‌’గా చెబుతున్నారు. ఈ నియమం ప్రకారం... యాభై శాతం సంతోషాన్ని మన శరీరంలోని జీన్స్‌ నిర్ణయిస్తాయి. మన చుట్ట్గూ ఉన్న పరిస్థితులు 10 శాతం, ఆ సమయంలో ఉన్న మన మానసిక స్థితిని బట్టి మిగతా 40 శాతం సంతోషం ఆధారపడి ఉంటుందట. ‘ద హౌ ఆఫ్‌ హ్యాపీనెస్‌’ పుస్తకంలో సోన్జా ల్యూబోమిర్కీ తొలిసారిగా ఈ నియమాన్ని ప్రతిపాదించారు. అప్పటి నుంచి చాలామంది హ్యాపీనెస్‌ను ఈ సూత్రం ఆఽధారంగా పేర్కొంటున్నారు. అంటే ‘జీన్స్‌, చుట్టూ ఉన్న పరిస్థితులను మనం మార్చలేం కానీ... ఆ సమయంలో ఉన్న మానసిక స్థితిని మార్చుకోగలగడం వల్ల 40 శాతం సంతోషాన్ని సాధించుకోవచ్చు’ అని చెప్పేదే ఈ సంతోషాల సూత్రం. అంటే మన సంతోషాన్ని కూడా మనం నియంత్రించవచ్చన్న మాట. అయితే ఇది శాస్త్రపరంగా నిరూపితమైనది కాదు. కానీ దీని ఆధారంగా కొన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి.


  • మన సంతోషాన్ని కొద్ది స్థాయిలో నియంత్రించొచ్చు.

  • సాధన ద్వారా సంతోషాన్నీ సాధించవచ్చు.

అందుకే, కొందరు ఎప్పుడూ సంతోషంగా కనిపిస్తుంటారు. మరికొందరు మూతి ముడుచుకుని ఉంటారు. ఎందుకిలా అన్నది కచ్చితంగా చెప్పలేం కానీ, విభిన్న దృక్కోణాల వల్ల కూడా మనలో మార్పులు వస్తాయని కచ్చితంగా చెప్పొచ్చు.

ఉదాహరణకు జైలులో ఉన్న ఇద్దరు ఖైదీలు కిటికీలోంచి బయటకు చూస్తూ... ఒకరు నేలమీదున్న బురదని చూస్తే, మరొకరు ఆకాశంలోని తారకలను చూస్తూ హాయిని పొందడం లాంటి కథలు వింటూనే ఉన్నాం. మనం ఉన్న పరిస్థితులు, పెరిగిన సంస్కృతి, జీవితంలోని దశలను బట్టి సంతోషం మారుతుందనేది మానసిక నిపుణులు ప్రముఖంగా పేర్కొంటున్నారు.


book5.2.jpg

‘సంతోషం’ అనే మాటకు అర్థం వివిధ సంస్కృతులలో మారుతుంటుంది. పశ్చిమ దేశాల ఫాస్ట్‌ కల్చర్‌ జీవనాల్లో డబ్బుకు లోకం దాసోహంలా ఉంటారు. బాగా డబ్బు ఉంటే సంతోషం సొంతమవుతుందనే ధోరణి ఉంటుంది వాళ్లలో. అదే ఆదిమ జాతి తెగల్లో కుటుంబానికే తొలి ప్రాధాన్యం ఇస్తారు. కుటుంబంతో ఉండడమే వాళ్లకి పెద్ద సంబురం, సంతోషం.

డబ్బు, హోదా కన్నా... ఆనందంగా ఉండడం అనేది నేడు అతి ముఖ్యమైన సంపదగా పరిణామం చెందింది. ఎందుకంటే మానసిక, శారీరక ఆరోగ్యానికి, పూర్తి స్వస్థతకి సంతోషం కీలకం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సంతోషమే అనుబంధాలను కూడా బలంగా మారుస్తుంది. మన చుట్టూ అందరూ ఉన్నారన్నది వెయ్యి ఏనుగుల బలాన్ని సమకూరుస్తుంది. జీవిత కాలాన్ని పెంచుతుంది. అందుకే సంతోషాన్ని ఓ హాబీలా అలవర్చుకోవాలి.


పన్నెండు వ్యూహాలు...

ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలను అందించే సంతోషాన్ని ఓ సాధనంగా మలచుకోవాలంటే... దాని కోసం కొన్ని ఎక్సర్‌సైజులు చేయాలని సైకాలజిస్టులు పేర్కొంటున్నారు. వీటినే సంతోషానికి పన్నెండు వ్యూహాలుగా అభివర్ణిస్తున్నారు.

  • బీయింగ్‌ ప్రజెంట్‌ (ప్రతీ క్షణం జీవించాలి): మీ చుట్టూ, మీ మనసులో ఏం జరుగుతోందనే జాగురూకతతో ప్రతీరోజూ ప్రతీ క్షణం గమనిస్తూ ఉండాలి.

  • ఫ్యునరల్‌ మెడిటేషన్‌: వినడానికి ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. కానీ కాసేపు కళ్లు మూసుకుని మరణించినట్టు, చుట్టూ చేరిన వ్యక్తులు మన గురించి మాట్లాడుకోవడం లాంటివి ఊహించుకుని అయిదు నిమిషాలు కళ్లు మూసుకుని గడిపితే జీవన దృక్కోణమే మారుతుంది.


book5.3.jpg

  • ఇష్టమైన సంఘటనలను తరచి చూసుకోవడం: గతంలో జరిగిన అనేక సంఘటనల్లో మనకు నచ్చినవి ఉంటాయి. ఆ జ్ఞాపకాలకు సంబంధించి... మనసులో ఉన్న భావనలను జోడించి చూస్తే జీవితంలోకి పచ్చదనం మళ్లీ వచ్చినట్టుగా అనిపిస్తుంది.

  • ఆశావహ దృక్పథం: మీరు భవిష్యత్తులో ఎలా ఉండాలనుకుంటున్నారు. ఆ కమ్మని కలలో మీ లోకం ఎలా ఉంటుంది? కాసేపు కళ్లు మూసుకుని మిమ్మల్ని మీరు ఊహించుకోవడం వల్ల జీవితం పట్ల మీలో ఆశావహ దృక్పథం అలవడుతుంది. క్రమం తప్పకుండా దీనిని సాధన చేయడం మంచిది.

  • దృఢమైన బంధాలు: ఎప్పటికప్పుడు కొత్త బంధాలను ఏర్పరచుకోవడం, స్నేహితులు, తోబుట్టువులను కలవడం వల్ల బంధాలను దృఢపరచుకోవచ్చు. దీనివల్ల ఆనందం పెరుగుతుందే కానీ తరగదు.


  • కృతజ్ఞత తెలపడం: మీకు తోడుగా నిలిచిన వ్యక్తుల పట్ల కృతజ్ఞతలు తెలియజేయాలి. వారు మీకు అందించిన సహాయాల్ని ఓ చోట రాసిపెట్టుకోవడం, ఆ పుస్తకాన్ని అప్పుడప్పడూ చదువుతూ, వారిని గుర్తుచేసుకోవడం వల్ల మనసుకి శాంతి చేకూరుతుంది.

  • పోలికలు వద్దు: ఇతరులతో పోల్చుకోవడం తక్షణమే మానేయాలి. ప్రతీ ఒక్కరూ వేరని, వాళ్ల ప్రయాణాలు వేరనే స్పృహతో ఉండాలి. అతి ఆలోచనలు కూడా మంచివి కావు.

  • దయతో మసలుకోవడం: స్నేహితులతోనే కాదు పరిచయం లేని వ్యక్తులతో కూడా దయతో మసలుకోవడం మంచిది. దయ చూపడం అంటే బలహీనత కాదనే విషయం గుర్తించాలి.


book5.5.jpg

  • ఇష్టమైన పనులు: ఇల్లు, ఆఫీసు, కుటుంబం, బాధ్యతలు... ఇలా ఎన్ని ఉన్నా మీ మనసును నచ్చిన పనికి సమయం కేటాయించడం మాత్రం మానకండి. ఒకటో రెండో ఇష్టమైన పనులను ఎంచుకుని, వాటిలో నైపుణ్యాన్ని పెంపొందించుకోండి.

  • ఆధ్యాత్మిక చింతన: రోజులో కొంత సమయం ఆధ్యాత్మిక చింతనలో గడపడం మంచిది. మందిరాలకు వెళ్లడం, ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం వల్ల తెలియకుండానే మనసుకు సాంత్వన చేకూరుతుంది.

