Share News

ఇంటి గోడలకు శుభసూచకాలు!

ABN , Publish Date - Apr 12 , 2026 | 08:19 AM

ఇంటి అలంకరణలో భాగంగా గోడలకు పలురకాల పెయింటింగ్‌లు ఆకట్టుకుంటాయి. ఒకరకంగా అవి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్‌ చేస్తాయి.

ఇంటి గోడలకు శుభసూచకాలు!

ఇంటి అలంకరణలో భాగంగా గోడలకు పలురకాల పెయింటింగ్‌లు ఆకట్టుకుంటాయి. ఒకరకంగా అవి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్‌ చేస్తాయి. భావోద్వేగాలను బ్యాలెన్స్‌ చేస్తాయి. పాజిటివ్‌ ఎనర్జీని సృష్టిస్తాయి. అన్యోన్యతను పెంచుతాయి. అదృష్టానికి చిహ్నంగా కూడా నిలుస్తాయి. వాస్తుశాస్త్రం తరచూ చెబుతోన్న ఈ శుభసూచకాల వల్ల ఇంటీరియర్‌లో భాగంగా ... పెయింటింగ్‌లు పెట్టుకునే నయాధోరణి ఊపందుకుంది. గిఫ్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ షాపులతో పాటు ఆన్‌లైన్లో కూడా రకరకాల పెయింటింగులకు గిరాకీ ఉంటోంది. అయితే వాటికీ కొన్ని లెక్కలున్నాయి సుమా!

ఇంట్లోగానీ, ఆఫీసులోగానీ గోడలకు ఏర్పాటుచేసే కొన్ని రకాల పెయింటింగ్స్‌ వల్ల... అవి ఉన్న ప్రదేశంలో శక్తి పునరుత్తేజితం అవుతుంది. సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ తరహా పెయింటింగ్స్‌ను ఇంట్లో పెట్టుకోవడం శుభప్రదమని వాస్తు నిపుణులు అంటున్నారు. పెయింటింగ్స్‌ను ఇంట్లో పెట్టుకోవడం వల్ల వాటి నుంచి వెలువడే పాజిటివ్‌ ఎనర్జీ అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. అదృష్టం, ఆర్థికవృద్ధి ఉంటుందంటున్నారు. అలాగని ఏదిపడితే అది ఇంట్లో పెట్టుకోవడానికి పనికి రాదు. వాస్తుశాస్త్రం ప్రకారం శుభసూచకమైన పెయింటింగ్‌లు కూడా ఉన్నాయి. ఏ పెయింటింగ్‌ ఎక్కడ వేలాడదీస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకోవడం కూడా అవసరం.


book2.2.jpgశాంతి, సౌఖ్యాలు...

బుద్ధుని ప్రతిమ ప్రశాంతతకు సూచన. చాలామంది ఇంటి ఆవరణలో చిన్న చిన్న బుద్ధుని ప్రతిమలు పెట్టుకోవడం చూస్తూంటాం. బుద్ధుడి పెయింటింగ్‌ను ఇంటి ద్వారానికి ఎదురుగా పెట్టుకోవచ్చు. ఇది శుభసూచకం. ఈ పెయింటింగ్‌ నుంచి వచ్చే పాజిటివ్‌ ఎనర్జీ ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని క్రియేట్‌ చేస్తుంది. పిల్లలకు జ్ఞానోదయం కలగజేస్తుంది. ఇంట్లో నెగెటివ్‌ ఎనర్జీని తొలగిస్తుంది. ఆధ్యాత్మికశక్తిని పెంపొందిస్తుంది. ధ్యానం చేస్తున్నట్టుగా ఉండే బుద్ధుని పెయింటింగ్‌ అంతర్గత శాంతిని, ఏకాగ్రతను పెంపొందిస్తుంది. లివింగ్‌రూమ్‌లో ఉత్తరం లేక తూర్పు గోడకు వేలాడదీసుకోవచ్చు. పూజగదిలో అయితే ఈశాన్య దిక్కులో పెట్టాలంటున్నారు.


book2.3.jpgలక్కీ పెయింటింగ్‌

కొందరి ఇళ్లలో ఏడు గుర్రాలు దౌడు తీస్తున్నట్టుగా ఉండే పెయింటింగ్‌ను చూస్తుంటాం. ఈ పెయింటింగ్‌ విజయానికి సంకేతం. దీన్ని ఇంటికి ‘లక్కీ పెయింటింగ్‌’ అని చెబుతారు. ఈ పెయింటింగ్‌ ఇంట్లో ఉంటే కెరీర్‌లో ఎదుగుదల ఉంటుంది. ఆర్థికంగా బాగుంటారు. ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ పెరుగుతుంది. లివింగ్‌రూమ్‌లో లేక ఆఫీసు గదిలో పెట్టుకుంటే మోటివేషన్‌ రెట్టింపవుతుంది. స్పీడ్‌, సక్సెస్‌, ప్రోగ్రెస్‌కు ఇది సింబాలిక్‌గా ఉంటుంది. ఫెంగ్‌షూయ్‌ ప్రకారం 7వ నంబరు శుభసూచకం. ఏడుగుర్రాలు ఉన్న పెయింటింగ్‌ వేగవంతమైన వృద్ధికి, విజయానికి ప్రతీక. లివింగ్‌రూమ్‌లో లేదా ఆఫీసులో... తూర్పు లేక దక్షిణ దిక్కు గోడలపై పెట్టుకోవచ్చు. దక్షిణగోడకు పెట్టుకుంటే కెరీర్‌లో ఎదుగుదల ఉంటుంది. ఏడు గుర్రాలు ముందుకు పరుగెత్తుతున్నట్టు ఉండాలి.


