Share News

అబ్రహం లింకన్‌ యుద్ధనౌకపై దాడి!

ABN , Publish Date - Mar 14 , 2026 | 04:33 AM

అమెరికాకు చెందిన కీలక విమాన వాహక యుద్ధ నౌక ‘యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌’పై దాడులు చేశామని ఇరాన్‌ ఇస్లామిక్‌ రెవెల్యూషనరీ గార్డ్స్‌ కార్ప్స్‌......

అబ్రహం లింకన్‌ యుద్ధనౌకపై దాడి!

  • క్షిపణులు, డ్రోన్లతో చేసిన దాడుల్లో అమెరికా విమాన వాహక యుద్ధ నౌక దెబ్బతిన్నదన్న ఐఆర్‌జీసీ

  • నౌక గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌ నుంచి వెనక్కి తిరిగి అరేబియాలోకి వెళ్లిందని ప్రకటన

దుబాయ్‌/వాషింగ్టన్‌/న్యూఢిల్లీ, మార్చి 13: అమెరికాకు చెందిన కీలక విమాన వాహక యుద్ధ నౌక ‘యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌’పై దాడులు చేశామని ఇరాన్‌ ఇస్లామిక్‌ రెవెల్యూషనరీ గార్డ్స్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) శుక్రవారం ప్రకటించింది. ఇరాన్‌ ప్రాదేశిక జలాల నుంచి సుమారు 340 కిలోమీటర్ల దూరంలో గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌ ప్రాంతంలోని మోహరించిన ఈ యుద్ధనౌకపైకి అత్యాధునిక క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించామని.. దాడిలో యుద్ధ నౌకకు గణనీయంగా నష్టం వాటిల్లిందని పేర్కొంది. దీనితో యుద్ధ మోహరింపు నుంచి అబ్రహం లింకన్‌ను వెనక్కి తీసుకుని, వేగంగా అరేబియా సముద్రంవైపు తరలించారని ఐఆర్‌జీసీ వెల్లడించింది.

దాడిపై స్పష్టత ఇవ్వని అమెరికా..

యూఎ్‌సఎస్‌ అబ్రహం లింకన్‌ యుద్ధనౌకపై దాడి, నష్టం విషయంలో అమెరికా తగిన స్పష్టత ఇవ్వలేదు. ఇరాన్‌కు చెందిన ఒక నౌక.. ‘అబ్రహం లింకన్‌’కు చాలా దగ్గరగా వచ్చిందని.. వెంటనే నౌకాదళ మార్క్‌-45 గన్‌తో దానిపై కాల్పులు జరిపామని అమెరికా రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఆ గుళ్లను తప్పించుకుంటూ ఇరాన్‌ నౌక వెనుదిరిగి పారిపోయిందని... వెంటనే ఒక యుద్ధ హెలికాప్టర్‌ను పంపి ఇరాన్‌ నౌకపై రెండు హెల్‌ఫైర్‌ క్షిపణులతో దాడి చేశామని వెల్లడించారు. అయితే ఇరాన్‌ నౌక ధ్వంసమైపోయిందా, అందులోని సిబ్బంది ఏమయ్యారన్న వివరాలు వెల్లడించలేదు. అబ్రహం లింకన్‌ నౌకపై మోహరించి ఉన్న ఎంహెచ్‌-60ఆర్‌ సీహాక్‌, ఏహెచ్‌-1జెడ్‌ వైపర్‌ హెలికాప్టర్లకు హెల్‌ఫైర్‌ క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం ఉంది. ఇరాన్‌ నౌకపై దాడికి వీటిలో దేనిని వినియోగించినదీ తెలపలేదు. నిజానికి అబ్రహం లింకన్‌ నౌకపై దాడి చేశామని ఇంతకు ముందు కూడా ఐఆర్‌జీసీ ప్రకటించింది. కానీ ఆ క్షిపణులు కనీసం నౌక సమీపంలోకి కూడా రాలేదని, నౌకకు ఏమీ కాలేదని అమెరికా పేర్కొంది. ఇప్పుడు మాత్రం నౌకకు ఎలాంటి నష్టం జరగలేదనే ప్రస్తావనేదీ చేయలేదు. ఇరాన్‌పై దాడి కోసం యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌ విమాన వాహక యుద్ధ నౌక ఆధ్వర్యంలో యూఎస్‌ఎస్‌ స్ర్పువాన్స్‌, యూఎస్‌ఎస్‌ మైఖేల్‌ మర్ఫీ మిస్సైల్‌ డెస్ట్రాయర్లు, ట్యాంకర్‌ నౌకలు, ఫ్రిగేట్లతో కూడిన నావికా దళాన్ని అమెరికా జనవరి చివరిలో గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌కు తరలించింది.


అణుశక్తితో నడిచే భారీ యుద్ధ నౌక

అలలపై తేలియాడే ఓ చిన్న నగరం.. రన్‌వే సహా యుద్ధ విమానాలు కొలువైన చిన్న ఎయిర్‌బేస్‌.. ఒక వార్‌ కమాండ్‌ సెంటర్‌.. ఇవన్నీ కలిస్తే.. ‘యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌’. అణుశక్తితో నడిచే నిమిట్జ్‌-క్లాస్‌ విమాన వాహక యుద్ధ నౌక. 1989 నవంబరులో జల ప్రవేశం చేసింది. అణుశక్తితో నడుస్తుంది కాబట్టి ఎంతకాలమైనా, ఎంతదూరమైనా ప్రయాణించగలదు. దీని పొడవు 332 మీటర్లు, వెడల్పు 78 మీటర్లు. నౌక ఉపరితలం సుమారు 4.5 ఎకరాల విస్తీర్ణం ఉంటుంది. మొత్తంగా 4,500 నుంచి 5,500 మంది వరకు సిబ్బంది ఉంటారు. ఎఫ్‌/ఏ-18 సూపర్‌ హార్నెట్‌, ఎఫ్‌-35సీ యుద్ధ విమానాలు, ఎంహెచ్‌-60 సీహాక్‌ హెలికాప్టర్లు వంటివి కలిపి 90 వరకు ఎయిర్‌క్రా్‌ఫ్టలు ఉంటాయి. రాడార్లు, క్షిపణులు, రక్షణ వ్యవస్థలు, ఎలకా్ట్రనిక్‌ వార్‌ఫేర్‌ వ్యవస్థలు, నౌకా శతఘ్నులు, టార్పెడోలు భారీ స్థాయిలో సిద్ధంగా ఉంటాయి. 1991 గల్ఫ్‌ వార్‌, 2003 ఇరాక్‌ యుద్ధం నుంచి ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధం దాకా అమెరికా సైనిక చర్యల్లో అబ్రహం లింకన్‌ నౌకది కీలక పాత్ర.

కూలిపోయిన అమెరికా ట్యాంకర్‌ విమానం

అమెరికా యుద్ధ విమానాలకు గాల్లో ప్రయాణిస్తుండగానే ఇంధనాన్ని నింపే బోయింగ్‌ కేసీ-135 స్ట్రాటోట్యాంకర్‌ విమానం ఇరాక్‌లో కూలిపోయింది. అందులోని ఇద్దరు పైలట్లు సహా ఆరుగురు సిబ్బంది మృతి చెందారు. ఈ దాడి చేసినది తామేనని ఇరాక్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఇరాన్‌ అనుకూల ఇస్లామిక్‌ రెసిస్టెన్స్‌ సంస్థ ప్రకటించింది. అయితే కేసీ-135 విమానం శత్రువుల దాడితో కూలిపోలేదని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ప్రకటించింది. ఘటన సమయంలో రెండు విమానాలు ప్రయాణిస్తున్నాయని.. అందులో ఒకటి కూలిపోగా, మరొకటి సురక్షితంగా ల్యాండ్‌ అయిందని వెల్లడించింది. ఈ ట్యాంకర్‌ విమానం కూలిపోవడానికి కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపింది. ఇరాన్‌పై దాడులు చేపట్టిన తర్వాత కూలిపోయినట్టు అధికారికంగా ప్రకటించిన నాలుగో విమానం ఇది. ఇంతకుముందు కువైట్‌ రక్షణ వ్యవస్థలు పొరపాటుగా మూడు ఎఫ్‌-15ఈ స్ట్రైక్‌ ఈగిల్‌ యుద్ధ విమానాలను కూల్చివేశాయి. అయితే వాటి పైలట్లు ప్రాణాలతో బయటపడ్డారు.

