Share News

విభేదాలు, భర్త అనారోగ్యం.. అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ నిష్క్రమణ వెనుక అసలేం జరిగింది?

ABN , Publish Date - May 23 , 2026 | 03:19 PM

యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఈ నిర్ణయం వెనుక గల వ్యక్తిగత కారణాలు, వైట్ హౌస్ వివరణ, రాజీనామాకి దారితీసిన రాజకీయ పరిస్థితులేంటో చూద్దాం..

విభేదాలు, భర్త అనారోగ్యం.. అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ నిష్క్రమణ వెనుక అసలేం జరిగింది?
Tulsi Gabbard Resigns as US Intel Chief, White House Denies Forced Exit Claims

ఆంధ్రజ్యోతి, మే 23: అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ (Director of National Intelligence) తులసి గబ్బార్డ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. జూన్ 30, 2026 నుంచి ఆమె రాజీనామా అమలులోకి రానుంది. ఈ నిర్ణయం వెనుక గల వ్యక్తిగత కారణాలు, వైట్ హౌస్ వివరణ, దీనికి దారితీసిన రాజకీయ పరిస్థితుల గురించి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చే జరుగుతోంది.

భర్త అనారోగ్య కారణాలతో వైదొలగుతున్న తులసి గబ్బార్డ్

తన 11 ఏళ్ల వైవాహిక జీవితంలో భర్త అబ్రహం విలియమ్స్ తనకు ఎల్లప్పుడూ అండగా నిలిచారని తులసి గబ్బార్డ్ పేర్కొన్నారు. ఇటీవల ఆయనకు అత్యంత అరుదైన బోన్ క్యాన్సర్ (ఎముకల క్యాన్సర్) ఉన్నట్లు నిర్ధారణ అయింది. రాబోయే రోజుల్లో ఆయనకు ఎదురయ్యే క్లిష్టమైన పరిస్థితుల్లో తోడుగా ఉంటూ, పూర్తి మద్దతు అందించేందుకే తాను ప్రజా జీవితం నుంచి తాత్కాలికంగా తప్పుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు పంపిన లేఖలో ఆమె స్పష్టం చేశారు.


ట్రంప్ ప్రభుత్వంతో విభేదాలు – ముఖ్యాంశాలు

గత ఏడాదిన్నరగా పదవిలో ఉన్న తులసి గబ్బార్డ్, ఇటీవల ఇరాన్ యుద్ధం విషయంలో ట్రంప్ యంత్రాంగంతో భేదాభిప్రాయాలు కలిగి ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. యుద్ధ నిర్ణయాల్లో ఆమె దూరం పాటించారని పలు అంతర్జాతీయ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల ముందస్తు కీలక సమావేశాల్లో ఆమె పాల్గొనలేదని సమాచారం.

దీంతోపాటు, ఇరాన్ నుంచి అమెరికాకు తక్షణ ముప్పు ఉందన్న ట్రంప్ ప్రకటనలను, ఇరాన్ అణు సామర్థ్యాన్ని పునర్నిర్మించుకుంటోందన్న వాదనలను ఆమె ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా విభేదించారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి.


'ఆమెను ఎవరూ బలవంత పెట్టలేదు' – స్పష్టం చేసిన వైట్ హౌస్

తులసి గబ్బార్డ్‌ను బలవంతంగా పదవి నుంచి తప్పించారనే ప్రచారాన్ని వైట్ హౌస్, ఆమె కార్యాలయం తీవ్రంగా ఖండించాయి. ఈ అంశంపై చీఫ్ ఆఫ్ స్టాఫ్ వివరణ ఇచ్చారు. చీఫ్ ఆఫ్ స్టాఫ్ అలెక్సా హెన్నింగ్ స్పందిస్తూ.. ఈ ప్రచారాలన్నీ అవాస్తవాలని, కేవలం భర్త అనారోగ్యం వల్లే తులసి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. వైట్ హౌస్ ప్రతినిధి డేవిస్ ఇంగిల్ మాట్లాడుతూ, భర్త ఆరోగ్యాన్ని సాకుగా చూపి ఆమెను బలవంతంగా తొలగించారనడం పూర్తిగా అపవాదంటూ కొట్టిపారేశారు.