శుభప్రదం... నెమలి పింఛం...

ఇంట్లో పెట్టుకోదగిన శుభప్రదమైన పెయింటింగ్‌ నెమలి పింఛం. దీన్ని అదృష్టచిహ్నంగా భావిస్తారు. నెగెటివ్‌ ఎనర్జీని దూరం చేసి, సిరి సంపదలు చేకూరుస్తుంది. ఇంట్లో నిత్యం సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక వృద్ధిని కలగజేస్తుంది. ఈ పెయింటింగ్‌ ఇంట్లో ఉంటే సంపదలు రెట్టింపవుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. లివింగ్‌రూమ్‌లో ఉత్తరం లేక ఈశాన్య దిశలో వేలాడదీయొచ్చు.


book2.4.jpg

నవ దంపతులకు ‘బంగారు’కానుక

‘గోల్డ్‌ ఫిష్‌’ పెయింటింగ్‌ను వండర్‌ఫుల్‌ పెయింటింగ్‌ అని పిలుస్తారు. కొత్తగా కాపురం పెట్టిన వారి ఇంట్లో ఉండాల్సిన పెయింటింగ్‌ ఇది. వైవాహిక జీవితం సాఫీగా, ఆనందంగా సాగేందుకు సహాయపడుతుంది. ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. దంపతుల మధ్య సామరస్యం పెరుగుతుంది. వ్యక్తిగత జీవితంలో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. లివింగ్‌ రూమ్‌లో ఉత్తరం లేక తూర్పు గోడలకు తగిలించాలి.


అభివృద్ధికి చిహ్నం

‘ట్రీ ఆఫ్‌ లైఫ్‌’ పెయింటింగ్‌ అతిథులకు ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఉంటుంది. అభివృద్ధి, స్థిరత్వం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీని పెంచుతుంది. సానుకూల శక్తిని అందిస్తుంది. ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావారణాన్ని క్రియేట్‌ చేస్తుంది. అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యతను పెంచుతుంది. సవాళ్లను ఎదుర్కొనే శక్తినిస్తుంది. పంచభూతాలను బ్యాలెన్స్‌ చేస్తుంది. ఆరోగ్యకరమైన జీవనవిధానాన్ని గడిపేందుకు ప్రోత్సహిస్తుంది. లివింగ్‌రూమ్‌లో తూర్పు గోడకు లేక ఈశాన్య దిక్కులో పెట్టుకోవచ్చు. పడకగదిలో, డైనింగ్‌ హాల్‌ దగ్గర కూడా వేలాడదీయొచ్చు.


book2.6.jpgఅదృష్టానికి ఆహ్వానం...

ఆర్థికవృద్ధి కోరుకునేవారికి ‘వాటర్‌ఫాల్‌’ పెయింటింగ్‌ సరైన ఛాయిస్‌. అదృష్టానికి ప్రతీకగా నిలుస్తుంది. మనసుకు ఆహ్లాదాన్ని స్తుంది. వాస్తు ప్రకారం నీరు సంపదకు ప్రతీకగా ఉంటుంది. ఈ పెయింటింగ్‌ ఇంట్లో ఉండటం వల్ల అదృష్టాన్ని ఆహ్వానించినట్టే. వాటర్‌ఫాల్‌ పెయింటింగ్‌లో ఉండే ఆకుపచ్చ రంగు పెరుగుదల, సామరస్యాన్ని, నీలం రంగు ప్రశాంతతను సూచిస్తుంది. లివింగ్‌ రూమ్‌లో లేక కార్యాలయంలో ఉత్తర దిక్కులో లేక ఈశాన్య దిశలో ఉంచాలి.


స్వచ్ఛతకు మారుపేరు

తామరపువ్వు (లోటస్‌) పెయుంటింగ్‌ స్వచ్ఛతకు చిహ్నంగా ఉంటుంది. ఇంటి ఆవరణలో లేక ఇంట్లో ధ్యానం చేసే చోట ఉంచుకోదగిన పెయింటింగ్‌ ఇది. స్వచ్ఛత, జ్ఞానోదయం, నైతిక బలానికి ప్రతీక. ఆధ్యాత్మిక ఎదుగుదలకు దోహదపడుతుంది. ఇంట్లో నెగెటివ్‌ ఎనర్జీని తొలగించి ప్రశాంతతను పెంపొందిస్తుంది. తామర పువ్వు బురద నీటిలో నుంచి పెరిగే తీరున... జీవితంలో సవాళ్లను ఎదుర్కొని ఎదగాలని తెలియజేస్తుంది. లివింగ్‌రూమ్‌లో తూర్పు గోడకు లేదా ఈశాన్య దిక్కులో పెట్టుకోవచ్చు. పడమర, ఆగ్నేయాల్లోనూ వేలాడదీసుకోవచ్చు. పడకగదిలో, కార్యాలయంలో, మెడిటేషన్‌ గదిలో పెట్టుకోవచ్చు.


