హోర్ముజ్‌ను దిగ్బంధిస్తాం
ABN , Publish Date - Apr 13 , 2026 | 05:04 AM
ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. హోర్ముజ్ జలసంధిని అడ్డుపెట్టుకుని ఇరాన్ ప్రపంచ దేశాలను ఇబ్బందిపెడుతోందని మండిపడ్డారు.
అన్ని నౌకలు స్వేచ్ఛగా వెళ్లాలి.. లేదంటే ఒక్కటి కూడా దాటొద్దు
దిగ్బంధించాలని నౌకా దళాన్ని ఆదేశించా..సీమైన్స్ తొలగింపు మొదలైంది
మరికొన్ని దేశాలూ కలిసి వస్తున్నాయి.. రాకపోకలకు మేమే అనుమతిస్తాం
ఇరాన్‌ను అక్రమ దోపిడీకి పాల్పడనివ్వం.. టోల్ ఫీజు కట్టే నౌకల్ని తనిఖీ చేస్తాం
అణు కార్యక్రమంపై ఇరాన్ తీరుతోనే చర్చల్లో ప్రతిష్టంభన
భారీ దాడికి సిద్ధం.. సరైన సమయంలో మిగిలిన పని పూర్తి చేస్తాం: ట్రంప్
హోర్ముజ్‌లోకి వస్తే సుడిగుండంలో చిక్కినట్టే!: ఐఆర్‌జీసీ
వాషింగ్టన్, ఏప్రిల్ 12: ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. హోర్ముజ్ జలసంధిని అడ్డుపెట్టుకుని ఇరాన్ ప్రపంచ దేశాలను ఇబ్బందిపెడుతోందని మండిపడ్డారు. హోర్ముజ్ జలసంధిని తామే దిగ్బంధిస్తామని ప్రకటించారు. ఇరాన్‌కు చమురు ఆదాయం రాకుండా, హోర్ముజ్‌లో టోల్ వసూలు చేయకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. అయితే హోర్ముజ్ నుంచి అన్ని నౌకలు స్వేచ్ఛగా వెళ్లాలని, లేకుంటే ఒక్కటి కూడా జలసంధి దాటొద్దని వ్యాఖ్యానించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని వదులుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. ఒక్క రోజులో ఇరాన్‌ను సర్వనాశనం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో, ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇస్లామాబాద్ చర్చల్లో చాలా అంశాల్లో పురోగతి కనిపించిందని ట్రంప్ చెప్పారు. కానీ అణు కార్యక్రమం అంశంలో మాత్రం చిక్కుముడి పడిందని పేర్కొన్నారు. ‘‘ఒకరకంగా చెప్పాలంటే మా సైనిక చర్యను కొనసాగించడం కంటే.. చర్చల్లో పలు అంశాలపై కుదిరిన సమ్మతి చాలా మంచిది. కానీ అణుశక్తి వంటి ప్రమాదకర సామర్థ్యం ఇరాన్ వంటి అస్థిరమైన, అంచనాలకు భిన్నంగా వ్యవహరించే దేశం చేతిలో ఉండకూడదు. ఇరాన్ తన అణు లక్ష్యాలను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఇరాన్ ప్రతినిధులైన మొహమ్మద్ బఘర్ గలీబఫ్, అబ్బాస్ అరాగ్చీ, అలీ బఘేరీలతో అమెరికా ప్రతినిధులు ఎంతో గౌరవంతో, స్నేహపూర్వకంగా వ్యవహరించారు. కానీ ముఖ్యమైన అంశంపై ఇరాన్ ప్రతినిధులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. నేను ముందు నుంచీ చెబుతున్నట్టుగానే ఇరాన్‌ను ఎన్నటికీ అణ్వాయుధాన్ని పొందనివ్వం’’ అని ట్రంప్ పేర్కొన్నారు. మొత్తం నాగరికతను అంతం చేస్తానని తాను హెచ్చరించడంతోనే ఇరాన్ చర్చల కోసం దిగివచ్చిందని చెప్పారు. ఇప్పుడు చర్చల నుంచి వెళ్లిపోయినా.. తిరిగి వస్తుందని, అమెరికా డిమాండ్లకు అంగీకరిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు.
బెదిరింపులకు అమెరికా లొంగదు..
హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించే ప్రక్రియను తమ నౌకాదళం వెంటనే ప్రారంభిస్తుందని ట్రంప్ ప్రకటించారు. జలసంధిలో రాకపోకలకు తామే అనుమతి ఇచ్చే స్థితికి చేరుకుంటామన్నారు. జలసంధిలో సీమైన్స్ ఉన్నాయని భయపెట్టి టోల్ ఫీజులు వసూలు చేసేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని, ఇది ప్రపంచ స్థాయి దోపిడీ అని వ్యాఖ్యానించారు. ప్రపంచ నేతలు, ముఖ్యంగా అమెరికా ఇలాంటి బెదిరింపులకు లొంగబోదని స్పష్టం చేశారు. అక్రమ దోపిడీ ద్వారా ఇరాన్ లాభపడేందుకు తాము అనుమతించబోమన్నారు. త్వరలోనే జలసంధి దిగ్బంధం మొదలవుతుందని, యూకే సహా మరికొన్ని దేశాలు కూడా ఇందులో భాగమవుతాయని తెలిపారు. అయితే అన్ని నౌకలు స్వేచ్ఛగా జలసంధిని దాటాలని, లేకపోతే ఒక్కటి కూడా వెళ్లకూడదని పేర్కొన్నారు. వెనెజువెలా చమురును అమ్ముకోకుండా నియంత్రించిన తరహాలో, మరింత భారీ స్థాయిలో ఇది జరుగుతుందని చెప్పారు. ఇరాన్‌కు టోల్ ఫీజు కట్టిన ప్రతి నౌకను ఆపి, తనిఖీ చేయాలని తమ నౌకా దళాన్ని ఆదేశించానని ట్రంప్ చెప్పారు. అక్రమ టోల్ చార్జీలు చెల్లించిన ఏ నౌక అయినా కూడా అంతర్జాతీయ జలాల్లో సురక్షిత ప్రయాణం చేయలేదని హెచ్చరించారు.
సీమైన్స్‌ను తొలగిస్తాం..
జలసంధిలో ఇరాన్ పెట్టిన సీమైన్స్‌ను తొలగించే ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తామని ట్రంప్ తెలిపారు. ఈ క్రమంలో అమెరికా నౌకలపైగానీ, శాంతియుత వాణిజ్య నౌకలపైగానీ ఇరాన్ కాల్పులు జరిపితే పేల్చివేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్న ఇరాన్‌కు ఈ పరిస్థితిని ఎలా ముగించాలో బాగా తెలుసని వ్యాఖ్యానించారు. ఇరాన్ నేవీ, ఎయిర్‌ఫోర్స్, రక్షణ వ్యవస్థలు పూర్తిగా నాశనం అయ్యాయని, ఖమేనీ సహా చాలా మంది నేతలు మృతిచెందారని.. ఇదంతా వారి అణు కార్యక్రమంపై మొండిపట్టుతోనే జరిగిందని పేర్కొన్నారు. ఇరాన్‌కు కావాల్సింది డబ్బు, అణ్వస్త్రాలు మాత్రమేనని వ్యాఖ్యానించారు. దాడి కోసం తాము పూర్తి సన్నద్ధతతో ఉన్నామని.. సరైన సమయంలో మా సైన్యం ఇరాన్‌లో మిగిలిన కాస్త పనిని కూడా పూర్తి చేస్తుందని పేర్కొన్నారు. తాము కావాలనుకుంటే ఒక్క రోజులో ఇంధన వనరులు, విద్యుత్ ప్లాంట్లు సహా ఇరాన్‌ను సర్వనాశనం చేయగలమన్నారు. ఇరాన్‌కు చైనా మిలిటరీ సాయం అందజేస్తోందని వార్తలు వస్తున్నాయని.. అదే నిజమైతే చైనాపై 50శాతం అదనపు సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించారు.
భారత్‌తో యుద్ధం ఆపానని..!
ఇస్లామాబాద్‌లో పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్‌ల నేతృత్వంలో ఇరాన్‌తో జరిగిన చర్చల సారాంశాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, జేర్‌డ్ కుష్నర్ తనకు వివరించారని ట్రంప్ తెలిపారు. ఆసిమ్ మునీర్, షెహబాజ్ అసాధారణ వ్యక్తులని ప్రశంసించారు. భారత్‌తో ఘోర యుద్ధాన్ని నివారించి మూడు కోట్ల నుంచి 5 కోట్ల మంది ప్రాణాలను కాపాడానని వారు తరచూ తనకు ధన్యవాదాలు చెబుతుంటారని పేర్కొన్నారు. అలాంటి మానవతా దృక్పథం చూపానని వినడం తనకు సంతోషం కలిగిస్తుందన్నారు.