ఉక్రెయిన్‌లో స్టార్‌షీల్డ్ సేవలపై మస్క్ ఆంక్షలు!
ABN , Publish Date - Oct 21 , 2026 | 08:40 AM
ఉక్రెయిన్ దళాల సమాచార వ్యవస్థకు కీలకంగా ఉన్న స్టార్‌షీల్డ్‌పై (మిలిటరీ గ్రేడ్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు) ఆంక్షలు విధించాలని మస్క్ వ్యక్తిగతంగా ఆదేశించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో స్టార్‌లింక్ శాటిలైట్ సేవలకు అనుమతుల జాప్యంపై టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ ఇటీవల రకరకాల ఆరోపణలు చేశారు. ఈ వాదనలను భారత్ తోసిపుచ్చింది. భద్రతా అంశాల పరిశీలన తరువాతే అనుమతులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఉక్రెయిన్ దళాల సమాచార వ్యవస్థకు కీలకంగా ఉన్న స్టార్‌షీల్డ్‌పై (మిలిటరీ గ్రేడ్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు) ఆంక్షలు విధించాలని మస్క్ వ్యక్తిగతంగా ఆదేశించినట్టు వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది.
శాటిలైట్ సేవలపై ఆంక్షలతో ఉక్రెయిన్ మిలిటరీ చర్యలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దాడులు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ పరిణామాలపై ఉక్రెయిన్‌లో ఆందోళన చెలరేగగా ట్రంప్ సర్కారులో కూడా తికమకకు దారి తీసినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ట్రంప్, మస్క్ మధ్య చర్చలు..
శాటిలైట్ సేవలపై ఆంక్షలు, స్పీడ్ తగ్గింపుపై మస్క్, అధ్యక్షుడు ట్రంప్ ఫోన్‌లో మాట్లాడుకున్న వారానికి ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై అంతకుముందు మస్క్ మాట్లాడుతూ స్టార్‌షీల్డ్‌పై నిర్ణయాలు తన పరిధిలోకి కావని స్పష్టం చేశారు. యూఎస్ ప్రభుత్వానిదే తుది నిర్ణయమని పేర్కొన్నారు. ఈ పరిణామాలకు తాను, మస్క్ ఎంతమాత్రం బాధ్యులం కాదని ట్రంప్ వ్యాఖ్యానించడం కొసమెరుపు.
ఆంక్షలతో ఆటంకాలు..
ఆంక్షలతో తమ కార్యకలాపాలపై ప్రభావం పడుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సోమవారం బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. యుద్ధ క్షేత్రంలో రవాణా కార్యకలాపాలు, డ్రోన్ మిషన్లు నెమ్మదించాయని అన్నారు. రష్యా డ్రోన్ దాడులను అడ్డుకునే వ్యవస్థలపై కూడా ప్రభావం పడిందని చెప్పారు. ఆంక్షలను తొలగించాలని మస్క్‌ను అభ్యర్థించారు. అవి తన పరిధోని అంశాలు కావని మస్క్ జవావిచ్చారు. ఇక సాధారణ పౌరులకు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు స్పేఎక్స్ సంస్థ స్టార్‌లింక్‌ను అందుబాటులోకి తెచ్చింది. మిలిటరీ అవసరాల కోసం ప్రత్యేకంగా స్టార్‌షీల్డ్ శాటిలైట్ ఇంటర్నెట్‌ను రూపొందించి అమెరికా ప్రభుత్వానికి అప్పగించింది.
ఈ వార్తలనూ చదవండి:
అమెరికాలో 3 లక్షల వీసాల రద్దు!
ఒక్క గ్రాము యురేనియం కూడా ఇవ్వం.. అమెరికాకు తేల్చి చెప్పిన ఇరాన్..