Share News

రష్యా యుద్ధనౌకపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి.. సముద్రంలో మునిగిన ‘మెర్క్యురీ’..

ABN , Publish Date - Nov 23 , 2026 | 08:34 PM

రష్యాకు ఉక్రెయిన్ ఊహించని షాక్ ఇచ్చింది. ఏకంగా 2,700 కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యా యుద్ధనౌకను డ్రోన్లతో పేల్చేసింది. లిబియాలోని బెంఘాజీ నౌకాశ్రయంలో నిలిపి ఉంచిన రష్యా నౌకాదళానికి చెందిన ‘మెర్క్యురీ’పై ఏడు నౌకాదళ డ్రోన్లతో దాడి చేసింది.

రష్యా యుద్ధనౌకపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి.. సముద్రంలో మునిగిన ‘మెర్క్యురీ’..
Ukraine Drone Attack

కీవ్, నవంబర్ 23: రష్యాకు ఉక్రెయిన్ ఊహించని షాక్ ఇచ్చింది. ఏకంగా 2,700 కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యా యుద్ధనౌకను డ్రోన్లతో పేల్చేసింది. లిబియాలోని బెంఘాజీ నౌకాశ్రయంలో నిలిపి ఉంచిన రష్యా నౌకాదళానికి చెందిన ‘మెర్క్యురీ’పై ఏడు నౌకాదళ డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడిలో నౌక మునిగిపోయినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ప్రకటించారు. ఈ ఆపరేషన్‌తో రష్యా నౌకాదళానికి గట్టి దెబ్బ తగిలిందని ఉక్రెయిన్ పేర్కొంది. కాగా, నవంబర్ 22న ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.


తూర్పు లిబియాలోని బెంఘాజీ నౌకాశ్రయంలో ఇంధనం నింపుకునేందుకు, అవసరమైన సామగ్రిని తీసుకెళ్లేందుకు మెర్క్యురీ నౌకను నిలిపి ఉంచారు. అదే సమయంలో ఉక్రెయిన్ డ్రోన్లు దానిని లక్ష్యంగా చేసుకున్నాయి. భారీ పేలుళ్లు సంభవించడంతో నౌకాశ్రయంలో మంటలు చెలరేగాయి. అనంతరం విడుదలైన ఉపగ్రహ చిత్రాల్లో యుద్ధనౌక బోల్తాపడి పాక్షికంగా నీటిలో మునిగినట్లు కనిపించింది. ఈ దాడికి బాధ్యత వహిస్తూ జెలెన్‌స్కీ సోమవారం ప్రకటన చేశారు. ఉక్రెయిన్ భద్రతా సేవా విభాగం (SBU), రక్షణ దళాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఏడు నౌకాదళ డ్రోన్లను దాడికి ఉపయోగించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మెర్క్యురీ నౌకతో పాటు దానిలో ఉన్న కా-27 సైనిక హెలికాప్టర్ కూడా ధ్వంసమైనట్లు జెలెన్‌స్కీ వెల్లడించారు.


ఈ దాడిలో రష్యాకు చెందిన ఎంవీ అంగారా అనే సరకు రవాణా నౌకనూ లక్ష్యంగా చేసుకున్నట్లు జెలెన్‌స్కీ తెలిపారు. ఆయుధాల రవాణాకు ఈ నౌకను ఉపయోగిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. మరోవైపు, ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. స్వతంత్ర, పారదర్శక దర్యాప్తు జరపాలని కోరింది. లిబియా విదేశీ దేశాల యుద్ధాలకు వేదిక కాకూడదని హెచ్చరించింది. తూర్పు లిబియా అధికారులు కూడా రష్యాతో కలిసి దర్యాప్తు చేపట్టనున్నట్లు ప్రకటించారు. కాగా, ఈ ఘటనపై రష్యా ఇంకా అధికారికంగా స్పందించలేదు.


ఈ వార్తలు కూడా చదవండి

చైనా నుంచి బంగ్లాదేశ్‌కు మిసైల్ మెటీరియల్‌తో నౌక.. స్వాధీనం చేసుకున్న ఇండోనేషియా

మృత్యువు మీ కోసం ఎదురుచూస్తోంది.. జర్మనీలో 450కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు..

Updated Date - Nov 23 , 2026 | 08:47 PM