అమెరికా విమానాలకు తమ గగనతలాన్ని మూసేసిన స్పెయిన్
ABN , Publish Date - Mar 30 , 2026 | 09:32 PM
ఇరాన్‌పై దాడులను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న స్పెయిన్ తాజాగా అమెరికాకు మరో షాకిచ్చింది. ఇరాన్‌తో యుద్ధంలో పాలుపంచుకుంటున్న అమెరికన్ యుద్ధ విమానాలను తమ గగనతలంలోకి రాకుండా నిషేధించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై దాడులను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న స్పెయిన్ తాజాగా అమెరికాకు మరో షాకిచ్చింది. ఇరాన్‌తో యుద్ధంలో పాలుపంచుకుంటున్న అమెరికన్ యుద్ధ విమానాలను తమ గగనతలంలోకి అనుమతించబోమని తెలిపింది. ఈ విషయాన్ని స్పెయిన్ రక్షణ శాఖ మంత్రి మార్గరీటా రాబల్స్ సోమవారం వెల్లడించారు. యూఎస్‌తో కలిసి తాము సంయుక్తంగా నిర్వహిస్తున్న సైనిక స్థావరాల నుంచి ఇరాన్‌పై దాడులకు అనుమతించబోమని స్పెయిన్ గతంలో తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.
ఈ విషయంపై స్పెయిన్ ఆర్థిక శాఖ మంత్రి కార్లోస్ కుయెర్పో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధాన్ని స్పెయిన్ ప్రభుత్వం మొదటి నుంచీ వ్యతిరేకిస్తోందని అన్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని అన్నారు. ఇరాన్‌పై యుద్ధాన్ని ఏకపక్షంగా ప్రారంభించారని, ఇది అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు.
ఇక వామపక్ష భావజాలంవైపు మొగ్గు చూపే స్పెయిన్ ప్రభుత్వం అమెరికా, ఇజ్రాయెల్ దాడులను గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఈ దాడులు నిర్లక్ష్యపూరిత చట్టవ్యతిరేక చర్యలని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ గతంలో మండిపడ్డారు. స్పెయిన్ ప్రధాని తీరుపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు స్పెయిన్ ఆర్థికపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. వాణిజ్య సంబంధాలు తెంచుకుంటామని హెచ్చరించారు. అయితే, ఇరు దేశాల మధ్య దౌత్యసంబంధాలు మాత్రం ఎప్పటిలాగే దృఢంగా ఉన్నాయని స్పెయిన్ అధికారులు చెబుతున్నారు.
ఈ వార్తలూ చదవండి:
డీల్ త్వరగా కుదరకపోతే విధ్వంసమే! ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికలు
డొనాల్డ్ ట్రంప్ మాస్టర్ ప్లాన్.. ఇరాన్‌లోని యురేనియమే టార్గెట్..