తులసి రాజీనామాపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక ప్రకటన

తులసి గబ్బార్డ్ రాజీనామాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జె. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ట్రూత్ సోషల్' ద్వారా అధికారికంగా స్పందించారు. ఆమె సేవలను కొనియాడుతూ భావోద్వేగ భరితమైన పోస్ట్ చేశారు. 'తులసి గబ్బార్డ్ తన పదవీకాలంలో అత్యంత అద్భుతమైన బాధ్యతలు నిర్వర్తించారు. జూన్ 30న ఆమె ప్రభుత్వం నుంచి తప్పుకోనున్నారు. ఆమె సేవలను మేము కచ్చితంగా మిస్ అవుతాం' అని ట్రంప్ పేర్కొన్నారు.

భర్త ఆరోగ్యంపై ఆశాభావం: 'ఆమె భర్త అబ్రహం ఇటీవల అరుదైన ఎముకల క్యాన్సర్‌ బారిన పడ్డారని, ఈ క్లిష్ట సమయంలో ఆయనకు తోడుగా ఉంటూ మళ్లీ పూర్తి ఆరోగ్యవంతుడిని చేయాలని ఆమె భావించడం ముమ్మాటికీ సరైన నిర్ణయమని ట్రంప్ సమర్థించారు. వారిద్దరూ కలిసి ఎదుర్కొంటున్న ఈ కఠినమైన పోరాటంలో అబ్రహం త్వరలోనే కోలుకుని, మునుపటి కంటే మరింత ఆరోగ్యంగా తిరిగి వస్తారనే నమ్మకం తనకు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

తాత్కాలిక బాధ్యతలు: తులసి గబ్బార్డ్ స్థానంలో ప్రస్తుతం ప్రిన్సిపల్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న, ఎంతో గౌరవప్రదమైన అధికారి ఆరన్ లూకాస్ (Aaron Lukas) తాత్కాలిక డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (Acting DNI) గా బాధ్యతలు స్వీకరిస్తారని ట్రంప్ స్పష్టం చేశారు.


వివాదాలు:

మాజీ డెమొక్రాట్ అయిన తులసి గబ్బార్డ్, ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమితులైనప్పటి నుంచి అనేక వివాదాల్లో నిలిచారు. విదేశీ మిలిటరీ జోక్యాలను వ్యతిరేకించే ఆమె, 2017 లో సిరియా పాలకుడు బషర్ అల్-అసద్‌ను కలవడంపై విమర్శలు ఎదుర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యా అనుకూల ప్రచారాన్ని సమర్థించారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇరాక్ యుద్ధంలో పాల్గొన్న సైనిక నేపథ్యం ఉన్నందున, అమెరికా అనవసరంగా సుదీర్ఘ కాలం సాగించే యుద్ధాలకు ఆమె మొదటి నుంచీ వ్యతిరేకం.

ట్రంప్ కేబినెట్ నుంచి నాల్గవ మహిళా నేత నిష్క్రమణ

ఇటీవల కాలంలో ట్రంప్ కేబినెట్ నుంచి తప్పుకున్న నాలుగో ఉన్నతాధికారి తులసి గబ్బార్డ్. ఇంతకుముందు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ చీఫ్ క్రిస్టి నోయెమ్, అటార్నీ జనరల్ పామ్ బొండీ, లేబర్ సెక్రటరీ లోరి చావెజ్-డెరెమర్ వివిధ కారణాలతో తమ పదవుల నుంచి తప్పుకున్నారు.

Trump Post.jpg


ఇవీ చదవండి:

కూలిన హెలికాప్టర్.. మేజర్ జనరల్ సెల్ఫీ..

మరణానికి ముందు సెలూన్‌ను సందర్శించిన ట్విషా.. యజమాని సంచలన ఆరోపణలు

Updated Date - May 23 , 2026 | 04:29 PM