ఇరాన్‌లో సంక్షోభం! అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి మధ్య పెరిగిన ఎడం
ABN , Publish Date - May 01 , 2026 | 04:40 PM
ఇరాన్ కీలక రాజకీయ నాయకుల మధ్య ఎడం పెరిగినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. విదేశాంగ మంత్రిని తొలగించాల్సి రావచ్చని అధ్యక్షుడు పెజెష్కియాన్ తన సన్నిహితుల వద్ద అన్నట్టు కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌లో కీలక నాయకుల మధ్య ఎడం మరింత పెరిగినట్టు తెలుస్తోంది. ఇరాన్ సైన్యం అభీష్టానికి అనుగుణంగా విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వ్యవహరిస్తున్నారని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే అరాగ్చీని పదవి నుంచి తొలగించాల్సి రావొచ్చని కూడా ఇరాన్ అధ్యక్షుడు తన ఆంతరంగికులతో అన్నట్టు సమాచారం. అరాగ్చీ తీరుపై ఇరాన్ పార్లమెంటు స్పీకర్ ఘాలిబఫ్ కూడా అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.
మీడియా కథనాల ప్రకారం, ఇరాన్ సైనిక దళం ఐఆర్‌జీసీ అధిపతి అహ్మద్ వహీదీకి అనుకూలంగా మంత్రి అరాగ్చీ వ్యవహరిస్తున్నారని అధ్యక్షుడు, స్పీకర్ మండిపడుతున్నారు. అమెరికాతో చర్చల సందర్భంగా అరాగ్చీ అధ్యక్షుడిని పక్కన పెట్టిన సైనికదళాధిపతితో నేరుగా సంప్రదింపులు జరిపినట్టు ఆరోపణలు వచ్చాయి. వహీదీ మార్గదర్శకాల ప్రకారం యూఎస్‌తో అరాగ్చీ చర్చలు కొనసాగించినట్టు తెలిసింది. ఈ పరిణామాలు ఇరాన్ రాజకీయ నాయకత్వానికి మింగుడు పడలేదని తెలుస్తోంది.
ఇరాన్ రాజకీయ, మిలిటరీ నాయకత్వాల మధ్య పొసగట్లేదన్న వార్తలు గతంలోనే కలకలం రేపాయి. యుద్ధం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ నిర్వహణపై ఇరు వర్గాల మధ్య విభేదాలు ఉన్నట్టు సమాచారం. పెజెష్కియాన్, వహీదీల మధ్య తీవ్రస్థాయి గొడవలు ఉన్నట్టు తెలుస్తోంది. తనను కనీసం రాజకీయపరమైన నిర్ణయాలను కూడా తీసుకోనీయడం లేదని పెజెష్కియాన్ అసంతృప్తితో ఉన్నారని సమాచారం.
అయితే, యుద్ధ సమయంలో కీలక వ్యవహారాలు సైన్యం ఆధీనంలో ఉండాలని వహీదీ వాదిస్తున్నారు. ఇటీవలి అమెరికాతో చర్చల సందర్భంగా అరాగ్చీ సర్దుబాటు ధోరణిని ప్రదర్శించడంపై పార్లమెంటు స్పీకర్ కూడా అసంతృప్తితో ఉన్నారు. డీల్ కుదుర్చుకునే అధికారం అరాగ్చీ బృందానికి లేనట్టు కనిపిస్తోందని తొలి విడత చర్చల అనంతరం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కామెంట్ చేయడం గమనార్హం
ఈ వార్తలనూ చదవండి:
ఇరాన్‌పై దాడులు.. 60 రోజుల డెడ్‌లైన్‌పై అమెరికాలో ఉత్కంఠ
అందుకే నేను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోను: ట్రంప్