Share News

తైవాన్‌ విషయంలో తప్పు చేస్తే ఘర్షణ తప్పదు

ABN , Publish Date - May 15 , 2026 | 03:55 AM

తైవాన్‌కు అమెరికా సైనిక సహకారం అందించటంపై గుర్రుగా ఉన్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌.. అగ్రరాజ్యాధినేతకు నేరుగా హెచ్చరికలు జారీచేశారు.

తైవాన్‌ విషయంలో తప్పు చేస్తే ఘర్షణ తప్పదు

  • అమెరికా అధ్యక్షుడికి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ స్పష్టీకరణ

  • తైవాన్‌కు సైనిక సహకారం అందివ్వొద్దని సున్నిత హెచ్చరిక

  • రెండు గంటలపాటు చర్చలు జరిపిన ఇద్దరు నేతలు

బీజింగ్‌, మే 14: తైవాన్‌కు అమెరికా సైనిక సహకారం అందించటంపై గుర్రుగా ఉన్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌.. అగ్రరాజ్యాధినేతకు నేరుగా హెచ్చరికలు జారీచేశారు. తైవాన్‌ విషయంలో ఏమాత్రం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా ఘర్షణ తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ముఖంమీదే తేల్చిచెప్పేశారు. రెండురోజుల చైనా పర్యటనలో ఉన్న ట్రంప్‌.. గురువారం షీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. బీజింగ్‌లోని గ్రేట్‌ హాల్‌ ఆఫ్‌ పీపుల్‌లో రెండు గంటలపాటు ఏకాంతంగా జరిగిన చర్చల్లో తైవాన్‌ వివాదంతోపాటు పశ్చిమాసియా యుద్ధం, హోర్ముజ్‌ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన సంక్షోభం, అమెరికా-చైనాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం తదితర అంశాలపై చర్చలు జరిపారు. చర్చల వివరాలను అధికారికంగా వెల్లడించనప్పటికీ.. చైనా అధికారిక మీడియా సంస్థ జిన్‌హువా పలు వివరాలు బయటపెట్టింది. తైవాన్‌ విషయంలో ట్రంప్‌కు జిన్‌పింగ్‌ తన వైఖరిని స్పష్టంగా చెప్పారని పేర్కొంది. ‘తైవాన్‌ విషయంలో అమెరికా సరైన పద్ధతిలో వ్యవహరిస్తే.. మన రెండు దేశాల మధ్య సంబంధాలు ఉన్నతంగా స్థిరంగా కొనసాగుతాయి’ అని జిన్‌పింగ్‌ తెలిపినట్లు జిన్‌హువా వెల్లడించింది. వాణిజ్య యుద్ధం వల్ల ఎవరికీ ప్రయోజనం కలగదని, నష్టమే మిగులుతుందని ట్రంప్‌తో జిన్‌పింగ్‌ అన్నారు. ‘వాణిజ్యం విషయంలో ప్రత్యర్థుల్లా కాకుండా మిత్రులుగా ఉందాం. పరస్పర సహకారంతో పనిచేద్ధాం’ అని జిన్‌పింగ్‌ సూచించినట్లు పేర్కొంది. మరోవైపు చైనాతో తమకు ఉన్న వాణిజ్య లోటును పూడ్చటమే ముఖ్యమైన అంశమని ట్రంప్‌ స్పష్టంచేసినట్లు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. చైనాకు సమీపంలో దక్షిణ చైనా సముద్రంలో ఉన్న తైవాన్‌ తనదేనని చైనా ఎప్పటి నుంచో వాదిస్తోంది. ఆ ద్వీపంతో ఏ దేశమూ నేరుగా సంబంధాలు పెట్టుకోవద్దని హెచ్చరిస్తూ వస్తోంది. తైవాన్‌ మాత్రం తాము సర్వస్వతం త్రులమని చెప్పుకుంటోంది. తైవాన్‌తో అనధికారి సంబంధాలు కొనసాగి స్తున్న అమెరికా.. ఆ దేశానికి ఆయుధాలు, ఇతర సాంకేతికతలను అంది స్తోంది. కాగా, జిన్‌పింగ్‌ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో కీలక వ్యాఖ్యలు చేశారు. తైవాన్‌ విషయంలో అమెరికా విధా నంలో ఏమార్పూ ఉండదని స్పష్టంచేశారు. చైనాతో తైవాన్‌ స్వచ్ఛందంగా కలిసిపోయేందుకు ముందుకొస్తే తమకు అభ్యంతరం లేదని, బలవంతంగా ఆ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం చైనా పెద్ద తప్పు చేసినట్లే అవుతుందని హెచ్చరించారు.

హోర్ముజ్‌ను తెరిచి ఉంచాల్సిందే..

హోర్ముజ్‌ జలసంధిని స్వేచ్ఛాయుత నౌకారవాణా కోసం తెరిచి ఉంచాల్సిందేనని ట్రంప్‌, జిప్‌పింగ్‌ నొక్కి చెప్పారు. ఈ జలసంధిపై ఎవరి నియంత్రణ ఉండరాదని ఇద్దరు నేతలు అంగీకారానికి వచ్చినట్లు వైట్‌హౌస్‌ పేర్కొంది. ఇరాన్‌ వద్ద అణ్వాయుధాలు ఉండరాదన్న అమెరికా వాదనకు జిన్‌పింగ్‌ సంపూర్ణ మద్దతు ఇచ్చినట్లు తెలిపింది.

Updated Date - May 15 , 2026 | 03:55 AM