జర్మనీ నుంచి 5 వేల మంది సైనికులను ఉపసంహరించుకునే యోచనలో ట్రంప్ ప్రభుత్వం
ABN , Publish Date - May 02 , 2026 | 09:42 AM
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల్లో జర్మనీ సహా ఇతర నాటో మిత్రదేశాల మద్దతు తక్కువగా ఉందన్న అసంతృప్తితో రగిలిపోతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జర్మనీలో ఉన్న అమెరికా సైనికుల్లో 5 వేల మందిని తగ్గించే యోచనలో ఉన్నట్టు సమాచారం.
వాషింగ్టన్ డీసీ (యూఎస్), మే 2: ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో జర్మనీ సహా ఇతర నాటో మిత్రదేశాల మద్దతు తక్కువగా ఉందన్న అసంతృప్తితో రగిలిపోతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జర్మనీలో ఉన్న అమెరికా సైనికుల్లో 5 వేల మందిని తగ్గించే యోచనలో ఉన్నట్టు సమాచారం. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల్లో జర్మనీతో సహా ఇతర నాటో (NATO) మిత్రదేశాల మద్దతు తక్కువగా ఉందన్న ఆగ్రహంతోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇరాన్ విషయంలో జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ వైఖరిని ట్రంప్ బహిరంగంగానే విమర్శించారు.
గత డిసెంబర్ నాటికి, జర్మనీలోని వివిధ స్థావరాలలో అమెరికాకు చెందిన 36,000 మందికి పైగా క్రియాశీల సైనిక సిబ్బంది, 1,500 మంది రిజర్విస్టులు, 11,500 మంది పౌర ఉద్యోగులు మోహరించి ఉన్నారని అమెరికా రక్షణ శాఖ గణాంకాలను చెబుతున్నాయి. తాజాగా ట్రంప్ ఇందులో నుంచి 5 వేల మంది సైనికుల్ని వెనక్కి పిలవాలని భావిస్తున్నారని అంతర్జాతీయ వార్తా సంస్థల కథనాలు చెబుతున్నాయి. వెనక్కి తీసుకున్న సైనికులను తిరిగి అమెరికాకు పంపడం లేదా 'ఇండో-పసిఫిక్' వంటి ఇతర కీలక ప్రాంతాలకు తరలించే అవకాశం ఉందని చెబుతున్నాయి. మరోవైపు, జర్మనీలో ఉన్న అతిపెద్ద అమెరికా సైనిక ఆసుపత్రి (లాండ్‌స్టూల్ రీజనల్ మెడికల్ సెంటర్) కార్యకలాపాలకు సైనికుల తగ్గింపు వల్ల ఎలాంటి అంతరాయం ఉండదని అమెరికా రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేసినట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి..
ఒప్పందం కుదరకపోతే ఇతర మార్గాలు.. ఇరాన్‌ను హెచ్చరించిన ట్రంప్..
బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..