2.jpg


మరో ఇద్దరు భారతీయుల మృతి

ఒమన్‌లోని సోహర్‌ పట్టణంపై జరిగిన ఇరాన్‌ డ్రోన్‌ దాడుల్లో ఇద్దరు భారతీయులు మృతిచెందారు. మరో పది మంది భారతీయులు సహా 11 మంది గాయపడ్డారు. మన విదేశాంగ శాఖ అదనపు సెక్రెటరీ అసీమ్‌ మహాజన్‌ శుక్రవారం ఈ వివరాలు వెల్లడించారు. గాయపడిన భారతీయుల్లో ఐదుగురు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని, మిగతా వారు చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారికి తగిన సాయం అందేలా చర్యలు చేపట్టామని వివరించారు. ఒమన్‌లో భారతీయుల మృతిపట్ల విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ సంతాపం వ్యక్తం చేవారు. కాగా, ఇరాక్‌లోని ‘సేఫ్‌సీ విష్ణు‘ చమురు ట్యాంకర్‌పై ఇరాన్‌ ఆత్మాహుతి బోట్‌ దాడిలో మరణించిన భారతీయుడిని ముంబై వాసి 45 ఏళ్ల దేవనందన్‌ ప్రసాద్‌ సింగ్‌గా గుర్తించారు. బిహార్‌కు చెందిన ఆయన కొన్నేళ్ల క్రితం భార్య, ఇద్దరు పిల్లతో కలిసి వచ్చి ముంబైలో స్థిరపడ్డారు. అమెరికాకు చెందిన ‘సేఫ్‌సీ విష్ణు’ చమురు ట్యాంకర్‌లో అదనపు చీఫ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ట్యాంకర్‌పై జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి మృతిచెందారు.

90 వేల కిలోల ఇంధనాన్ని మోస్తూ..

విమానాలకు గాల్లో ఇంధనం నింపే ట్యాంకర్‌ విమానాల్లో ప్రపంచంలో అత్యంత ఎక్కువగా వినియోగించేది కేసీ-135 స్ట్రాటోట్యాంకర్‌. ఈ విమానం విలువ ప్రస్తుత లెక్కల ప్రకారం సుమారు రూ.740 కోట్లు (80 మిలియన్‌ డాలర్లు). సుమారు 90వేల కిలోల (2 లక్షల పౌండ్ల) ఇంధనాన్ని మోసుకుంటూ ప్రయాణించగలదు. అవసరమైన సందర్భాల్లో ఆయుధాలను, ఇతర సామగ్రిని, మిలిటరీ సిబ్బందిని కూడా దీనిలో తరలించవచ్చు. గత ఐదు దశాబ్దాల్లో వివిధ దేశాలపై చేసిన దాడుల సందర్భంగా అమెరికా వీటిని వినియోగిస్తూ వస్తోంది. ఆగకుండా ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చిన సందర్భాల్లో బాంబర్లు, ఫైటర్లకు దీనితో ఇంధనం నింపుతారు. అమెరికా గతేడాది ఇరాన్‌లోని అణు కేంద్రాలపై బీ-2 బాంబర్లతో దాడులు చేసిన విషయం తెలిసిందే. అమెరికాలోని ఫ్లొరిడా నుంచి బయల్దేరిన బీ-2 బాంబర్లు ఏకబిగిన 12 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఈ దాడులు చేశాయి. బీ-2 బాంబర్లు అంతదూరం ప్రయాణించడానికి అవసరమైన ఇంధనాన్ని కేసీ-135 విమానం గాల్లో ప్రయాణిస్తుండగానే నింపుతూ వచ్చింది. 1960వ దశకంలో బోయింగ్‌ సంస్థ ఈ విమానాలను రూపొందించింది. తర్వాత అవసరాన్ని బట్టి ఆధునికీకరిస్తూ వస్తున్నారు. అమెరికాలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ దేశ స్థావరాల్లో 376 వరకు కేసీ-135 విమానాలు ఉన్నట్టు అంచనా.

ఇరాన్‌ డ్రోన్లను అడ్డుకునేందుకు అమెరికా డ్రోన్లు

ఇరాన్‌ తమ షహీద్‌ డ్రోన్లతో అమెరికా, ఇజ్రాయెల్‌లకు చుక్కలు చూపిస్తున్న నేపథ్యంలో అమెరికా కూడా డ్రోన్లను రంగంలోకి దింపుతోంది. పశ్చిమాసియా ప్రాంతానికి 10 వేల ‘మెరోప్స్‌’ ఇంటర్‌సెప్టర్‌ డ్రోన్లను పంపుతున్నట్టు అమెరికా ఆర్మీ సెక్రెటరీ డాన్‌ డ్రిస్కోల్‌ శుక్రవారం వెల్లడించారు. ఐదురోజుల్లో అవి పశ్చిమాసియా ప్రాంతానికి చేరుకుంటాయని తెలిపారు. ఆ ఒక్కో డ్రోన్ల ఖరీదు ఒక్కో దానికి రూ.14 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.

Updated Date - Mar 14 , 2026 | 07:08 AM