Share News

ఇరాన్ ఉగ్రవాద స్థావరాలపై అమెరికా, సౌదీ సంయుక్త దాడులు

ABN , Publish Date - Jul 29 , 2026 | 08:18 AM

ఇరాక్‌లోని ఇరాన్ ప్రోక్సీ స్థావరాలపై అమెరికా-సౌదీ అరేబియా సంయుక్త వైమానిక దాడులు నిర్వహించాయి. సౌదీలోని అమెరికన్ సిబ్బందిపై, కీలక ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి చేయమని ఇరాన్ ఆదేశించిన నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి.

ఇరాన్ ఉగ్రవాద స్థావరాలపై అమెరికా, సౌదీ సంయుక్త దాడులు
US, Saudi Arabia Launch Joint Airstrikes in Iraq

వాషింగ్టన్, జూలై 29: పశ్చిమాసియాలో దాడులు, ప్రతిదాడులతో ఉద్రిక్తతలు అత్యంత తీవ్రస్థాయికి చేరుకున్నాయి. సౌదీ అరేబియా ఇంధన వనరులు, అమెరికా సైనిక దళాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రేరేపిత ఉగ్రవాద ముఠాలు జరిపిన డ్రోన్ దాడులకు ప్రతీకారంగా తాజా దాడులు జరిగాయి. అమెరికా, సౌదీ అరేబియా దళాలు ఇరాక్ లోని పలు ఉగ్రవాద స్థావరాలపై ఈ సంయుక్త వైమానిక దాడులు నిర్వహించాయి.

సౌదీ అరేబియాలోని అమెరికన్ సిబ్బందిపై, కీలక ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి చేయమని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఆదేశించిన 'ఇరాన్ అనుకూల ఉగ్రవాద' గ్రూపులను లక్ష్యంగా చేసుకుని అమెరికా-సౌదీ ఈ ప్రతిదాడులు చేశాయి. అమెరికా సెంట్రల్ కమాండ్, సౌదీ అరేబియా సాయుధ దళాలు తూర్పు ఇరాక్‌లో సంయుక్తంగా కచ్చితమైన దాడులు నిర్వహించాయి.


అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) తమ అధికారిక ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఆదేశాలతో నడుస్తున్న ఉగ్రవాద ముఠాలు గత 72 గంటల్లో 30కి పైగా డ్రోన్ దాడులకు పాల్పడ్డాయి. దీనికి సమాధానంగా, తూర్పు ఇరాక్ లోని ఇరాన్ మద్దతు గల ఉగ్రవాద ఆయుధ డిపోలు, లాజిస్టిక్ స్థావరాలపై అమెరికా, సౌదీ యుద్ధ విమానాలు కచ్చితత్వంతో కూడిన దాడులు చేసి వాటిని ధ్వంసం చేశాయి. 2026 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలోనే ఇరాక్ లోని యుఎస్ పౌరులు, సైనిక స్థావరాలపై ఇరాన్ ప్రోక్సీ ముఠాలు 600 కంటే ఎక్కువసార్లు దాడులకు యత్నించాయని సెంటకామ్ వెల్లడించింది. ఇరాన్, దాని మద్దతు గల దళాలు తక్షణమే ఈ దూకుడును ఆపకపోతే మరింత తీవ్రమైన సైనిక చర్యలు తప్పవని హెచ్చరించింది.


ఐక్యరాజ్యసమితి చార్టర్ ఆర్టికల్ 51 కింద సౌదీ ప్రతిదాడి

ఈ సంయుక్త చర్యను సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్-మాలికి ధృవీకరించారు. ఇరాక్ భూభాగం నుంచి సౌదీలోని ఈస్టర్న్ ప్రావిన్స్, రియాద్ రీజియన్ లలో ఉన్న చమురు శుద్ధి కర్మాగారాలపైకి దూసుకొచ్చిన పలు డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని తెలిపారు. ఐక్యరాజ్యసమితి (UN) చార్టర్ లోని ఆర్టికల్ 51 ఇచ్చిన ఆత్మరక్షణ హక్కును ఉపయోగించుకుని, తమ దేశ భద్రత కోసం అమెరికాతో కలిసి ఈ ప్రతిదాడులు జరిపినట్లు స్పష్టం చేశారు. తగిన సమయంలో, తగిన ప్రదేశంలో స్పందించే హక్కు తమకు ఉందన్నారు.


కాగా, ఇప్పటివరకు అమెరికా మాత్రమే నేరుగా దాడి చేసేది. కానీ, ఇప్పుడు సౌదీ అరేబియా కూడా ప్రత్యక్షంగా అమెరికాతో కలిసి ఇరాక్ లోని ఇరాన్ ప్రోక్సీ స్థావరాలపై వైమానిక దాడుల్లో పాల్గొనడం పశ్చిమాసియా ప్రాంతీయ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం. ఇరాన్ మద్దతుగల గ్రూపుల దాడులు ఇలాగే కొనసాగితే, ఇది పూర్తిస్థాయి ప్రాంతీయ యుద్ధానికి దారితీసే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

బొండా ఉమా వివరణతో సంతృప్తి చెందిన అధిష్ఠానం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 29 , 2026 | 10:47 AM