Share News

మూడుసార్లు దెయ్యాన్ని చూశా.. పోప్ ఫ్రాన్సిస్ డైరీలో సంచలన విషయాలు..

ABN , Publish Date - Nov 24 , 2026 | 08:51 PM

దివంగత పోప్ ఫ్రాన్సిస్ వ్యక్తిగత డైరీలోని విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. తన జీవితంలో మూడుసార్లు దెయ్యాన్ని చూశానని, ఓసారి నరక ద్వారాలను దర్శించినట్లు ఆయన రాయడం సంచలనంగా మారింది.

మూడుసార్లు దెయ్యాన్ని చూశా.. పోప్ ఫ్రాన్సిస్ డైరీలో సంచలన విషయాలు..
Pope Francis

వాటికన్, నవంబర్ 24: దివంగత పోప్ ఫ్రాన్సిస్ వ్యక్తిగత డైరీలోని విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ డైరీ ద్వారా ఆయన జీవితంలో ఎదుర్కొన్న ఆధ్యాత్మిక సంఘర్షణలు, భయాలు, పశ్చాత్తాపం, మానసిక వేదనకు సంబంధించిన ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. ముఖ్యంగా, తన జీవితంలో మూడుసార్లు దెయ్యాన్ని చూశానని, ఓసారి నరక ద్వారాలను దర్శించినట్లు ఆయన రాయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.


పోప్ ఫ్రాన్సిస్ 1992 నుంచి 2024 మధ్య తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలను డైరీలో నమోదు చేశారు. దీని ఆధారంగా ఇటీవల 'ది పర్సనల్ డైరీ ఆఫ్ పోప్ ఫ్రాన్సిస్' అనే పుస్తకాన్ని ప్రచురించారు. పోప్ ఫ్రాన్సిస్ మరణానంతరం ఆయన వారసుడు పోప్ లియో XIV అనుమతితో డైరీలోని కొన్ని భాగాలను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తన జీవితంలో మూడుసార్లు దెయ్యాన్ని చూసినట్లు పోప్ ఫ్రాన్సిస్ తన డైరీలో పేర్కొన్నారు. మొదటిసారి కారులో ప్రయాణిస్తుండగా దాని కళ్లను చూశానని, రెండోసారి బ్యూనస్ ఎయిర్స్‌లోని కార్మెలైట్ ప్రార్థనా మందిరంలో అగ్నిజ్వాలల్లాంటి కళ్లతో కనిపించిందని రాశారు. మూడోసారి చిలీ పర్యటన అనంతరం రోమ్‌లో జరిగిన ఓ సమావేశం సందర్భంగా దాని ఉనికిని గుర్తించినట్లు పేర్కొన్నారు.


ఈ అనుభవాలను గుర్తుచేసుకుంటూ 2021 జనవరి 24న రాసిన డైరీ నోట్‌లో దెయ్యం తనకు భౌతికంగా కనిపించినట్లు నమ్ముతున్నానని పోప్ ఫ్రాన్సిస్ వివరించారు. అలాగే, 2018 జూన్ 7న రాసిన డైరీలో మరో భయానక అనుభవాన్ని ప్రస్తావించారు. అంతకుముందు రాత్రి తాను నరక ద్వారాలను చూసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆ దృశ్యం తనను తీవ్రంగా భయపెట్టిందని, దీంతో వెంటనే జపమాలను చేతిలోకి తీసుకున్నట్లు రాశారు. ఈ అనుభవాన్ని తన జీవితంలో మర్చిపోలేని సంఘటనగా అభివర్ణించారు. కాగా, 2025 ఏప్రిల్ 21న 88 ఏళ్ల వయసులో పోప్ ఫ్రాన్సిస్ మరణించారు. తాజాగా ఆయన డైరీలోని ఈ విషయాలు సంచలనంగా మారాయి.


ఈ వార్తలు కూడా చదవండి

మారిషస్‌‌లో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..

సంజయ్ గాంధీని దొంగ అన్నాడని చెంపదెబ్బ కొట్టా: ప్రియాంక గాంధీ

Updated Date - Nov 24 , 2026 | 08:56 PM