Share News

పశ్చిమాసియాలో‘చమురు’ మంటలు!

ABN , Publish Date - Mar 19 , 2026 | 03:45 AM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా ఎగిసిపడుతున్నాయి. ఇరాన్‌కు చెందిన సౌత్‌ ఫార్స్‌ సహజవాయు రిఫైనరీపై, బుషెహర్‌ అణువిద్యుత్‌ కేంద్రంపై ఇజ్రాయెల్‌ దాడులు చేసింది.

పశ్చిమాసియాలో‘చమురు’ మంటలు!

  • ఇరాన్‌ సౌత్‌ పార్స్‌ సహజవాయు రిఫైనరీపై ఇజ్రాయెల్‌ దాడి.. ఎగిసిపడిన మంటలు..

  • బుషెహర్‌ అణు కేంద్రంపైకి క్షిపణులు

  • ఖేష్మ్‌ దీవిలో ఇరాన్‌ క్షిపణి స్థావరాలపై అమెరికా బంకర్‌ బస్టర్‌ బాంబులు

  • ఇరాన్‌ నేతలు, ఉన్నతాధికారులు లక్ష్యంగా ఇజ్రాయెల్‌ ప్రత్యేక ఆపరేషన్‌

  • ఇరాన్‌ మంత్రి ఎస్మాయిల్‌ ఖాతిబ్‌ మృతి

  • సౌదీ, యూఏఈ, ఖతార్‌లలోని ఐదు భారీ పెట్రోకెమికల్‌, గ్యాస్‌ ఫీల్డ్‌లపై ఇరాన్‌ ప్రతీకార దాడులు

దుబాయ్‌/వాషింగ్టన్‌/న్యూఢిల్లీ, మార్చి 18: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా ఎగిసిపడుతున్నాయి. ఇరాన్‌కు చెందిన సౌత్‌ ఫార్స్‌ సహజవాయు రిఫైనరీపై, బుషెహర్‌ అణువిద్యుత్‌ కేంద్రంపై ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. నేతలు-ఉన్నతాధికారులు లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్‌తో ఇరాన్‌ మంత్రిని చంపేసింది. అమెరికా కూడా ఖేష్మ్‌ దీవిపై బంకర్‌ బస్టర్‌ బాంబులతో విరుచుకుపడింది. ఈ పరిణామాలతో తీవ్రంగా ఆగ్రహించిన ఇరాన్‌.. ఇజ్రాయెల్‌, అరబ్‌ గల్ఫ్‌ దేశాలపై క్షిపణులు, డ్రోన్ల దాడిని ఉధృతం చేసింది. ముఖ్యంగా ఖతార్‌, యూఏఈ, సౌదీ అరేబియా దేశాల్లోని ఐదు కీలకమైన చమురు, గ్యాస్‌ వ్యవస్థలను లక్ష్యం చేసుకుంటున్నట్టు ప్రకటించింది. దీనితో ఆ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఖతార్‌లోని ప్రపంచంలోనే అతిపెద్దదైన సహజవాయువు నిల్వ/రవాణా కేంద్రం రాస్‌ లఫన్‌ కాంప్లెక్స్‌పై ఇరాన్‌ క్షిపణి దాడులతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. బహ్రెయిన్‌పైనా ఇరాన్‌ డ్రోన్లతో దాడులు చేసింది. రియాద్‌, అల్‌ కర్జ్‌ ప్రాంతాలపైకి ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్లు దూసుకువస్తుండటంతో సౌదీ అప్రమత్తత హెచ్చరికలు జారీ చేసింది. ఈ పరిణామాలతో చమురు, గ్యాస్‌ సరఫరా సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ క్షిపణుల వర్షం

బుధవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌, జేరుసలేం, సెంట్రల్‌ ఇజ్రాయెల్‌లోని వందకుపైగా లక్ష్యాలపై ఇరాన్‌ క్లస్టర్‌ వార్‌హెడ్లు ఉన్న క్షిపణులను ప్రయోగించింది. అవి ఇజ్రాయెల్‌ రక్షణ వ్యవస్థలను ఛేదించుకుని, పలు ప్రాంతాల్లో పేలుళ్లు సృష్టించాయి. రమత్‌గన్‌ ప్రాంతంలో ఇద్దరు మృతిచెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. చాలా చోట్ల ఇళ్లు, భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు, ఇరాన్‌ క్షిపణి దాడులతో ఇజ్రాయెల్‌లోని బెన్‌ గురియన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో మూడు ప్రైవేటు

  • ఖతార్‌, కువైట్‌, యూఏఈ, సౌదీలోని పలు ప్రాంతాలపైకి ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగిస్తూనే ఉంది. రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకుంటుండటంతో.. వాటి శకలాలు నివాస, వాణిజ్య ప్రాంతాల్లో పడి పేలుళ్లు జరుగుతున్నాయి. దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌, ఎగ్జిబిషన్‌ సెంటర్‌ ప్రాంతంలో భారీ పేలుళ్లు జరిగాయి.

  • యూఏఈలోని అల్‌ మిన్హాద్‌ ఎయిర్‌బేస్‌లో ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్లు విధ్వంసం సృష్టించాయి. అక్కడి ఆస్ట్రేలియన్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (ఏడీఎఫ్‌) వ్యవస్థలకు కొంత నష్టం జరిగిందని ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌ వెల్లడించారు.

  • అమెరికా, ఇజ్రాయెల్‌లకు సహకరిస్తున్న 111 మంది ద్రోహులను బుధవారం అరెస్టు చేశామని ఇరాన్‌ ప్రకటించింది. వారి నుంచి పెద్ద సంఖ్యలో ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపింది.


లెబనాన్‌లో మారణకాండ

ఇరాన్‌కు మద్దతుగా వచ్చిన హెజ్బొల్లా సంస్థను అంతం చేస్తామంటూ దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయెల్‌.. లెబనాన్‌లో మారణకాండ సృష్టిస్తోంది. బుధవారం లెబనాన్‌ రాజధాని బీరూట్‌కు సమీపంలోని బశౌరాలో ఇజ్రాయెల్‌ చేసిన దాడుల్లో 20 మంది ప్రజలు మరణించారు. వందల మంది గాయపడ్డారు. మరోవైపు గాజాపైనా ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయి. ఖాన్‌ యూనిస్‌ ప్రాంతంలో ఒక పాలస్తీనా జాతీయుడు మరణించారు. ఇరాన్‌లోని దోరుద్‌ పట్టణంలో ఇజ్రాయెల్‌ చేసిన దాడిలో ఏడుగురు మృతిచెందినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.

1.jpg

ఇరాన్‌ మంత్రి ఎస్మాయిల్‌ ఖాతిబ్‌ మృతి

ఇజ్రాయెల్‌ బుధవారం తెల్లవారుజామున ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌తోపాటు ఇతర కీలక నగరాలపై తీవ్రస్థాయిలో వైమానిక దాడులు చేసింది. ఇరాన్‌ నేతలు, ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకుంది. తమ దాడుల్లో ఇరాన్‌ నిఘా శాఖ మంత్రి ఎస్మాయిల్‌ ఖాతిబ్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు మృతిచెందినట్టు బుధవారం ప్రకటించింది. తమకు సమాచారం ఇవ్వకుండానే ఇరాన్‌ ఉన్నతాధికారులను అంతం చేయడం కోసం మిలిటరీకి ప్రధాని నెతన్యాహు, తాను అనుమతి ఇచ్చినట్టు ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి కాట్జ్‌ చెప్పారు. రెండు రోజుల్లోనే ముగ్గురు కీలక నేతలను అంతం చేశామని, ఇకపై ఇలాంటివి ఇంకా ఉంటాయని పేర్కొన్నారు. ఇరాన్‌లో కీలక నేతలు, అధికారులను అంతం చేసేదిశగా తమ ప్రత్యేక ఆపరేషన్‌ ఉధృతంగా కొనసాగుతోందని ఇజ్రాయెల్‌ ఆర్మీ ప్రకటించింది. కాగా, ఇజ్రాయెల్‌ దాడుల్లో మృతిచెందిన ఇరాన్‌ సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కార్యదర్శి అలీ లారిజానీ, బసిజ్‌ ఫోర్సెస్‌ చీఫ్‌ గోలమ్‌ రెజా సోలేమానీల అంత్యక్రియలు బుధవారం జరిగాయి. ఇజ్రాయెల్‌ దాడిలో అలీ లారిజానీ సహా ఇతర కీలక నేతలు మృతిచెందడంపై ఇరాన్‌ నూతన సుప్రీంలీడర్‌ మొజ్తాబా ఖమేనీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆ నేతల రక్తం ఇస్లామిక్‌ వ్యవస్థను మరింత శక్తివంతం చేస్తుందని.. వారి మృతికి కారణమైన వారు త్వరలోనే మూల్యం చెల్లించుకుంటారని పేర్కొన్నారు.

3.jpg


ఇజ్రాయెల్‌ది బాధ్యతారహిత చర్య: ఖతార్‌

తమ ఉత్తర సహజవాయు క్షేత్రానికి కొనసాగింపుగా ఉన్న ఇరాన్‌ సౌత్‌ పార్స్‌ క్షేత్రంపై ఇజ్రాయెల్‌ దాడిని ఖతార్‌ తీవ్రంగా తప్పుపట్టింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇజ్రాయెల్‌ తీరు పూర్తిగా బాధ్యతారహితమైన చర్య అని మండిపడింది. ఇంధన సదుపాయాలు, క్షేత్రాలను లక్ష్యంగా చేసుకోవడం ప్రపంచ ఇంధన భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని.. అదే సమయంలో పశ్చిమాసియాలో పర్యావరణానికి, ప్రజలకు చేటు కలిగిస్తుందని ఖతార్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి మాజెద్‌ అల్‌ అన్సారీ స్పష్టం చేశారు. అత్యవసర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవద్దని, అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలని కోరారు. కాగా, అమెరికా అనుమతితోనే ఫార్స్‌ సహజవాయు రిఫైనరీపై దాడి చేసినట్టు ఇజ్రాయెల్‌ ఉన్నతాధికారులు చెప్పారని యాక్సియోస్‌ వార్తా సంస్థ కథనం ప్రచురించింది. ఇరాన్‌లో కీలక మౌలిక సదుపాయాలను కూడా లక్ష్యంగా చేసుకోవడంలో అమెరికా సిద్ధమైందనే దానికి ఇది సంకేతమని పేర్కొంది.

