Share News

Lifestyle: వావ్‌... తీరొక్క వరమాల!

ABN , Publish Date - Jan 18 , 2026 | 09:26 AM

మల్లెల వరమాల పెళ్లిలో మ్యాజికల్‌ వైబ్స్‌ని సృష్టిస్తుంది. వధూవరులు ఈ మాల ధరిస్తే వేడుకంతా సువాసనలతో నిండిపోతుంది. మల్లెపూలు స్వచ్ఛతకు చిహ్నంగా నిలుస్తాయి. పెళ్లి వేడుకను మరింత శోభాయమానంగా మారుస్తాయి.

Lifestyle: వావ్‌... తీరొక్క వరమాల!

ఖరీదైన పట్టు చీర ధరిస్తే సరిపోదు. వజ్రాలు పొదిగిన ఆభరణాలు వేసుకున్నా చాలదు. మేకప్‌ పూర్తయినా ఇంకా వెలితిగానే ఉంటుంది. మెడలో వరమాల వేసినప్పుడే అమ్మాయికి పెళ్లికూతురు లుక్‌ వచ్చేస్తుంది. అలాంటి వరమాల ‘ఏదైతేనేం...’ అనుకోవడం లేదు పెళ్లిపీటలెక్కబోతున్న వధూవరులు. వరమాల కూడా ఇప్పుడు డిజైనింగ్‌లో భాగమయ్యింది. ప్రత్యేకమైన వరమాలలతో ఏడడుగులు వేసేందుకు ఈ తరం సిద్ధమవుతోంది. అలాంటి వినూత్న వరమాలల విశేషాలే ఇవి...

పెళ్లంటే ఒక వేడుక. రెండు కుటుంబాలు సంతోషంగా జరుపుకొనే ఒక పండగ. ఈ వేడుకలో సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. ఖర్చుకోసం వెనకాడకుండా అర్భాటంగా జరుపుకొంటారు. ఇంకా చెప్పాలంటే భారతీయుల పెళ్లి ఒక విజువల్‌ ట్రీట్‌లా ఉంటుంది. పూలతో అలంకరించిన పెళ్లి మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వధూవరులు ధరించే దుస్తులు, నగలు, పూలదండల గురించి చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి వేడుకలో వధూవరులు వరమాలతో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఈ వరమాలలు ఇప్పుడు అనేక రకాల్లో అందుబాటులో ఉంటున్నాయి. వధూవరులు ఆకర్షణీయంగా కనిపించేలా రకరకాల పూలతో, వివిధ డిజైన్లలో వీటిని తయారుచేస్తున్నారు.


సుగంధాల మల్లెల మాల

మల్లెల వరమాల పెళ్లిలో మ్యాజికల్‌ వైబ్స్‌ని సృష్టిస్తుంది. వధూవరులు ఈ మాల ధరిస్తే వేడుకంతా సువాసనలతో నిండిపోతుంది. మల్లెపూలు స్వచ్ఛతకు చిహ్నంగా నిలుస్తాయి. పెళ్లి వేడుకను మరింత శోభాయమానంగా మారుస్తాయి. మాల బరువుగా, కలర్‌ఫుల్‌గా ఉండటాన్ని ఇష్టపడని వారు సింపుల్‌గా జాస్మిన్‌ మాలను ఎంచుకుంటున్నారు. ఆమధ్య అలియాభట్‌, రణ్‌బీర్‌ కపూర్‌లు ఈ తరహా వరమాలతోనే కనిపించారు.


book3.jpg

ఎకో ఫ్రెండ్లీ ...

తులసి ఆకులతో చేసిన వరమాలలు... వధూవరులు ట్రెండీగా కనిపించేలా చేస్తున్నాయి. దక్షిణాది పెళ్లిళ్లలో ఎక్కువగా ఈ వరమాలను ధరిస్తుంటారు. పవిత్రమైన తులసి ఆకులతో చేసే ఈ వరమాల ‘ఎకో ఫ్రెండ్లీ’ వెడ్డింగ్‌లకు బెస్ట్‌ ఛాయిస్‌. ఈ మధ్యకాలంలో పెళ్లి వేడుకల్లో ఈ మాల ట్రెండ్‌ నడుస్తోంది. ఈ మాల అల్లికలో అక్కడక్కడా రంగు రంగుల పూలు ఉపయోగిస్తారు. దీనివల్ల వరమాల ప్రత్యేకంగా కనిపిస్తుంది. వరమాల అల్లికలో సీజన్‌ను బట్టి రకరకాల మొక్కల ఆకులను ఉపయోగిస్తారు.


ఆకట్టుకునే ఆర్చిడ్‌...

