Share News

అమెరికా యుద్ధానికి సిద్ధమవుతోందా?.. ట్రంప్ వీడియో వైరల్..

ABN , Publish Date - Nov 16 , 2026 | 12:47 PM

అమెరికా మరోసారి యుద్ధానికి సిద్ధమవుతోందా? ఇరాన్‌పై తదుపరి సైనిక చర్యకు రంగం సిద్ధం చేస్తోందా? అనే అంశం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇందుకు కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో.

అమెరికా యుద్ధానికి సిద్ధమవుతోందా?.. ట్రంప్ వీడియో వైరల్..
US President Donald Trump

ఇంటర్నెట్ డెస్క్, నవంబర్ 16: అమెరికా మరోసారి యుద్ధానికి సిద్ధమవుతోందా? ఇరాన్‌పై తదుపరి సైనిక చర్యకు రంగం సిద్ధం చేస్తోందా? అనే అంశం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇందుకు కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో. అమెరికా సైనికులు భారీ సైనిక రవాణా విమానాలైన C-17 గ్లోబ్‌మాస్టర్‌ల సమీపంలో మోకాళ్లపై కూర్చుని ప్రార్థనలు చేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపించాయి. దీంతో అమెరికా సైనిక కదలికలపై మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి.


ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. అయితే, ఈ వీడియో ఎప్పుడు చిత్రీకరించారనే విషయంపై స్పష్టత లేదు. అలాగే, దీన్ని ఏదైనా ప్రత్యేక సైనిక ఆపరేషన్‌కు సంబంధించి విడుదల చేశారా? అన్న దానిపైనా అధికారిక సమాచారం లేదు. దీంతో ఊహాగానాలు మొదలయ్యాయి. ఇరాన్‌పై దాడి చేసేందుకే సైనికులను సిద్ధం చేస్తున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. కాగా, అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించడంతో ఈ ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. తాజాగా అమెరికా తన సైనిక శక్తిని మరింత పెంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు యూఎస్ఎస్ థియోడర్ రూజ్‌వెల్ట్ విమాన వాహక నౌక.. నవంబర్ 15న అమెరికా సెంట్రల్ కమాండ్ పరిధిలోకి చేరింది. దీంతో ఆ ప్రాంతంలో యూఎస్ విమాన వాహక నౌకల సంఖ్య మూడుకు చేరుకుంది.


మరోవైపు, అమెరికా దాడులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. అమెరికా ముందుగా దాడి చేసే వరకు టెహ్రాన్ వేచి ఉండదని ఆ దేశ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ గరీబాబాది హెచ్చరించారు. దీంతో ఇరుదేశాల వైఖరి మరోసారి ఉద్రిక్తతలకు దారితీస్తుందనే ఆందోళనలు అంతర్జాతీయంగా వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల మధ్య ట్రంప్ షేర్ చేసిన వీడియో ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ వీడియో ఆధారంగా అమెరికా మరో దాడికి సిద్ధమైందని నిర్ధారించలేం. అధికారిక ప్రకటన వెలువడే వరకు వీటిని ఊహాగానాలుగానే పరిగణించాల్సి ఉంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి

పాకిస్థాన్‌, టర్కీ మధ్య భారీ డ్రోన్ డీల్.. లక్ష మెర్కుట్ ఎఫ్‌పీవీ డ్రోన్ల కొనుగోలుకు ఒప్పందం

మరో వివాదంలో జెన్సన్ హువాంగ్‌.. అంతర్గత విచారణ చేపట్టిన ఎన్విడియా..!

Updated Date - Nov 16 , 2026 | 01:20 PM