ప్రపంచ దేశాలకు వెనెజువెలా కృతజ్ఞతలు
ABN , Publish Date - Jun 26 , 2026 | 08:00 AM
విపత్కర పరిస్థితుల్లో వెనెజువెలాకు అండగా నిలిచేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. ఈ తరుణంలో, తమ దేశానికి సంఘీభావం తెలుపుతూ తక్షణ సహాయాన్ని అందిస్తున్న ప్రపంచ దేశాల అధినేతలకు వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కరాకస్, జూన్ 26 : దక్షిణ అమెరికా దేశం వెనెజువెలాలో వరుస భూకంపాలు పెను విషాదాన్ని నింపాయి. అతి తక్కువ వ్యవధిలో సంభవించిన రెండు శక్తిమంతమైన భూకంపాల దాటికి రాజధాని కరాకస్ నుంచి లా గుఐరా (La Guaira) వరకు ఉన్న నగరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు 188 మంది మరణించగా, వేలాది మంది గాయపడ్డారు. వందలాది భవనాలు కుప్పకూలడంతో శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.
ఈ విపత్కర పరిస్థితుల్లో వెనెజువెలాకు అండగా నిలిచేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. ఈ తరుణంలో, తమ దేశానికి సంఘీభావం తెలుపుతూ తక్షణ సహాయాన్ని అందిస్తున్న ప్రపంచ దేశాల అధినేతలకు వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ శుక్రవారం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కష్టకాలంలో వెనెజువెలా ప్రజలకు మానవతా దృక్పథంతో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన కెనడా ప్రధాని మార్క్ కార్నీకి డెల్సీ రోడ్రిగ్జ్ ‘X’ వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే, ఈ దారుణమైన విపత్తును ఎదుర్కొనేందుకు డొమినికన్ రిపబ్లిక్ నుంచి మొదటి రెస్క్యూ టీమ్‌లు ఇప్పటికే వెనిజులాకు బయలుదేరినట్లు ఆమె ప్రకటించారు.
వీరితో పాటు తమకు మద్దతుగా నిలిచిన పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్, కోస్టారికా అధ్యక్షురాలు లారా ఫెర్నాండెజ్, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. స్పెయిన్ ప్రధాని సాంచెజ్ ముఖ్యంగా వెనెజువెలాలోని స్పెయిన్ సమాజానికి అవసరమైన సహాయాన్ని అందించడానికి రెస్క్యూ టీమ్‌లను పంపినట్లు సమాచారం.
రంగంలోకి అమెరికా రెస్క్యూ బృందాలు
మరోవైపు, వెనెజువెలాలో సహాయక చర్యల కోసం అమెరికా సైతం వేగంగా స్పందించింది. యుఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ.. వర్జీనియాలోని ఫెయిర్‌ఫాక్స్ కౌంటీ, అలాగే లాస్ ఏంజిల్స్ నుంచి ప్రత్యేక సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలను వెనెజువెలాకు పంపినట్లు ప్రకటించారు. తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో తాను మాట్లాడినట్లు ఆయన పేర్కొన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడటమే తమ మొదటి ప్రాధాన్యతని రూబియో చెప్పారు. రాబోయే 48 నుంచి 72 గంటలు అత్యంత కీలకమని, వెనెజువెలాలో విమానాశ్రయం తీవ్రంగా దెబ్బతినడం వల్ల అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్ వనరుల్ని ఉపయోగిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే నష్టం తీవ్రతను అంచనా వేయడానికి, ముఖ్యంగా కోస్తా ప్రాంతాలను పర్యవేక్షించడానికి అవసరమైన శాటిలైట్ చిత్రాలను కూడా అందించి సహాయం చేస్తున్నామని మార్కో రూబియో తెలిపారు.
ప్రస్తుతం వెనెజువెలాలో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కూలిపోయిన భవనాల శిథిలాలను తొలగిస్తూ ప్రాణాలను కాపాడేందుకు అంతర్జాతీయ రెస్క్యూ బృందాలు స్థానిక సిబ్బందితో కలిసి శ్రమిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
పూర్తి భద్రత ప్రమాణాలతో సంగం ఉత్పత్తులు
సైబర్ ఫిర్యాదులకు ఇకపై ఈ- జీరో ఎఫ్‌ఐఆర్
Read Latest AP News And Telangana News And International News And Telugu News