వివాహ వేడుక విలాసవంతంగా కనిపించాలని కోరుకునే వధూవరులు ఎంపిక చేసుకుంటున్న మాల ‘ఆర్చిడ్‌’. తాజా ఆర్చిడ్‌ పూలతో తయారుచేసే ఈ వరమాల కలర్‌ఫుల్‌గా కనిపించడంతో పాటు వేడుక ఆసాంతం వధూవరులను ప్రత్యేకంగా నిలుపుతుంది. ఊదా, నీలం, గులాబీ రంగుల పూల కలయికతో అల్లిన ఆర్చిడ్‌ వరమాల వింటర్‌ వెడ్డింగ్స్‌కు బెస్ట్‌ ఛాయిస్‌. ఈ వరమాలను ప్రేమ, అందం, లగ్జరీకి ప్రతిరూపంగా చెబుతున్నారు.


book3.4.jpg

కలర్‌ఫుల్‌గా కనిపించేందుకు...

‘కాంట్రాస్ట్‌ షేడ్‌’ వరమాల... భారతీయ వివాహాల్లో లేటెస్ట్‌ ట్రెండ్‌గా నడుస్తోంది. వధూవరులు ధరించిన దుస్తుల రంగులకు కాంట్రాస్ట్‌ రంగుల్లో ఈ మాలలు ఉంటాయి. వధూవరుల పెళ్లి ఫొటోలు కలర్‌ఫుల్‌గా వచ్చేందుకు ఈ మాలలు దోహదపడతాయి. ఈ వరమాలలో పింక్‌, తెలుపు రంగు గులాబీలతో అల్లిన వరమాల వెడ్డింగ్‌ డే లుక్‌కు పర్‌ఫెక్ట్‌గా నప్పుతుంది. పెళ్లిలో వధూవరులను సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలుపుతుంది. ఊదా, తెలుపు రంగు ఆర్చిడ్‌లతో అల్లిన వరమాల ధరిస్తే లగ్జరీ లుక్‌ వస్తుంది. యూనిక్‌గా కనిపించడంతో పాటు ఛార్మింగ్‌ లుక్‌ను తీసుకొస్తుంది. ఎల్లో మారిగోల్డ్‌, తెలుపు రంగు పూల కలయికతో అల్లిన వరమాల ధరిస్తే ఫెస్టివ్‌ లుక్‌ వస్తుంది.


అదనపు ఆకర్షణ కోసం...

పింక్‌ వరమాల వివాహాలకు అత్యంత సొగసైన డిజైన్‌గా గుర్తింపు పొందింది. సింపుల్‌గా కనిపించినా, వివాహ వేడుకలో వధూవరులు ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. వివాహాన్ని మరిచిపోలేని వేడుకగా మారుస్తుంది. పెళ్లి థీమ్‌కి అదనపు ఆకర్షణగా ఈ వరమాల నిలుస్తుంది. వధూవరులు పెళ్లికి తమ సమ్మతాన్ని, కొత్త జర్నీని మొదలు పెట్టేందుకు సిద్ధమని తెలియజేసేందుకు సూచికగా వధూవరులు ఈ మాలను ధరిస్తారు.


book3.5.jpg

అతిథులకు కనువిందు

సంప్రదాయ వరమాల ధరించాలనుకునే వారికి తామరపూలతో అల్లిన వరమాల మంచి ఆప్షన్‌. వైవాహిక జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ, సంతోషంగా కలిసి ముందుకు సాగాలని కోరుకుంటూ తామర మాల ధరిస్తారు. పూర్తిగా తామరలతో అల్లిన వరమాల వధూవరులను మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది. తామరలతో పాటు మల్లెలు కలిస్తే ఆడంబరంగా ఉంటాయి.


సొగసైన లుక్‌

రకరకాల రంగుల పూల రేకులతో కలిపి తయారు చేసే పూల రేకుల వరమాల క్లాసిక్‌ లుక్‌ని, రొమాంటిక్‌ ఫీల్‌ని అందిస్తుంది. పింక్‌, పీచ్‌ గులాబీలతో అల్లిన మాల సొగసైన లుక్‌ని తీసుకొస్తుంది.

ఎవర్‌గ్రీన్‌

వెడ్డింగ్‌ ఈవెంట్‌లో రొమాంటిక్‌ ఫీల్‌ ఉండాలని కోరుకునే వధూవరులు గులాబీలతో అల్లిన వరమాలను ఎంచుకుంటారు. వివాహ వేడుకల్లో ఎక్కువగా కనిపించే మాల ఇది. ఈ మాల ఏ సీజన్‌లో జరిగే వెడ్డింగ్‌లోనైనా ఎవర్‌గ్రీన్‌గా నిలుస్తుంది. తెలుపు, ఎరుపు రంగుల్లో అల్లిన వరమాల ధరిస్తే వధూవరులు సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తారు.


