డొమినికన్ రిపబ్లిక్ విమానాశ్రయంలో కుప్పకూలిన జెట్.. ఇద్దరి మృతి
ABN , Publish Date - Jun 08 , 2026 | 10:17 AM
డొమినికన్ రిపబ్లిక్‌లోని లా రొమానా అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రైవేట్ జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్ సయమంలో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
ఇంటర్నెట్ డెస్క్: డొమినికన్ రిపబ్లిక్‌లోని లా రొమానా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రైవేట్ జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తూ ప్రమాదానికి గురైంది. గల్ఫ్‌స్ట్రీమ్ G200 రకానికి చెందిన ఈ జంట ఇంజిన్ల విమానం రన్‌వేపై ల్యాండ్ అయ్యే క్రమంలో విఫలమై.. ఒక్కసారిగా పేలిపోయింది. ఈ దుర్ఘటనలో విమాన పైలట్, కో-పైలట్ ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ప్రయాణికులెవరూ లేరని.. కేవలం పైలట్, కో-పైలట్ మాత్రమే ఉన్నారని డొమినికన్ సివిల్ ఏవియేషన్ ఇన్‌స్టిట్యూట్ ధృవీకరించింది.
ఈ విమానం డొమింగోకు తూర్పున సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రముఖ పర్యాటక నగరమైన లా రొమానా నుంచి టెక్సాస్‌లోని ఆస్టిన్ నగరానికి బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే.. లా రొమానాకు నైరుతి దిశలో 16 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా విమానంలో తీవ్రమైన సాంకేతిక లోపాలు తలెత్తినట్లు విమాన సిబ్బంది గుర్తించారు. పరిస్థితి విషమించడంతో పైలట్లు అత్యవసర ల్యాండింగ్ కోసం విమానాన్ని తిరిగి లా రొమానా విమానాశ్రయం వైపు మళ్లించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ప్రత్యక్ష సాక్షుల వీడియోల ప్రకారం.. విమానం అత్యవసరంగా ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక్కసారిగా నేలని తాకి పేలిపోయింది. ఈ ప్రమాదంపై స్థానిక విమానయాన అధికారులు ప్రాథమిక విచారణను ప్రారంభించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇరాన్‌తో ఒప్పందాన్ని అంగీకరించడం తప్ప నెతన్యాహుకు మరో మార్గం లేదు: ట్రంప్
గల్ఫ్ దేశాల పునర్నిర్మాణం కోసం.. ఇరాన్ ఆస్తులపై అమెరికా కన్ను వేసిందా..