Share News

గ్రీన్‌కార్డు కోసం వేచి చూస్తున్నారా?..అమెరికాను వీడండి

ABN , Publish Date - May 23 , 2026 | 04:32 AM

అమెరికాలో తాత్కాలిక వీసాలపై ఉంటూ.. శాశ్వత నివాసానికి వీలు కల్పించే గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారికి సంబంధించి ట్రంప్‌ సర్కారు ఒక కొత్త నిబంధనను తీసుకొస్తోంది.

గ్రీన్‌కార్డు కోసం వేచి చూస్తున్నారా?..అమెరికాను వీడండి

  • ప్రక్రియ అంతా పూర్తయ్యేదాకా మీ దేశంలోనే ఉండిపోండి

  • బ్యాక్‌ గ్రౌండ్‌ చెకింగ్‌, ఇంటర్వ్యూలు అన్నీ అక్కడే పూర్తిచేసుకోండి

  • ఇమిగ్రెంట్‌ వీసాతోనే మళ్లీ రండి.. ట్రంప్‌ సర్కారు కొత్త నిబంధన

  • కొన్ని రకాల వీసాలపై ఉంటున్నవారికి మాత్రం మినహాయింపు

వాషింగ్టన్‌, మే 22: అమెరికాలో తాత్కాలిక వీసాలపై ఉంటూ.. శాశ్వత నివాసానికి వీలు కల్పించే గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారికి సంబంధించి ట్రంప్‌ సర్కారు ఒక కొత్త నిబంధనను తీసుకొస్తోంది. దాని ప్రకారం.. అలాంటివారంతా అమెరికాలోనే ఉండి గ్రీన్‌కార్డు పొందడానికి వీలుండదు. ఆ కార్డును పొందే సమయానికి (లేదా) తమ ప్రస్తుత వీసా కాలపరిమితి పూర్తవగానే తమ తమ సొంత దేశాలకు వెళ్లిపోయి, గ్రీన్‌కార్డు వచ్చేవరకూ అక్కడే వేచి ఉండాలి. తమ దేశంలోని అమెరికన్‌ ఎంబసీలు లేదా కాన్సులేట్ల ద్వారా బ్యాక్‌గ్రౌండ్‌ వెరిఫికేషన్‌, వైద్య పరీక్షలు, ఇంటర్వ్యూలు ఇలా అన్ని లాంఛనాలూ పూర్తి చేసుకుని.. ఆ తర్వాతే, శాశ్వత నివాసిగా అమెరికాలో అడుగుపెట్టాలి. ఈ మేరకు యూఎస్‌సీఐఎస్‌ (యూఎస్‌ సిటిజెన్‌షిప్ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌) కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ నేషనాలిటీ యాక్ట్‌లోని సెక్షన్‌ 245 (ఏ) ప్రకారం తాత్కాలిక నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ హోదా నుంచి శాశ్వత ఇమ్మిగ్రెంట్‌ హోదాకు మారే ప్రక్రియ యూఎస్‌ వెలుపల జరగాల్సిన ప్రక్రియగా పరిగణించాల్సిందిగా ఇమ్మిగ్రేషన్‌ అధికారులను ఆదేశించింది. అయితే.. శరణార్థులు, యు వీసా (అమెరాకాలో నేర బాధితులకు ఇచ్చేది), టి వీసా (అక్రమరవాణాకు గురై అమెరికాకు చేరుకున్నవారికిచ్చేది) ఉన్నవారికి, 245 (ఐ) కింద పాత అప్లికేషన్లు ఉన్నవారికి దీన్నుంచి మినహాయింపు ఉంది. డ్యూయెల్‌ ఇంటెంట్‌ వీసాలైన హెచ్‌-1బీ (ఐటీ/స్పెషలిస్ట్‌ ఉద్యోగులకు ఇచ్చేది), ఎల్‌-1 (కంపెనీలో అంతర్గత బదిలీల్లో భాగంగా అమెరికా వచ్చేవారికి ఇచ్చేది) వీసాలపై అమెరికాలో ఉన్నవారికి కూడా మినహాయింపు ఉందిగానీ.. అది అధికారుల విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది.


ప్రస్తుతం ఇలా.. మారిందేంటంటే..