బేబీ బ్రీత్‌

చిన్న పూలతో ఆకట్టుకునేలా కనిపించే బేబీ బ్రీత్‌ వరమాలను నవతరం ఎక్కువగా ఇష్టపడుతోంది. సింపుల్‌గా కనిపించడంతో పాటు ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది. బేబీ బ్రీత్‌ పూలను ‘జిప్సోఫిలియా’ అని పిలుస్తారు. పెళ్లి వేడుకల్లో ఈ పూల వినియోగం ఎక్కువగా ఉంటోంది.

book3.3.jpg

లగ్జరీ లుక్‌

స్ఫటికాలు, పూసలు, ముత్యాలు, ఎంబెడెడ్‌ ఆభరణాలతో అల్లిన వరమాలలు విలాసవంతమైన వేడుకల్లో కనిపిస్తాయి. విలువైన రత్నాలతో అల్లిన ఈ మాలను వధూవరులు ధరిస్తే రాచరికపు దర్పం ఉట్టిపడుతుంది. తాజా పూలు కాదు కాబట్టి వాడిపోతాయన్న ఆందోళన ఉండదు. వధూవరులు దుస్తులకు నప్పే విధంగా వరమాలను తయారుచేయించుకుంటే వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు.


మ్యాచింగ్‌

చీర, షేర్వానీ, లెహంగా, ఇతర సంప్రదాయ దుస్తులు ఏవి ధరించినా వాటికి నప్పేలా వరమాలలను ఎంచుకోవాలి. వరమాల రంగులను, డిజైన్‌ను, మెటీరియల్‌ను దృష్టిలో పెట్టుకోవాలి. ఒకవేళ ఎరుపు రంగు లెహంగా ధరిస్తే తెలుపు, ఆరెంజ్‌, పింక్‌ రంగుల పూలతో అల్లిన వరమాలను ఎంచుకోవాలి. వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా కూడా వరమాలను తయారుచేస్తారు. గులాబీ, మల్లె, చామంతి, తామర... ఇలా రకరకాల పూలతో వరమాలను తయారుచేయించుకుని వేడుకని ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. సీజన్‌లో దొరికే పూలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.


ప్రాముఖ్యత

వివాహ సమయంలో వధూవరులు దండలు మార్చుకోవడం సంప్రదాయం. ఇది రెండు కుటుంబాల కలయికను సూచిస్తుంది. వధూవరులు వివాహానికి సుముఖతను వ్యక్తం చేసే క్షణం అది. వివాహ వేడుకలో ఇది ఒక భావోద్వేగ సమయంగా నిలుస్తుంది. ఒకరిపై మరొకరికి ప్రేమను రెట్టింపు చేస్తుంది. ఇద్దరి మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుంది. బంధువులు, స్నేహితుల మధ్య ఆనందకరమైన సమయంలో మార్చుకునే వరమాల జీవితాంతం అద్భుతమైన జ్ఞాపకంగా నిలిచిపోతుంది.


- గులాబీ వరమాల ప్రేమ, అభిరుచికి సంకేతంగా నిలుస్తుంది. వధూవరుల మధ్య లోతైన ప్రేమను తెలియజేస్తుంది. వివాహ ప్రయాణానికి నాందిగా ఈ మాల ధరిస్తారు.

- మల్లెపూలతో అల్లిన వరమాల స్వచ్ఛత, అందం, అదృష్టానికి ప్రతీకగా నిలుస్తుంది. వధూవరుల మధ్య ఉన్న బంధంలోని స్వచ్ఛతను సూచిస్తుంది.

- వివాహ వేడుకల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడేందుకు తామర పువ్వులతో చేసిన మాలను ధరిస్తారు. స్వచ్ఛతకు సంకేతంగా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ సంతోషంగా ముందుకు సాగాలని కోరుకుంటూ మాల వేస్తారు. అందమైన వైవాహిక జీవిత ప్రారంభానికి చిహ్నం.


- వధూవరులకు దేవతల దీవెనలు ఎప్పుడూ వెన్నంటి ఉండాలని తులసీమాల ధరిస్తారు.

- ఆర్చిడ్‌ వరమాల అందానికి ప్రతీక. ఈ పూలలో రంగులు రకరకాల భావోద్వేగాలకు ప్రతీకగా ఉంటాయి. పసుపు స్నేహానికి, ఊదా రంగు ప్రశంసకు సంకేతంగా నిలుస్తాయి.

- స్వచ్ఛత, కమిట్‌మెంట్‌కు లిల్లీ పూల మాల సంకేతంగా ఉంటుంది. సంపన్నమైన, ప్రశాంతమైన వైవాహిక జీవితం కోసం ఈ మాల ధరిస్తారు.

- అదృష్టం, ఆనందం, సంపద చిహ్నంగా పియోనీ వరమాలను ధరిస్తారు. సంతోషకరమైన వివాహానికి, వివాహ సంబంధాలలో విజయానికి ఈ మాల మంచిదని విశ్వసిస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి, వెండి ధరల్లో కొనసాగుతున్న పెరుగుదల! నేటి రేట్స్ ఇవీ..

శబరిమల బంగారం చోరీ కేసు.. సిట్‌కు చేరిన శాస్త్రీయ నివేదిక

Read Latest Telangana News and National News

Updated Date - Jan 18 , 2026 | 09:48 AM