  • శారీరక ఆరోగ్యం: మనం బాగుంటేనే ఏదైనా చేయగలం. అందుకే శారీరక ఆరోగ్యం ఎంతో అవసరం. దీని కోసం ధ్యానం, నడక, గట్టిగా నవ్వడం లాంటివి చేస్తే మనసులోని చింతలన్నీ హుష్‌కాకిలా మాయం అవుతాయి. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగా ఆరోగ్యంగా ఉండగలం. అప్పుడే సంతోషం చేకూరుతుంది.


  • మరచిపోవడానికి ప్రయత్నించాలి: కష్టం, అశాంతి, ఆందోళన, నిద్ర లేకుండా చేసిన పరిస్థితులను అర్థం చేసుకుని... క్రమంగా వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నించాలి. జీవితాన్ని యథాతథంగా అర్థం చేసుకోవడానికి కృషిచేయాలి. అన్నింటినీ నియంత్రించే శక్తి మన చేతిలో లేదని అర్థం చేసుకుంటే మనసు కాస్త కుదుటపడుతుంది. అలాగే మీకు క(న)ష్టం కలిగించిన వ్యక్తిని క్షమించే గుణాన్ని అలవర్చుకోవాలి. దీనివల్ల కూడా మనసు తేలికపడుతుంది. పగా ప్రతీకారాలు ఎవరినైనా మానసికంగా మరింత కుంగిపోయేలా చేస్తాయి. ఆనందాన్ని అడ్డుకుంటాయి.

నిజం చెప్పాలంటే సంతోషాన్ని పట్టుకోవడానికి చాలా మార్గాలే ఉన్నాయి. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో దాన్ని ఎలా పట్టుకోవాలో చెప్పేందుకు ప్రపంచవ్యాప్తంగా మానసిక వైద్యులు, లైఫ్‌స్టయిల్‌ రచయితలు అనేక పుస్తకాలు రాస్తున్నారు. వాటిలోని సారాన్ని గ్రహించి, కాస్త సాధన చేస్తే చాలు... జీవితాన్ని సంతోషంగా గడిపేయొచ్చు. కొత్త ఏడాదిలో ఆ దిశగా ప్రయాణం మొదలెడదాం.

- సండే డెస్క్‌


‘యూ’ ఆకారంలో...

సంతోషం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు... అది రకరకాల కారణాల వల్ల మారుతూ ఉంటుంది. అది వయసు పరంగా కూడా మారుతుంది. ఇరవైల్లో ఉన్న మనిషి చాలా సంతోషంగా ఉంటాడు. మధ్య వయసులోకి వచ్చేసరికి ఆ హ్యాపీనెస్‌ గ్రాఫ్‌ పడిపోతుంది. జీవిత మలిదశలో తిరిగి పూర్తి ఆనందంలో ఉంటాడు మనిషి. అందుకే దీన్ని ‘యూ షేప్డ్‌ హ్యాపీనెస్‌’ అంటారు. అనుబంధాన్ని పెంచుకోవడం ‘పాజిటివ్‌ ఏజింగ్‌’కు దోహదం చేస్తుంది. అందుకే అన్ని వయసుల్లోనూ స్నేహితులు, కుటుంబ బంధాలు ఉండడం ఎంతో అవసరం. అదే అసలైన సంతోషానికి రాచమార్గం.


book5.6.jpg

ఉత్సాహాన్ని రీసెట్‌ చేద్దాం...

‘ఆనందో బ్రహ్మ’ అంటారు పెద్దలు. అయితే ఉరుకుల పరుగుల జీవనంలో ఆనందాన్ని ఆస్వాదించడాన్ని మరచిపోతున్నారంతా. కరోనా సమయంలో అయితే ఎక్కడ చూసినా శ్మశాన నిశ్శబ్దమే. అలాంటి సమయంలో ‘ద జాయ్‌ రీసెట్‌: సిక్స్‌ వేస్‌ ట్రామా స్టీల్స్‌ హ్యాపీనెస్‌ అండ్‌ హౌ టు విన్‌ ఇట్‌ బ్యాక్‌’ అనే పుస్తకం రాసి ప్రపంచదృష్టిని ఆకర్షించారు డాక్టర్‌ మేరీ కాథరీన్‌ మెక్‌డోనాల్డ్‌. ఈ పుస్తకంలో... జీవితంలో సంతోషాన్ని అడ్డుకుంటున్న అంశాలను పరిశీలించి, వాటిని తొలగించమంటారు. అలా ‘జాయ్‌’ను రీసెట్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆరు రకాలుగా ‘ట్రామా’ మన సంతోషాన్ని లాగేసుకుంటుందని పేర్కొంటారు మేరీ. వాటి నుంచి మళ్లీ సంతోషాన్ని పొందే విధానాలూ తెలియజేశారు. ఈ అంశాలు అందరికీ ఉపయోగపడేవే.


