ఇజ్రాయెల్‌తో ఒప్పందంపై నిరసన.. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వాకౌట్
ABN , Publish Date - Jun 15 , 2026 | 09:02 AM
స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరైన ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ విద్యార్థుల నిరసనను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇజ్రాయెల్‌తో గూగుల్ ఒప్పందానికి నిరసనగా విద్యార్థులు వాకౌట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ తాజాగా విద్యార్థుల నిరసనను ఎదుర్కోవాల్సి వచ్చింది. జూన్ 14న స్నాతకోత్సవానికి హాజరైన సుందర్ పిచాయ్ ప్రసంగిస్తుండగా స్టూడెంట్స్ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారు. ఇజ్రాయెల్‌తో గూగుల్ కుదుర్చుకున్న ఒప్పందానికి నిరసనగా విద్యార్థులు వాకౌట్ చేసినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇజ్రాయెల్ ప్రభుత్వం, మిలిటరీతో గూగుల్, అమెజాన్ సంస్థలు ప్రాజెక్టు నింబస్ పేరిట ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం, ఇజ్రాయెల్ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, మిలిటరీ డిజిటల్ వసతులను గూగుల్, అమెజాన్‌లు నిర్వహించే స్థానిక క్లౌడ్ నెట్‌వర్క్‌కు బదిలీ చేయనున్నారు. అయితే, గాజాలో మిలిటరీ ఆపరేషన్స్ కోసం ఇజ్రాయెల్ ఏఐ టూల్స్‌ను వాడుతోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో సుమారు 100 మంది విద్యార్థులు సీఈఓ సుందర్ పిచాయ్ ప్రసంగం సందర్భంగా వాకౌట్ చేశారు. పాలస్తీనాకు స్వేచ్ఛ కల్పించాలని నినాదాలు చేస్తూ వెళ్లిపోయారు. సుందర్ పిచాయ్ తన ప్రసంగంలో ఏఐ ప్రస్తావన తేకపోయినా విద్యార్థుల నిరసనలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఏఐతో ఉపాధి అవకాశాలు తగ్గుతాయని అమెరికన్ యూనివర్సిటీల్లో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా అనేక యూనివర్సిటీల్లో టెక్ సంస్థల అధిపతులు, సీఈఓలు విద్యార్థుల నిరసనను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే, విద్యార్థులు ఆశావాహ దృక్పథంతో ఉండాలని సుందర్ పిచాయ్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ కార్యక్రమంలో సూచించారు.
‘రోజూ వార్తలను చూస్తే పరిస్థితులు అనుకూలంగా లేవని, మునుపెన్నడూ లేని సవాళ్లు ఎదురవుతున్నాయని మనకు అనిపించవచ్చు. నాకు ఇలా అనిపించినప్పుడల్లా ప్రతి తరం ఏదో ఒక కొత్త సమస్యను ఎదుర్కొందన్న విషయాన్ని గుర్తు చేసుకుంటాను. మన చుట్టూ ప్రపంచం ఎలా ఉందనే అంశం మనచేతుల్లో ఉండకపోవచ్చు. కానీ పరిస్థితులను మనం ఎలా చూస్తున్నామనే దాన్ని బట్టి ప్రయోజనాలు కలుగుతాయి’ అని సుందర్ పిచాయ్ విద్యార్థులకు సూచించారు.
ఈ వార్తలనూ చదవండి:
అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం
శాంతి ఒప్పందాన్ని ధ్రువీకరించిన ఇరాన్..