ఇరాన్ కౌన్సిల్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ భవనంపై ఇజ్రాయెల్ దాడి
ABN , Publish Date - Mar 03 , 2026 | 09:47 PM
ఇరాన్ నగరం కోమ్‌లో దేశ సుప్రీం నేతను ఎన్నుకునే 'కౌన్సిల్ ఆఫ్ ఎక్స్‌పర్స్ట్' భవనంపై ఇజ్రాయెల్ మంగళవారంనాడు గగనతల దాడులు జరిపింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ అధికారులు ధ్రువీకరించారు.
టెహ్రాన్: ఇరాన్ నగరం కోమ్ (Qom)లోని ఇరాన్ సుప్రీం నేతను ఎన్నుకునే 'కౌన్సిల్ ఆఫ్ ఎక్స్‌పర్స్ట్' భవనంపై ఇజ్రాయెల్ మంగళవారంనాడు గగనతల దాడులు జరిపింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ అధికారులు ధ్రువీకరించారు.
ఇరాన్ సుప్రీం నేతను ఎన్నుకునే బాధ్యత కౌన్సిల్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ పైనే ఉంటుంది. శనివారంనాటి దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో ఆయన వారసుడి ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఖమేనీ వారసుడిని ఎన్నుకునేందుకు ఓటింగ్ జరిపి, వాటిని లెక్కిస్తుండగా ఇజ్రాయెల్ దాడి జరిపినట్టు చెబుతున్నారు. అయితే ఆ సమయంలో కౌన్సిల్‌లోని 88 మంది సభ్యులలో ఎంతమంది హాజరయ్యారు, ఏమేరకు నష్టం జరిగిందనేది వెంటనే తెలియలేదు. 'కొత్త సుప్రీం నేతను ఎన్నుకోకుండా నిరోధించాలని మేము కోరుకుంటున్నాం' అని తాజా దాడుల ఉద్దేశాన్ని ఇజ్రాయెల్ అధికారి ఒకరు తెలిపారు.
కొనసాగుతున్న కీలక దాడులు
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) సమాచారం ప్రకారం, టెహ్రాన్‌లోని కీలక ప్రభుత్వ భవంతులపై ఇజ్రాయెల్ వాయుసేన తాజాగా బాంబు దాడులు జరిపింది. వాటిలో ఇరాన్ అధ్యక్ష భవనం, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉన్నాయి. మరోవైపు, ఖొమేనీ తదితర కీలక నేతల మృతికి ప్రతీకారంగా ఇజ్రాయెల్, మధ్యప్రాచ్యంలోని యూఎస్ సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. మంగళవారంనాడు ఇరాన్ డ్రోన్ ఒకటి రియాద్‌లోని అమెరికా ఎంబసీని ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. అయితే నష్టం తక్కువగానే జరిగినట్టు సౌదీ అధికారులు తెలిపారు. కువైట్‌లోని యూఎస్ కార్యాలయంపై కూడా డ్రోన్ దాడి జరగడంతో ఆ కార్యలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ దిగి వచ్చింది.. కానీ ఇప్పటికే ఆలస్యమైంది: ట్రంప్
ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై దాడి.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడి