Share News

డీల్‌ లేదని తేల్చేసిన ట్రంప్.. ఇరాన్ ఆచితూచి స్పందన

ABN , Publish Date - Sep 27 , 2026 | 08:52 AM

హోర్ముజ్‌ను తెరిచే దిశగా ఇరాన్ చేసిన ప్రతిపాదనలను తాము తిరస్కరించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఈ విషయంపై ఇరాన్ మాత్రం ఆచితూచి స్పందించింది.

డీల్‌ లేదని తేల్చేసిన ట్రంప్.. ఇరాన్ ఆచితూచి స్పందన
Iran Ministere Araghchi

ఇంటర్నెట్ డెస్క్: హోర్ముజ్‌ను తెరిచే దిశగా ఇరాన్ చేసిన ప్రతిపాదనలను తాము తిరస్కరించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఈ విషయంపై ఇరాన్ మాత్రం ఆచితూచి స్పందించింది. అమెరికా నిర్ణయం గురించి తమకు మధ్యవర్తుల ద్వారా అధికారికంగా ఏ సమాచారం అందలేదని చెప్పింది. ఈ సమస్యకు చర్చలు మాత్రమే పరిష్కారమని కూడా స్పష్టం చేసింది. ఈ విషయంలో తాము గతంలోవిధించిన షరతుల్లో ఎలాంటి మార్పు లేదని కూడా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తేల్చి చెప్పారు. అమెరికా తన హామీలను నిలబెట్టుకుంటే హోర్ముజ్‌ను తెరిచేందుకు తాము సుముఖంగానే ఉన్నామని అన్నారు.

‘షరతుల విషయంలో మేము పూర్తి స్పష్టతతో ఉన్నాము. వాటికి యూఎస్ అంగీకరిస్తేనే హోర్ముజ్ తెరుచుకుంటుంది. ఈ పీటముడి నుంచి బయటపడేందుకు చర్చలే మార్గం’ అని అన్నారు.


అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, గత వారం ఐరాస సర్వసభ్య సమావేశాల సందర్భంగా ఇరాన్ తన ప్రతిపాదల్ని అమెరికా ముందుంచింది. ఖతారీ మధ్యవర్తుల ద్వారా ఈ ప్రతిపాదనలను అమెరికా దృష్టికి తీసుకెళ్లింది. వీటిని తిరస్కరిస్తున్నామని ట్రంప్ శనివారం ప్రకటించారు. ‘వాళ్లు ఓటమి అంచున ఉన్నారు. అందుకే డీల్ కోసం తొందరపడుతున్నారు’ అని శ్వేతసౌధంలో పత్రికాసమావేశంలో ట్రంప్ వ్యాఖ్యానించారు.

అయితే, తమ ప్రతిపాదనను యూఎస్ తిరస్కరించినట్టు మధ్యవర్తుల ద్వారా ఎలాంటి సమాచారం తమకు అందలేని శనివారం అరాగ్చీ తెలిపారు. మధ్యవర్తుల సందేశం కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. ఆ తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా ఆర్థిక దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇరాన్ పోర్టుల నుంచి సరకు రవాణా నౌకలు రాకపోకలు చేయకుండా యూఎస్ అడ్డుకుంటోంది. ఈ ఘర్షణల నేపథ్యంలో హోర్ముజ్‌లో రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రపంచమార్కెట్లో ముడి చమురు ధరలు చుక్కలనంటుతున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

ఏఐ వాయిస్‌ క్లోనింగ్‌తో ఇటలీ బ్యాంక్‌కు టోకరా

ఇరాన్‌తో డీల్‌ ప్రసక్తే లేదు..!

Updated Date - Sep 27 , 2026 | 09:37 AM