ప్రస్తుత నిబంధనల ప్రకారం.. బీ1/బీ2, జే1, ఎఫ్‌1/ఎం1 వంటి తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉంటూ గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారు.. వాటి కాలపరిమితి పూర్తయినా, గ్రీన్‌కార్డు దరఖాస్తు పెండింగ్‌లో ఉందంటూ అక్కడే ఉండిపోయే వీలుంది. అమెరికా దాటి బయటకు వెళ్లకుండానే నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ హోదా నుంచి ఇమ్మిగ్రెంట్‌ హోదాకు మారిపోయేవారు. ఇలా అక్కడే ఉండి తమ వీసా స్థితిని మార్చుకోవడాన్ని ‘అడ్జ్‌స్టమెంట్‌ ఆఫ్‌ స్టేటస్‌’ అంటారు. కానీ, కొత్త నిబంధన ప్రకారం అలా అమెరికాలో ఉంటూ హోదా మార్చుకోవడం కుదరదు. తమ వద్ద ఉన్నవీసా కాలపరిమితి పూర్తవగానే అమెరికా గడ్డను వీడి వెళ్లి తీరాల్సిందే. అలా వెళ్లి, తమ దేశంలో ఉంటూ గ్రీన్‌కార్డుకు సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తి చేసుకుని తిరిగి రావొచ్చు. ఎప్పుడో గ్రీన్‌కార్డు కోసం అప్లై చేసుకుని.. ప్రస్తుతం తమవద్ద ఉన్న తాత్కాలిక వీసా కాలపరిమితి ముగియకముందే గ్రీన్‌కార్డుకు సంబంధించి ప్రయారిటీ డేట్‌ కరెంట్‌ అయినవారి పరిస్థితి ఏమిటి? అనే సందేహం అక్కడ ఉంటున్న చాలా మందిలో వస్తుంది. వారు కూడా అమెరికాను వీడి వెళ్లాల్సిందే. ప్రయారిటీ డేట్‌ అంటే ఒక వ్యక్తి గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న తేదీ. యూఎస్‌ విదేశాంగ శాఖ ప్రతి నెలా వీసా బులెటిన్‌ విడుదల చేస్తుంది. అందులో ఏ తేదీ వరకూ అప్లై చేసుకున్నవారికి ఆ నెల గ్రీన్‌కార్డులు ఇస్తున్నారో పేర్కొంటుంది. దాన్ని కటాఫ్‌ తేదీ అంటారు.


ఆ కటాఫ్‌ తేదీ లోపు ప్రయారిటీ డేట్‌ ఉంటే.. అది కరెంట్‌ అయినట్టు లెక్క. ఉదాహరణకు సుబ్బారావు అనే వ్యక్తి 2010 జూన్‌ 5వ తేదీన దరఖాస్తు చేసుకున్నాడు. అది అతడి ప్రయారిటీ డేట్‌. 2026 జూన్‌లో విడుదలైన వీసా బులెటిన్‌లో కటాఫ్‌ తేదీని 2011 జనవరి 1గా పేర్కొంటే.. సుబ్బారావు దరఖాస్తు చేసుకున్న తేదీ ఆలోపే ఉంది కాబట్టి అతడి ప్రయారిటీ డేట్‌ కరెంట్‌ అయినట్టన్నమాట. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారమైతే ఈ దశలో అతడు అమెరికా వీడి వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ, కొత్త నిబంధనల ప్రకారం అతడు ఇండియాకు వచ్చి, ఇక్కడ మిగతా ప్రక్రియనంతా ముగించుకుని అమెరికాకు తిరిగి శాశ్వత నివాసిగా వెళ్తాడన్నమాట. అయితే, ఈ నిబంధన అసంబద్ధంగా ఉందని ఇమ్మిగ్రేషన్‌ నిపుణులు విమర్శిస్తున్నారు. అమెరికాలో ఉంటూ ప్రతిష్ఠాత్మక పరిశోధనల్లో పాల్గొంటున్న పరిశోధకులు, ప్రతిభావంతులైన ఉద్యోగులు ఈ నిబంధన వల్ల తమ పని ఎక్కడిదక్కడ ఆపేసి తమతమ దేశాలకు వెళ్లిపోవాల్సి ఉంటుందని.. దీనివల్ల అమెరికాకే నష్టమని వారు వాపోతున్నారు.

Updated Date - May 23 , 2026 | 04:32 AM