మునిగిపోతున్న నౌక నుంచి 14 మంది భారతీయులను రక్షించిన యూఎస్ నేవీ!
ABN , Publish Date - Jun 14 , 2026 | 04:06 PM
ఒమన్ తీరంలో అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న ఓ భారత నౌక ప్రమాదానికి గురై మునిగిపోతుండగా, అమెరికా నౌకాదళం సకాలంలో స్పందించి 14 మంది భారతీయ సిబ్బందిని కాపాడింది.
మస్కట్, జూన్ 14: ఒమన్ తీరంలో అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న ఓ భారతీయ నౌక ప్రమాదానికి గురై మునిగిపోతుండగా, అమెరికా నౌకాదళం (US Navy) సకాలంలో స్పందించి 14 మంది భారతీయ సిబ్బందిని రక్షించింది. ఈ ఘటన ఆదివారం ఉదయం ఒమన్‌లోని రాస్ అల్ హద్ (Ras Al Hadd) తీరానికి సుమారు 80 నాటికల్ మైళ్ల దూరంలో చోటుచేసుకుంది.
భారతీయ జెండా కలిగిన 'విరాట్ 1' (Virat 1) అనే నౌక 14 మంది సిబ్బందితో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా నీట మునిగిపోవడం ప్రారంభించింది. నౌక ఎందుకు మునిగిందనే దానికి సంబంధించిన కచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. నౌక ప్రమాదంలో ఉందని తెలియగానే, భారతీయ సిబ్బంది అప్రమత్తమై సహాయం కోరారు. సమాచారం అందుకున్న వెంటనే యూఎస్ నేవీ రంగంలోకి దిగింది.
యూఎస్ నేవీకి చెందిన P-8 మెరిటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, ఆ నౌక సమీపంలో లైఫ్ రాఫ్ట్‌ను (రక్షణ పడవ) విడిచిపెట్టింది. ఆ ప్రాంతంలో ప్రయాణిస్తున్న 'MV జబల్ అలీ 9' అనే వాణిజ్య నౌకను కూడా అమెరికా నావికాదళం సహాయం కోసం అప్రమత్తం చేసింది. నౌక నీట మునిగిపోతుండటంతో, అందులోని 14 మంది సిబ్బంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని లైఫ్ రాఫ్ట్‌లోకి ఎక్కారు. అప్పటికే సన్నద్ధంగా ఉన్న రెస్క్యూ బృందాలు వారిని సురక్షితంగా కాపాడారు.

మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం (Embassy of India) ఈ ఘటనపై స్పందిస్తూ, 'విరాట్ 1 అనే భారతీయ నౌక ఒమన్ తీరంలో ప్రమాదానికి గురైనట్లు మాకు సమాచారం అందింది. అందులో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ఒమన్ అధికారులు, ఆ ప్రాంతంలోని ఇతర నౌకలతో సమన్వయం చేసుకుంటూ, సహాయక చర్యలను కొనసాగిస్తున్నాము' అని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ ఘటన జరిగిన ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత కీలకమైన 'హోర్ముజ్ జలసంధి' (Strait of Hormuz) కు సమీపంలో ఉంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల వాణిజ్య నౌకల రాకపోకలకు ఈ మార్గం సంక్లిష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా నౌకాదళం వెంటనే స్పందించడంతో 14 మంది భారతీయులు ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ వార్తలనూ చదవండి:
40 మీటర్ల ఎత్తునుంచి తోసేశారు.. యువతి ప్రాణం పోయింది..
జడ్జి సీటులో కూర్చున్న మహిళ! ఆర్డర్.. ఆర్డర్.. అంటూ