గ్రీన్ కార్డ్ నిబంధనల్లో సడలింపులు.. ఆ దరఖాస్తుదారులకు ఉపశమనం
ABN , Publish Date - May 23 , 2026 | 05:03 PM
అమెరికా కొత్తగా ప్రవేశపెట్టిన గ్రీన్ కార్డు నిబంధనల్లో మార్పులు చేసింది. తాజా సడలింపుల ప్రకారం.. ఆ దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చే దరఖాస్తుదారులకు ఉపశమనం కల్పిస్తున్నట్టు పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో నివసిస్తున్న తాత్కాలిక వలసదారులు శాశ్వత నివాసం పొందే హక్కు కోసం అగ్రరాజ్యం ప్రవేశపెట్టిన గ్రీన్ కార్డ్ నిబంధనల్ని సడలించింది. ఈ నిబంధనల్లో కొన్ని మినహాయింపులు ఇస్తున్నట్టు ప్రకటించింది. తాజా సడలింపులతో భారతీయులకు ఉపశమనం లభించింది.
అగ్రరాజ్యంలో తాత్కాలిక వీసాలపై నివసిస్తున్న భారతీయులు ఆందోళనను రేకెత్తించిన అనంతరం.. యునైటెడ్ స్టేట్స్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇటీవల ప్రకటించిన గ్రీన్ కార్డ్ నిబంధనలను పాక్షికంగా సడలించారు. సవరించిన విధానం ప్రకారం.. వర్క్, స్టూడెంట్, పర్యాటక వీసాలపై ఉన్న దరఖాస్తుదారులు తమ స్వదేశాలకు వెళ్లి, అమెరికా రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్ ద్వారా గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఈ నిబంధనలు అందరికీ వర్తించవని యూఎస్‌సీఐఎస్ ప్రతినిధి జాక్ కహ్లర్ వెల్లడించారు.
'అమెరికా జాతీయ, ఆర్థిక ప్రయోజనాలే ప్రధానమనుకున్న వలసదారులకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుంది. గ్రీన్ కార్డ్ ఆశావహులు సమర్పించిన దరఖాస్తుల ఆధారంగా.. మా దేశానికి ప్రయోజనముందని భావిస్తే వాటిని పరిగణనలోకి తీసుకుంటాం. అలాంటప్పుడు వారు ప్రస్తుత నిబంధనల ప్రకారం కొనసాగేందుకు అనుమతిస్తాం. మిగిలినవారిని వారి స్వదేశానికి వెళ్లి దరఖాస్తు చేసుకోమని సూచిస్తాం' అని కహ్లర్ తెలిపారు. అయితే.. ఆ దరఖాస్తులు తమ దేశానికి ఏరకంగా ప్రయోజనం చేకూరుస్తాయి, వాటిని ఎలా నిర్ణయిస్తారనే వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. కొత్త నిబంధనల్లోని లోపాలను ఉపయోగించుకుంటూ ఈ వ్యవస్థను దుర్వినియోగం చేసే అవకాశాలు తగ్గిపోతాయని ఆయన స్పష్టం చేశారు.
ఇవీ చదవండి:
విభేదాలు, భర్త అనారోగ్యం.. అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ నిష్క్రమణ వెనుక అసలేం జరిగింది?
పుల్వామా సూత్రధారి అంత్యక్రియల్లో పాల్గొన్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు..