Share News

అమెరికాలో 3 లక్షల వీసాల రద్దు!

ABN , Publish Date - Oct 21 , 2026 | 07:41 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచీ ఇప్పటివరకూ దాదాపు 3 లక్షల వీసాలను రద్దు చేశామని ప్రభుత్వం తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది.

అమెరికాలో 3 లక్షల వీసాల రద్దు!
Donald Trump

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచీ ఇప్పటివరకూ దాదాపు 3 లక్షల వీసాలను రద్దు చేశామని ప్రభుత్వం తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. 2025 జనవరిలో ట్రంప్ రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, వీసాల రద్దుపై ఈ ఏడాది ఆగస్టు 10న విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 2025 జనవరి - 2026 ఆగస్టు మధ్య కాలంలో 1.75 లక్షల వీసాలు రద్దైనట్టు అప్పట్లో పేర్కొంది. ఆ తరువాత రెండు మూడు నెలల వ్యవధిలోనే రద్దైన వీసాల సంఖ్య అమాంతం పెరిగి 3 లక్షలకు చేరుకుంది.


అమెరికా చరిత్రలో మునుపెన్నడూ చూడని విధంగా ట్రంప్ సర్కారు వీసాల రద్దు వేగాన్ని పెంచిందని విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పైగట్ అన్నారు. అమెరికాలో చట్టాలు ఉల్లంఘించే వారు, జాతీయ భద్రతకు ముప్పుగా మారిన వారు, మోసాలకు పాల్పడే విదేశీయులను ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. వలసల కట్టడికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ట్రంప్ ఇప్పటికే పలుమార్లు సమర్థించుకున్నారు. దేశ భద్రతకోసమే ఈ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.


పౌర హక్కుల కార్యకర్తలు మాత్రం ట్రంప్ సర్కారు తీరును విమర్శిస్తున్నారు. న్యాయప్రక్రియలను పూర్తిస్థాయిలో అనుసరించకుండా ట్రంప్ సర్కారు త్వరితగతిన వీసాలు రద్దు చేస్తోందని ఆరోపిస్తున్నారు. మైనారిటీల్లో అభద్రతా భావం పెంచుతున్నారని మండిపడుతున్నారు. జాతీయ భద్రత పేరిట విమర్శకుల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఓవైపు పెద్ద ఎత్తున వీసాలను రద్దు చేస్తున్న ట్రంప్ సర్కారు మరోవైపు వీసా జారీ నిబంధనలను కూడా కట్టుదిట్టం చేసింది. అభ్యర్థుల సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే వీసాలు జారీ చేస్తోంది.


ఈ వార్తలనూ చదవండి:

ఒక్క గ్రాము యురేనియం కూడా ఇవ్వం.. అమెరికాకు తేల్చి చెప్పిన ఇరాన్..

మీ తీరు సరికాదు.. భారత పోలీసుల వైఖరిపై ఐరాస

Updated Date - Oct 21 , 2026 | 07:42 AM