అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదు: ఇరాన్
ABN , Publish Date - Mar 23 , 2026 | 06:40 PM
ఇరాన్‌తో రెండు రోజులుగా జరుగుతున్న చర్చలు ఫలప్రదంగా సాగుతున్నాయని, దీంతో ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలు, విద్యుత్ కేంద్రాలపై దాడులను ఐదు రోజులు వాయిదా వేయాలని తన బలగాలను ఆదేశించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై టెహ్రాన్ స్పందించింది. అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదని స్పష్టం చేసింది.
టెహ్రాన్: ఇరాన్‌తో రెండు రోజులుగా జరుగుతున్న చర్చలు ఫలప్రదంగా సాగుతున్నాయని, దీంతో ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలు, విద్యుత్ కేంద్రాలపై దాడులను ఐదు రోజులు వాయిదా వేయాలని తన బలగాలను ఆదేశించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై టెహ్రాన్ స్పందించింది. అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదని స్పష్టం చేసింది. తమ ఇంధన సంస్థలపై ఎలాంటి దాడులు చేసినా శత్రువుల ఇంధన వనరులపై దాడి చేస్తామని టెహ్రాన్ గట్టి హెచ్చరిక చేసినట్టు తెలిపింది. దీంతో ఇరాన్ ప్రతీకార చర్యలకు పాల్పడుతుందనే భయంతోనే ట్రంప్ వెనక్కి తగ్గారని ప్రభుత్వ మీడియా పేర్కొంది. ట్రంప్ మాటలను పూర్తిగా నమ్మలేమని, దాడుల వాయిదా పేరుతో సమయం చూసి దాడి చేసేందుకు కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యానించింది.
యుద్ధ విరమణ అమెరికాకే పరిమితం..
ట్రంప్ యుద్ధ విరమణ ప్రకటనపై ఇజ్రాయెల్ సైతం స్పందించింది. యుద్ధ విరమణ అమెరికాకే పరిమితమని పేర్కొంది. తాము యుద్ధాన్ని విరమించలేదని తెలిపింది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో ప్రపంచదేశాల్లో ఇంధన సంక్షోభ పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలో ట్రంప్ ఇరాన్‌కు 48 గంటల డెడ్‌లైన్ విధించారు. గడవులోగా హోర్ముజ్ జలసంధిని తెరవాలని, లేదంటే ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఆ గడువు మంగళవారంతో ముగియడంతో ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో తాజా పోస్ట్ పెట్టారు. ఇరాన్‌తో చర్చలు ఫలప్రదంగా సాగుతున్నందున 5 రోజుల పాటు దాడులు నిలిపివేయాలని ఆదేశాలిచ్చినట్టు చెప్పారు. ఇరాన్‌తో చర్చలు కొనసాగుతాయని, వాటి ఫలితంపై ఆధారపడి భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
5 రోజుల పాటు దాడులు నిలిపివేస్తున్నాం.. ట్రంప్ కీలక ప్రకటన
హోర్ముజ్ జలసంధి దాటాలంటే రూ.18 కోట్లు టోల్ ఫీజు.. ఖండించిన ఇరాన్..