స్ఫూర్తి మంత్రం

సూర్యోదయం ప్రతిరోజూ స్ఫూర్తినిస్తుంది. రోజూ కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది. సరికొత్త అవకాశాలను, సవాళ్లను స్వీకరించడానికి ప్రేరణను అందిస్తుంది. సూర్యుడు ఎదుగుదలకు, శ్రేయస్సుకు ప్రతీక. తూర్పు దిశలో ఉదయిస్తున్న సూర్యుని పెయింటింగ్‌ను ఉంచడం వల్ల నూతన శక్తి, ఆశావాదం, ఆలోచనలలో స్పష్టత లభిస్తాయి. ప్రకాశవంతమైన సూర్యుని కిరణాలు ప్రతికూలతలను తొలగిస్తాయి. ఏకాగ్రతను పెంచుతాయి. విజయం సాధించడానికి అవసరమైన సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు సహాయపడతాయి. సరైన ప్రదేశంలో వేలాడదీస్తే ఇల్లంతా శక్తిమయం అవుతుంది. ఇంటి ద్వారానికి ఎదురుగా పెట్టుకోవడం ద్వారా ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ పెరుగుతుంది. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ద్వారానికి ఎదురుగా తూర్పు గోడకు వేలాడదీయాలి.


విఘ్నాలకు చెక్‌

గణనాథుని పెయింటింగ్‌ ఇంట్లోకి పాజిటివ్‌ ఎనర్జీని ఆహ్వానిస్తుంది. అడ్డంకులను తొలగిస్తుంది. ఇంటిల్లిపాదికి ఆశీర్వాదాన్నిచ్చి, అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ప్రవేశద్వారానికి ఎదురుగా లేక పూజగదిలో ఈశాన్య దిక్కులో పెట్టుకోవచ్చు. కార్యాలయాల్లోనూ వేలాడదీయొచ్చు. కొత్తగా ప్రారంభించే పనులకు విఘ్నేశ్వరుని ఆశీస్సులు లభిస్తాయి.


అన్యోన్యతకు ఆనవాలు

రెండు హంసలు ఉండే పెయింటింగ్‌ ఇంట్లో ఉండటం వల్ల దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. పడకగదిలో పెట్టుకోదగిన పెయింటింగ్‌ ఇది. ప్రేమ, విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. పరస్పర అవగాహన పెరిగేలా చేస్తుంది. దంపతుల మధ్య ప్రేమ రెట్టింపయ్యేలా చేస్తుంది. ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ పెరుగుతుంది. ఒకే హంస ఉన్న పెయింటింగ్‌ అయితే లివింగ్‌రూమ్‌లో వేలాడదీయాలి.


వీటికి దూరంగా ఉండాలి

హింసను ప్రేరేపిస్తున్న పెయింటింగ్‌లు, ఒంటరితనాన్ని ప్రతిబింబించేవిగా ఉన్న చిత్రాలను ఇంట్లో పెట్టుకోరాదు. నిస్పృహను కలిగించే రంగులు, అడవి జంతువులు, నెగెటివ్‌ గుర్తులు, విపత్తులకు సంబంధించిన చిత్రాలు కూడా సరైనవి కావు.

ఉత్తరం వైపు గోడకు పెయుంటింగ్స్‌ వేలాడదీసుకోవడం వల్ల ఇంట్లో సహజశక్తి పెరుగుతుంది. ప్రశాంతత నెలకొంటుంది. అభివృద్ధి కొనసాగుతుంది. సంపద వృద్ధి చెందుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. ఏకాగ్రత, స్పష్టత వస్తుంది. ఇంట్లో శాంతి, సామరస్యం నెలకొంటుంది.

పాజిటివ్‌ ఎనర్జీ: వాటర్‌ఫాల్స్‌, సూర్యోదయం

ఆర్థిక వృద్ధి: గోల్డ్‌ఫిష్‌, గుర్రాలు, తొండం ఎత్తిన ఏనుగులు

అన్యోన్యత: హంసలు, నెమళ్లు, లవ్‌బర్డ్స్‌

ప్రవేశ ద్వారం: వినాయకుడు, పారుతున్న నీరు, కొండలు


ఈ వార్తలు కూడా చదవండి:

నాన్న నేర్పిన ఆ క్రమశిక్షణే నేను ఇప్పటికీ పాటిస్తున్నా..

దేవునికి దణ్ణం పెట్టుకునేటప్పుడు ఎందుకు కళ్లు మూసుకుంటామో తెలుసా..?

Read Latest Telangana News and National News

Updated Date - Apr 12 , 2026 | 08:30 AM