Share News

యూఏఈలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతుల్లో భారతీయులు..

ABN , Publish Date - Nov 24 , 2026 | 09:38 PM

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రక్కును ఢీకొనడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.

యూఏఈలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతుల్లో భారతీయులు..
UAE Bus Accident

అబుదాబి, నవంబర్ 24: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతిచెందగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో భారతీయులు ఉన్నట్లు దుబాయ్‌లోని భారత కాన్సులేట్ వెల్లడించడం తీవ్ర కలకలం రేపుతోంది.


ఈ ప్రమాదం రస్ అల్ ఖైమా ప్రాంతంలోని అల్ వతన్ రోడ్డుపై చోటుచేసుకుంది. 41 మందితో ప్రయాణిస్తున్న బస్సు సాంకేతిక సమస్య కారణంగా రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రక్కును బలంగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతకు పలువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అత్యవసర వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. తొలుత 11 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించగా.. చికిత్సపొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు. దీంతో మృతుల సంఖ్య 13కు చేరింది.


ఈ ఘటనలో భారతీయులు కూడా మృతిచెందినట్లు భారత కాన్సులేట్ ధ్రువీకరించింది. అయితే వారి సంఖ్య ఎంత అనేది ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. మరోవైపు, బాధిత కుటుంబాలను సంప్రదిస్తున్నామని, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సహాయాన్ని అందిస్తున్నామని కాన్సులేట్ తెలిపింది. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై యూఏఈ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి

మూడుసార్లు దెయ్యాన్ని చూశా.. పోప్ ఫ్రాన్సిస్ డైరీలో సంచలన విషయాలు..

మారిషస్‌‌లో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..

Updated Date - Nov 24 , 2026 | 09:44 PM