హోర్ముజ్ జలసంధి ఇరాన్ చేతుల్లో లేదు.. అమెరికా తాజా వ్యాఖ్యలు!
ABN , Publish Date - Jul 12 , 2026 | 07:31 PM
హోర్ముజ్ జలసంధి చుట్టూ మళ్లీ మడత పేచీ మొదలైంది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు నిన్న ఇరాన్ ప్రకటించగా, ఆ ప్రకటనను అమెరికా సెంట్రల్ కమాండ్ ఇవాళ పూర్తిగా తోసిపుచ్చింది.
వాషింగ్టన్/టెహ్రాన్, జులై 12: అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గం 'హోర్ముజ్ జలసంధి' (Strait of Hormuz) చుట్టూ అమెరికా, ఇరాన్ దేశాల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం నడుస్తోంది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ నిన్న (శనివారం) ప్రకటించగా, ఆ ప్రకటనను అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇవాళ (ఆదివారం) పూర్తిగా తోసిపుచ్చింది. ఈ వ్యూహాత్మక జలసంధి ఇరాన్ నియంత్రణలో లేదని, అక్కడ నౌకల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయని అమెరికా స్పష్టం చేసింది.
వివాదం ఎలా మొదలైంది?
ఓ వాణిజ్య నౌక నిర్దేశిత రూట్‌ను కాకుండా 'అనధికారిక మార్గం'లో వెళ్తుండటంతో దానిపై హెచ్చరిక కాల్పులు జరిగాయని, ఆ తర్వాత (శనివారం) తాము ఈ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే అమెరికా దళాలు ఇరాన్‌పై సరికొత్త మిలిటరీ దాడులకు దిగాయి. దీనితో గత నెలలో ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా ప్రమాదంలో పడింది.
రంగంలోకి అమెరికా.. 'ట్రాఫిక్ నడుస్తోంది'!
ఇరాన్ ఆంక్షల ప్రకటన వెలువడిన వెంటనే అమెరికా CENTCOM సామాజిక మాధ్యమం 'X' ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చింది. 'హోర్ముజ్ జలసంధి అనేది అంతర్జాతీయ జలమార్గం. చట్టబద్ధంగా ప్రయాణించే అన్ని నౌకలకు ఇది తెరిచే ఉంటుంది. ఈ జలసంధి ఇరాన్ నియంత్రణలో లేదు. అక్కడ షిప్పింగ్ ట్రాఫిక్ యథావిధిగా సాగుతోంది'. అని యూఎస్ సెంట్రల్ కమాండ్ తేల్చి చెప్పింది. అంతేకాదు, ఇరాన్ చేస్తున్న బెదిరింపులను తరిమికొట్టడానికి, సముద్ర మార్గాల్లో స్వేచ్ఛా రవాణాను కాపాడటానికి అమెరికా దళాలు ఆ ప్రాంతంలో పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది.
ఈ అంతర్జాతీయ జల మార్గం ద్వారా రవాణా సురక్షితంగా సాగుతోందని చెప్పడానికి అమెరికా రక్షణ శాఖ కొన్ని గణాంకాలను విడుదల చేసింది. గత 7 రోజుల్లోనే 140 కి పైగా వాణిజ్య నౌకలు ఈ జలసంధిని దాటాయని, గడిచిన రెండు నెలల్లో అమెరికా దళాల భద్రత నడుమ 800 కి పైగా నౌకలు ఇక్కడి నుంచి ప్రయాణించాయని చెప్పింది. ఈ నౌకల ద్వారా దాదాపు 400 మిలియన్ బారెళ్లకు పైగా ముడి చమురు ప్రపంచ దేశాలకు రవాణా అయిందని అమెరికా గణాంకాలు విడుదల చేసింది.
అమెరికా కదలికలు 'అక్రమం': ఇరాన్
మరోవైపు, అమెరికా వ్యాఖ్యలపై ఇరాన్‌కు చెందిన 'పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ' తీవ్రంగా స్పందించింది. ఈ ప్రాంతంలో అమెరికా దళాల కదలికలు ముమ్మాటికీ 'అక్రమ కదలికలు' అని అభివర్ణించింది. అమెరికా సైనిక ఉనికి వల్లే ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణం సాధ్యం కావడం లేదని వాదించింది. ఈ ప్రాంతంలో మళ్లీ స్థిరత్వం, ప్రశాంతత ఏర్పడిన తర్వాతే నౌకల అభ్యర్థనలను పరిశీలించి, అనుమతులు జారీ చేస్తామని ఇరాన్ స్పష్టం చేసింది.
ప్రపంచ చమురు అవసరాలను తీర్చే అత్యంత కీలకమైన సముద్ర మార్గంపై పట్టు కోసం అమెరికా-ఇరాన్ ప్రయత్నిస్తుండటంతో గల్ఫ్ రీజియన్ తీవ్ర ఉత్కంఠగా మారింది. ఈ జలసంధి సురక్షితంగా ఉంటేనే భవిష్యత్తు చర్చలు ముందుకు సాగుతాయని అమెరికా అంటుంటే, అమెరికా జోక్యం ఆగే వరకు వెనక్కి తగ్గేదే లేదని ఇరాన్ హెచ్చరిస్తోంది.
Also Read:
వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడి గల్లంతు