Share News

త్వరలో పాక్‌కు యూఎస్ ఉపాధ్యక్షుడు! అంతర్జాతీయ మీడియాలో కథనాలు

ABN , Publish Date - Mar 26 , 2026 | 10:02 AM

ఇరాన్ ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాక్‌కు వెళ్లనున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

త్వరలో పాక్‌కు యూఎస్ ఉపాధ్యక్షుడు! అంతర్జాతీయ మీడియాలో కథనాలు
JD Vance to Visit Pakistan

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను చల్లార్చేందుకు అంతర్జాతీయంగా ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్‌ల మధ్య రాజీ కుదిర్చేందుకు పలు దేశాలు చొరవ తీసుకుని మధ్యవర్తిత్వం నెరపుతున్నాయి. ఈ వ్యవహారాల్లో పాక్ కీలకంగా మారిందన్న వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఇరాన్‌ ప్రతినిధులతో చర్చలకు ఇస్లామాబాద్‌ను వేదికగా ఎంచుకోవాలని కూడా పాక్ ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌‌తో శాంతి చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాక్‌ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ వారమే ఆయన పాక్‌కు వెళ్లే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి (JD Vance To Visit Pak).

అమెరికా ప్రభుత్వం తరపున ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జేరెడ్ కుష్నర్ ఇరాన్‌తో ఇప్పటివరకూ చర్చలు జరిపారు. ఈ చర్చలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో వారితో ఈసారి చర్చలు జరిపేందుకు ఇరాన్ సిద్ధంగా లేదట. ఇరాన్‌పై దాడులను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న జేడీ వాన్స్‌తో చర్చలు జరుపుతామని స్పష్టం చేసిందట. ఈ నేపథ్యంలో జేడీ వాన్స్ పాక్‌కు వెళ్లనున్నారన్న వార్త ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.


ఈ వార్తలపై శ్వేత సౌధం ఇటీవలే స్పందించింది. ఇవేవీ కొత్త మార్పులు కావని స్పష్టం చేసింది. ఇరాన్‌తో చర్చల్లో జేడీ వాన్స్ మొదటి నుంచీ క్రియాశీలకంగా ఉన్నారని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు విశ్వసనీయమైన వ్యక్తిగా, అధ్యక్షుడి నేతృత్వంలోని జాతీయ భద్రత బృందంలో కీలక వ్యక్తిగా ఉన్నారని శ్వేతసౌధం ప్రెస్ సెక్రెటరీ కెరొలైన్ లెవిట్ బుధవారం పేర్కొన్నారు. దేశీయ, అంతర్జాతీయ వ్యవహారాల్లో ట్రంప్ ఎల్లప్పుడూ వాన్స్ సలహాలు, సూచనలను తీసుకుంటారని ఆమె తెలిపారు.


యూఎస్ ఎఫ్-18 ఫైటర్ జెట్‌ను కూల్చేశాం: ఇరాన్

నదిలో పడిన బస్సు.. 23 మంది మృతి

Updated Date - Mar 26 , 2026 | 10:40 AM