ప్రతి కార్యకర్తకూ భద్రత
ABN , Publish Date - Apr 12 , 2026 | 06:05 AM
టీడీపీ శ్రేణులు న్యాయబద్ధమైన ఆదాయమార్గం ద్వారా ఆర్థిక సాధికారత సాధించేందుకు ప్రత్యేకంగా ఈ -3 (ఎథికల్ ఎకానమిక్ ఎంపవర్మెంట్) కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ఈ-3 కింద ఆర్థిక సాధికారత
న్యాయబద్ధమైన ఆదాయమార్గం ఏర్పాటు
రాజకీయాల్లో స్వచ్ఛత కోసం క్లీన్ పాలిటిక్స్
టీడీపీ శిక్షణ తరగతుల్లో చంద్రబాబు నిర్దేశం
అమరావతి, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): టీడీపీ శ్రేణులు న్యాయబద్ధమైన ఆదాయమార్గం ద్వారా ఆర్థిక సాధికారత సాధించేందుకు ప్రత్యేకంగా ఈ -3 (ఎథికల్ ఎకానమిక్ ఎంపవర్మెంట్) కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం క్లస్టర్ ఇన్చార్జులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. కాఫీ కబుర్లు కార్యక్రమంలో భాగంగా క్లస్టర్ ఇన్చార్జులతో చంద్రబాబు మాట్లాడారు. ‘‘హెరిటేజ్‌ను ఏర్పాటు చేసి ఏవిధంగా నా కుటుంబానికి నైతిక విలువలతో కూడిన ఆర్థిక సాధికారతను ఇచ్చానో, టీడీపీ కుటుంబం కోసం కూడా న్యాయబద్ధమైన మార్గంలో ఆర్థిక సాధికారత కల్పించేందుకు ఆలోచన చేస్తున్నా’’ అని తెలిపారు. ప్రతి కార్యకర్త ఆర్థిక బలోపేతానికి ఈ-3 కార్యక్రమం అమలు చేస్తామన్నారు. ‘‘నీతి నిజాయితీగా ఉంటేనే విలువలతో కూడిన రాజకీయాలు చేయగలుగుతాం. ప్రజల సేవ కోసం రాజకీయాలు చేయాలి తప్ప జీ వనోపాధిగా ఎంచుకోకూడదు’’ అని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలందరూ స్వచ్ఛమైన వాతావరణంలో నివసించాలన్న ఉద్దేశంతో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని గతంలో చేపట్టానని, అదేవిధంగా స్వచ్ఛ రాజకీయాల కోసం క్లీన్ పాలిటిక్స్‌ను ప్రోత్సహిస్తానన్నారు. క్లీన్ పాలిటిక్స్‌కు కేరాఫ్ అడ్ర్‌సగా టీడీపీని నిలిపేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ‘‘పాజిటివ్ పాలిటిక్స్ చేయాలి.
పాజిటివ్ ఓట్లు పెంచుకోవాలి. గతానికంటే టీడీపీ ఓటు బ్యాంకు పెరగాలి’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘‘ప్రస్తు తం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను, ప్రత్యర్థి పార్టీ దుర్మార్గాలను మెరుగ్గా విశ్లేషించేలా అవగాహ న పెంచుకోండి. పార్టీ కార్యకర్తలకు ఎన్టీఆర్ హ యాం నుంచీ శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు.. ప్రభుత్వం పడుతున్న కష్టా న్ని కూడా ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పండి. నాడు ఐటీతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాను. నేడు క్వాంటమ్‌తో ఏపీని, అమరావతిని అభివృద్ధి చేసి తీరుతాను. ఈ నెల 14న క్వాంటం టెస్టింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభిస్తున్నాం. మే 15న పంటలకు నీళ్లు ఇస్తాం.’’ అని చంద్రబాబు వివరించారు.
సోలార్ రూఫ్ టాప్ వినియోగంపై ఆరా..
‘‘పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ కింద సోలార్ విద్యుత్తును ప్రోత్సహిస్తున్నాం. వీటి ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తును వినియోగించుకుని మిగిలిన దాన్ని గ్రిడ్‌కు విక్రయించుకోవచ్చు. తద్వారా ఆదా యం పొందవచ్చు’’ అని చంద్రబాబు సూచించారు. సోలార్ రూఫ్‌టాప్ వినియోగం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని పలువురు కార్యకర్తలను అడిగి, వారి సమాధానాలను ఆసక్తిగా తెలుసుకున్నారు.