ఇరాన్‌ సహజవాయు రిఫైనరీపై ఇజ్రాయెల్‌ దాడి

ఇరాన్‌లోని కీలక రేవు పట్టణమైన బుషెహర్‌కు సమీపంలో ‘సౌత్‌ పార్స్‌’ సహజవాయు(నేచురల్‌ గ్యాస్‌) క్షేత్రం, అసల్యులె రిఫైనరీపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేసింది. దీనితో పేలుళ్లు సంభవించి మంటలు చెలరేగాయి. మంటలు సహజవాయువు నిల్వలకు అంటుకుని భారీ పేలుళ్లు సంభవించే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమైంది. వెంటనే అగ్నిమాపక బృందాలను రంగంలోకి దింపి, మంటలను అదుపులోకి తెచ్చారు. తమ సహజవాయు క్షేత్రం, రిఫైనరీపై ఇజ్రాయెల్‌ దాడిని ఇరాన్‌ తీవ్రంగా ఖండించింది. ఇది చాలా తీవ్రమైన చర్య అని, కచ్చితంగా బదులు తీర్చుకుంటామని ఐఆర్‌జీసీ హెచ్చరించింది. శత్రువులకు సంబంధించి ఇప్పటివరకు భద్రమని భావిస్తున్న మౌలిక సదుపాయాలపైనా దాడులు చేసి, బూడిద చేస్తామని పేర్కొంది. సౌదీలోని సామ్‌రెఫ్‌ రిఫైనరీ, జుబైల్‌ పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌, యూఏఈలోని అల్‌ హోస్న్‌ గ్యాస్‌ ఫీల్డ్‌, ఖతార్‌లోని రాస్‌ లఫన్‌ రిఫైనరీ, మెసాయిద్‌ పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌లపై దాడి చేయనున్నట్టు ప్రకటించింది. అక్కడి ప్రజలంతా వాటికి దూరంగా భద్రమైన ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేసింది.


బుషెహర్‌ అణు కేంద్రంపైకి ఇజ్రాయెల్‌ క్షిపణులు

మంగళవారం అర్ధరాత్రి అనంతరం ఇరాన్‌లోని ఏకైక అణు విద్యుత్‌ కేంద్రం బుషెహర్‌ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై ఇజ్రాయెల్‌ దాడి చేసింది. అణు రియాక్టర్‌కు కొన్ని మీటర్ల దూరంలో క్షిపణి దాడి జరిగిందని ఇరాన్‌ ప్రకటించింది. దీనికి అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) కూడా ధ్రువీకరించింది. అయితే ప్రస్తుతానికి ప్లాంట్‌కు ఎలాంటి ముప్పు లేదని, రేడియేషన్‌ ఏదీ లీకవడం లేదని ప్రకటించింది. కాగా, బుషెహర్‌ అణు విద్యుత్‌ కేంద్రంపై ఇజ్రాయెల్‌ దాడిని రష్యా తీవ్రంగా తప్పుబట్టింది. ఆ ప్లాంటును నిర్మించి, నిర్వహిస్తున్న రష్యా సిబ్బంది అక్కడ ఉన్నారని హెచ్చరించింది.

200 మంది అమెరికన్‌ సైనికులు మృతి: ఇరాన్‌

ఇజ్రాయెల్‌, అరబ్‌ గల్ఫ్‌ దేశాల్లో అమెరికా స్థావరాలపై తాము చేసిన దాడుల్లో తొలి వారంలోనే 200 మంది అమెరికా సైనికులు మృతిచెందారని.. 3,200 మందికిపైగా గాయపడ్డారని ఇరాన్‌ పేర్కొంది. తొలి వారం రోజుల్లోనే అమెరికాకు చెందిన 150 క్షిపణి లాంఛర్లను, 23 పేట్రియాట్‌ గగనతల రక్షణ వ్యవస్థలను, 37 విమానాలు/హెలికాప్టర్లను ధ్వంసం చేసినట్టు పేర్కొంది. పశ్చిమాసియాలోని 43శాతం అమెరికా ఆయుధాలు తుడిచిపెట్టుకుపోయినట్టు వెల్లడించింది.

Updated Date - Mar 19 , 2026 | 03:45 AM