ప్రతీ ఒక్కరిలో ‘హోప్‌ సర్క్యూట్‌ (ఆశా వలయం)’ అనేది ఉంటుందని ఆధునిక సైకాలజిస్టులు పేర్కొంటున్నారు. జీవితంలో జరుగుతోన్న మంచి సంఘటనల ఆధారంగా... మెదడు ఈ వలయాన్ని ఏర్పరచుకుంటుంది. ఒకవేళ అనుకోని విషాద సంఘటన జరిగితే అది మూసుకుపోతుంది. న్యూరోసైన్స్‌కు సంబంధించి ఈ ‘హోప్‌ సర్య్కూట్‌’ ఆధారంగా మేరీ కాథరీన్‌ ‘జాయ్‌ బ్లాకర్స్‌’పై పుస్తకాన్ని రాశారు. పుట్టెడు దుఃఖంలోనూ గోరంత వెలుగు ఉంటుందని, దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాలని ఆమె పేర్కొంటారు.


రోజు వారీగా సంతోషాన్ని సాధన చేయడానికి ‘టినీ లిటిల్‌ జాయ్స్‌’ అనే సాధనాన్ని మేరీ క్యాథరీన్‌ పేర్కొంటున్నారు. సంతోషం కోసం ఎక్కడెక్కడో కాదు, మీ పక్కనే ఉన్న ప్రపంచాన్ని ఓసారి పరిశీలనగా చూడండి. ఓ చిన్న సంతోషం మీ మనసును హత్తుకుంటుంది. అది మీకు ఇష్టమైన కాఫీ పరిమళం, పసిపాప నవ్వు, కిటికీలోంచి వినిపించే కోయిల గానం, గదిలోకి వచ్చిన సూర్యరశ్మి, ఆప్తమిత్రుడి ఫోన్‌కాల్‌... ఇలా ఏదైనా ఓ క్షణం మీ మనసుకు ఆనందాన్ని తట్టి మాయం అవ్వొచ్చు. అలాంటి సంతోషాలని ఒడిసిపట్టుకోవడానికి రోజూ ప్రయత్నించాలి. అప్పుడే జీవితంలో మార్పు వస్తుంది. ఆశావహంగా మారుతుంది. దుఃఖంలో కూర్చోవడమే కాదు ఆనందంతో ప్రయాణం చేయడం కూడా మనసుకు తెలుసు. కాకపోతే ఆ దిశగా మనసును మళ్లించడానికి ప్రయత్నించాలి.


టాప్‌ టెన్‌

దుఃఖం, గాయాల నుంచి ఉపశమనం కలిగించే మనోవిజ్ఞాన పుస్తకాలు ఇటీవల కాలంలో ఎన్నో వచ్చాయి. ఆ పుస్తకాల్లో ప్రముఖమైన పది పుస్తకాలు ఏమిటో చూద్దాం.

  • ద బయాలజీ ఆఫ్‌ ట్రామా

  • రిలీజింగ్‌ అవర్‌ బర్డెన్స్‌

  • ఆల్‌ ద వే టు ది రివర్‌

  • ఫానింగ్‌

  • రీఇగ్నైట్‌ యువర్‌ పవర్‌

  • ద గ్రీవింగ్‌ బాడీ

  • ద ధర్మా ఆఫ్‌ హీలింగ్‌

  • గ్రోయింగ్‌ త్రూ గ్రీఫ్‌

  • ద జాయ్‌ రీసెట్‌

  • యూ డోంట్‌ నీడ్‌ టూ ఫర్గివ్‌


ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి, వెండి ధరల్లో కొనసాగుతున్న పెరుగుదల! నేటి రేట్స్ ఇవీ..

శబరిమల బంగారం చోరీ కేసు.. సిట్‌కు చేరిన శాస్త్రీయ నివేదిక

Read Latest Telangana News and National News

Updated Date - Jan 18 , 2026 | 11:45 AM