ఒపెక్ నుంచి యూఏఈ వైదొలగడాన్ని స్వాగతించిన ట్రంప్.. ఇంధన ధరలను తగ్గించగలదని వ్యాఖ్య
ABN , Publish Date - Apr 30 , 2026 | 07:59 AM
ఒపెక్ కూటమి నుంచి వైదొలగాలన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. ఈ చర్య ప్రపంచ చమురు, గ్యాస్ ధరలను తగ్గించడంలో సహాయపడగలదని అన్నారు.
వాషింగ్టన్/దుబాయ్, ఏప్రిల్ 30: అంతర్జాతీయ చమురు విపణిలో పెను మార్పు చోటుచేసుకుంది. చమురు ఎగుమతి దేశాల శక్తిమంతమైన కూటమి ఒపెక్ (OPEC) నుంచి నిష్క్రమించాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) సంచలన నిర్ణయం తీసుకుంది. యూఏఈ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. ఈ పరిణామం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
నిర్ణయం వెనుక కారణాలు..
చమురు ఉత్పత్తిపై ఒపెక్ విధిస్తున్న ఆంక్షలు తమ దేశ ఆర్థిక ప్రయోజనాలకు ఆటంకంగా మారాయని యూఏఈ భావిస్తోంది. గత కొంతకాలంగా ఉత్పత్తి కోటాల విషయంలో సౌదీ అరేబియాతో యూఏఈకి విభేదాలు నడుస్తున్నాయి. తమ సొంత సామర్థ్యానికి అనుగుణంగా చమురును ఉత్పత్తి చేసి.. ఆదాయాన్ని పెంచుకోవాలనే లక్ష్యంతోనే యూఏఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ట్రంప్ ఏమన్నారంటే?
యూఏఈ నిర్ణయంపై ట్రంప్ స్పందిస్తూ.. 'ఇది అద్భుతమైన పరిణామం. ఒపెక్ వంటి ఏకపక్ష కూటముల నియంత్రణ పోతేనే మార్కెట్‌లో ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. యూఏఈ స్వేచ్ఛగా చమురును మార్కెట్లోకి విడుదల చేస్తే, గ్యాసోలిన్ ధరలు తగ్గుతాయి. ఇది అమెరికాతో పాటు ప్రపంచ దేశాల వినియోగదారులందరికీ ఊరటనిచ్చే విషయం' అని ట్వీట్ చేశారు.
ఇక, ఒపెక్ నిబంధనలు లేకపోవడంతో యూఏఈ తన ఉత్పత్తిని రోజుకు లక్షల బ్యారెళ్ల మేర పెంచే అవకాశం ఉంది. మార్కెట్లోకి చమురు సరఫరా పెరిగితే, డిమాండ్ కంటే సరఫరా ఎక్కువగా ఉండి ధరలు తగ్గుముఖం పడతాయి. ఖతార్ తర్వాత ఇప్పుడు యూఏఈ కూడా తప్పుకోవడంతో ఒపెక్ పట్టు సడలే అవకాశం కనిపిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..