Share News

ఇరాన్‌పై దాడులు.. 60 రోజుల డెడ్‌లైన్‌పై అమెరికాలో ఉత్కంఠ

ABN , Publish Date - May 01 , 2026 | 10:27 AM

ఇరాన్‌పై అమెరికా తీసుకుంటున్న చర్యల భవితవ్యంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. యుద్ధానికి సంబంధించి 1973 నాటి వార్ పవర్స్ తీర్మానంపై ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలు భిన్నవాదనలను వినిపిస్తున్నాయి.

ఇరాన్‌పై దాడులు.. 60 రోజుల డెడ్‌లైన్‌పై అమెరికాలో ఉత్కంఠ
US -Iran Conflict - 1973 War Powers Resolution

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌-అమెరికా ఘర్షణల భవితవ్యంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. 1973 నాటి వార్ పవర్స్ తీర్మానం ప్రకారం, యుద్ధం ప్రారంభించిన 60 రోజుల్లోపు యూఎస్ ప్రభుత్వం చట్టసభల (కాంగ్రెస్) అనుమతి తీసుకోవాలి. అనుమతి లభించకపోతే యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టి సేనలను వెనక్కు పిలిపించాల్సి ఉంటుంది. మే 1తోనే ఈ గడువు ముగిసింది. దీంతో, ఇరాన్‌పై ట్రంప్ ప్రభుత్వ చర్యలు కొనసాగుతాయా? లేదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ట్రంప్ ప్రభుత్వ వాదనలు ఇవీ..

ఇరాన్‌పై దాడులను యుద్ధంగా పరిగణించట్లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు. అది కేవలం మిలిటరీ చర్య మాత్రమేనని అన్నారు. కాంగ్రెస్ అనుమతి అవసరం లేదని చెప్పుకొచ్చారు. కొన్ని పత్రికా సమావేశాల్లో మాత్రం ఇరాన్‌పై దాడులను యుద్ధంగా అభివర్ణించారు. ఈ చర్యలను ఎలా కావాలంటే అలా పిలుచుకోవచ్చంటూ మరికొన్ని సార్లు తెగేసి చెప్పారు.

ఇది చాలదన్నట్టు పరిస్థితి మరింత సందిగ్ధంగా మారేలా ట్రంప్ ప్రభుత్వం మరో కీలక వాదనను కూడా తెరపైకి తెచ్చింది. కాల్పుల విరమణ పేరిట అమెరికా కొన్ని రోజుల పాటు దాడులను నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతోంది. ఈ కాలానికి 60 రోజుల కాలపరిమితి నిబంధన వర్తించదని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తోంది. శాంతియుత వాతావరణం ఉన్న సమయానికి వార్స్ పవర్స్ తీర్మానం వర్తించనందున 60 రోజుల గడువు ముగియలేదని చెబుతోంది. అసలు ఇరాన్‌తో ఘర్షణలు దాదాపుగా ముగిసినట్టేనని కూడా శ్వేత సౌధం వర్గాలు తెలిపాయి. కాబట్టి, ప్రస్తుతానికి కాంగ్రెస్ అనుమతి అవసరం లేదని అంటున్నాయి.


ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ సభ్యులు మాత్రం అమెరికా ప్రభుత్వ వాదనతో విభేదిస్తున్నారు. వార్ పవర్స్ తీర్మానంలో అలాంటి నిబంధనే లేదని అంటున్నారు. ఆ నిర్వచనానికి ఆస్కారం లేదని తేల్చి చెబుతున్నారు. ఇరాన్‌పై దాడులకు చట్టబద్ధత లేదని ప్రతిపక్ష సభ్యులు మొదటి నుంచీ వాదిస్తున్నారు.

వీటికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు సెనేటర్ ఆడమ్ షిఫ్ ఇప్పటికే సెనేట్‌లో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 60 రోజులు గడువు ముగిశాక తామూ రంగంలోకి దిగుతామని సహచర సెనేట్ సభ్యులు తనకు చెప్పినట్టు తెలిపారు. ‘దాదాపు రెండు నెలలుగా యుద్ధం సాగుతోంది. 13 మంది అమెరికన్ సైనిక సిబ్బంది మరణించారు. డబ్బులూ వృథా అయిపోయాయి. ఇప్పటికే మనం భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాము. ఇక యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే’ అని ఆయన తేల్చి చెప్పారు.

సెనేట్‌లో ఈ తీర్మానం నెగ్గినా ప్రతినిధుల సభలో మాత్రం ఆమోదం లభించడం అసాధ్యమని పరిశీలకులు అంటున్నారు. ఇక వార్స్ పవర్స్ తీర్మానం విషయంలో జోక్యం చేసుకునేందుకు అక్కడి కోర్టులు మొదటి నుంచీ సంశయిస్తూనే ఉన్నాయి. గతంలో ఈ విషయంలో తలెత్తిన వివాదాలు రాజకీయ చర్చలతోనే పరిష్కారమయ్యాయి.


ఈ వార్తలనూ చదవండి

అమెరికాకు హ్యాండిచ్చిన పాక్.. ఇరాన్‌కు సాయం!

పుతిన్ ఆఫర్‌ను తిరస్కరించిన ట్రంప్.. 90 నిమిషాలు మాట్లాడుకున్న నేతలు..

Updated Date - May 01 , 2026 | 12:33 PM