Share News

క్యాటరింగ్‌ ట్రక్కులో ట్రంప్‌!

ABN , Publish Date - Aug 13 , 2026 | 05:47 AM

ఇరాన్‌ దాడి చేస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో తన అధికారిక విమానం ‘ఎయిర్‌ఫోర్స్‌ వన్‌’లో కాకుండా.. మరో విమానంలో రహస్యంగా ప్రయాణించిన విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అంగీకరించారు...

క్యాటరింగ్‌ ట్రక్కులో ట్రంప్‌!

ఇరాన్‌ దాడి చేయనుందన్న హెచ్చరికలతో ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో కాకుండా వేరే విమానంలో ప్రయాణం

  • నిజమేనని అంగీకరించిన ప్రెసిడెంట్‌

  • గత నెల అంకారా నుంచి తిరుగు ప్రయాణంలో జరిగిన ఘటన

వాషింగ్టన్‌, ఆగస్టు 12: ఇరాన్‌ దాడి చేస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో తన అధికారిక విమానం ‘ఎయిర్‌ఫోర్స్‌ వన్‌’లో కాకుండా.. మరో విమానంలో రహస్యంగా ప్రయాణించిన విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అంగీకరించారు. ‘సీక్రెట్‌ సర్వీసు, మిలిటరీ సూచనల మేరకు నేను నడుచుకుంటా. వేరే విమానంలో వెళ్లాలని వాళ్లు చెప్పినప్పుడు నేను పాటించాల్సిందే. అందుకే మరో విమానంలో ప్రయాణించా’నని వెల్లడించారు. గత నెల తుర్కియే రాజధాని అంకారాలో జరిగిన నాటో సదస్సు నుంచి ట్రంప్‌ తిరిగి అమెరికాకు వెళ్తున్న సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. దీని గురించి ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ పత్రిక వెల్లడించటంతో ప్రపంచానికి తెలిసింది. ఇది నిజమేనని ట్రంప్‌ తాజాగా ధ్రువీకరించారు. అయితే, ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో ఉన్న ప్రెసిడెంట్‌ సిబ్బందికి, జర్నలిస్టులకు ట్రంప్‌.. వేరే విమానంలో వస్తున్న విషయం తెలియదు. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లోకి అందరి ముందే ట్రంప్‌ రావటంతో, తమతోపాటే ఆయన కూడా ప్రయాణిస్తున్నారనే వారు భావించారు. అయితే, ఈ ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానం అంకారా నుంచి బ్రిటన్‌లోని ఆర్‌ఏఎఫ్‌ మిల్డెన్‌హాల్‌ వైమానిక స్థావరానికి చేరుకున్న తర్వాత ట్రంప్‌.. మళ్లీ రహస్యంగా దాంట్లోకి ప్రవేశించారు. దాంట్లోంచి అందరితోపాటు దిగారు. దీనిపై తాజాగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్‌ దాడి చేస్తుందన్న హెచ్చరికలతో ట్రంప్‌ విమానం మారి తన ప్రాణాలు రక్షించుకున్నారుగానీ.. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో ప్రయాణించిన ఇతరుల పరిస్థితి ఏమిటి అంటూ అమెరికా జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. కాగా, అంకారా నుంచి తిరుగు ప్రయాణంలో ట్రంప్‌ ప్రయాణించే విమానాన్ని ఇరాన్‌ క్షిపణితో పేల్చే ప్రమాదం ఉందన్న సమాచారం నేపథ్యంలోనే ప్రెసిడెంట్‌ భద్రతా సిబ్బంది చివరి నిమిషంలో ట్రంప్‌ను మరో విమానంలోకి తరలించారని అమెరికా అధికారులు తెలిపారు. అంకారాలో నాటో సదస్సు జరిగిన ప్రాంగణం వద్ద ఓ వ్యక్తి భుజం మీది నుంచి పేల్చే క్షిపణితో కనిపించాడని అమెరికా నిఘా వర్గాలను ఉటంకిస్తూ ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ ఓ వార్తను ప్రచురించింది. నాటో సదస్సులో పాల్గొనేందుకు ట్రంప్‌ గత నెల 7వ తేదీన అంకారాకు వచ్చారు. మరుసటి రోజు తిరిగి అమెరికాకు వెళ్తున్నప్పుడు అంకారా ఎయిర్‌పోర్టులో మీడియా సమక్షంలో ‘ఎయిర్‌ఫోర్స్‌ వన్‌’లోకి ట్రంప్‌ వెళ్లారు. కొంతసేపటికే, విమానం పక్కన నిలిపి ఉంచిన ఓ క్యాటరింగ్‌ ట్రక్కులోకి ట్రంప్‌ మారారని, అదే ఎయిర్‌పోర్టులో మరోవైపున ఉన్న సైనిక విమానం సీ-32ఏ వద్దకు ఆ ట్రక్కులో వెళ్లి ఆ విమానం ఎక్కారని వాషింగ్టన్‌ పోస్ట్‌ వెల్లడించింది.


హోర్ముజ్‌పై హోరాహోరీ!

హోర్ముజ్‌ జలసంధి అంశంలో అమెరికా, ఇరాన్‌ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇరుదేశాలూ జలసంధి పూర్తిగా తమ ఆధీనంలోనే ఉందని ప్రకటనలు చేస్తున్నాయి. ‘‘హోర్ముజ్‌ నియంత్రణ పూర్తిగా అమెరికా చేతిలోనే ఉంది. ఇరాన్‌ ఈసారి చర్చల నుంచి వెనక్కి తగ్గినా, ఏవైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని ట్రంప్‌ హెచ్చరించారు. అయితే.. ట్రంప్‌ వ్యాఖ్యలను ఇరాన్‌ ఖండించింది. తమ షరతులను అమెరికా అంగీకరించే వరకు జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. మరోవైపు, హోర్ముజ్‌లో తమ దిగ్బంధనాన్ని ఉల్లంఘించి ఇరాన్‌ పోర్టు వైపు ప్రయాణిస్తోందంటూ.. పనామా జెండాతో వెళుతున్న ‘వేలా నోవా’ వాణిజ్య నౌకపై అమెరికా దాడి చేసింది. ఇంకోవైపున, ఎర్ర సముద్రంలో సౌదీ నుంచి కార్గోతో బయల్దేరిన నౌకపై హుతీలు బుధవారం దాడి చేశారు. తాజా ఉద్రిక్తతలతో హోర్ముజ్‌లో నౌకల రవాణా మళ్లీ దారుణంగా పడిపోయింది. బుధవారం కేవలం 8 నౌకలు మాత్రమే జలసంధి మీదుగా ప్రయాణించాయి. ఫలితంగా చమురు ధర పెరుగుతోంది.

ఇవి కూడా చదవండి...

రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్

చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 13 , 2026 | 05:47 AM