ఒక చేత్తో అనుమతులు.. మరో చేత్తో షేర్లు!
ABN , Publish Date - Nov 18 , 2026 | 05:06 AM
ఒక జిల్లా కలెక్టర్ ఇసుక రీచ్‌లకు అనుమతులు ఇస్తున్నాడనుకోండి. అదే సమయంలో ఆయన ఖాతాలో ఒక ఇసుక కాంట్రాక్టర్ కంపెనీ షేర్లు ఉన్నాయి.
ఎన్విడియాలో ట్రంప్ ఇన్‌సైడర్ ట్రేడింగ్?
వాషింగ్టన్, నవంబరు 17: ఒక జిల్లా కలెక్టర్ ఇసుక రీచ్‌లకు అనుమతులు ఇస్తున్నాడనుకోండి. అదే సమయంలో ఆయన ఖాతాలో ఒక ఇసుక కాంట్రాక్టర్ కంపెనీ షేర్లు ఉన్నాయి. అనుమతి వచ్చిన ప్రతిసారీ ఆ షేర్ల విలువ పెరుగుతోంది. ‘నా షేర్ల సంగతి నాకు తెలియదు, వేరేవాళ్లు చూసుకుంటారు’ అని ఆయన అంటే ఎవరైనా నమ్ముతారా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు సరిగ్గా ఇలాంటి ప్రశ్నలనే ఎదుర్కొంటున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ కంపెనీ ఎన్విడియా. చైనాకు ఆ కంపెనీ చిప్‌లు అమ్మాలా వద్దా అనేది ట్రంప్ ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అదే ఎన్విడియా షేర్లలో ట్రంప్ సంస్థలు గత ఏడాదిన్నరలో వందసార్లకు పైగా లావాదేవీలు జరిపాయి. ఏడాదిన్నర క్రితం ట్రంప్ దగ్గర ఎన్విడియా షేర్లు నామమాత్రమే. ఇప్పుడు ఆయనకున్న మూడు అతిపెద్ద షేర్ల పెట్టుబడుల్లో ఎన్విడియా ఒకటి. అమెరికా వార్తా సంస్థ సీఎన్‌బీసీ ఆయన ఆర్థిక వివరాల పత్రాలను పరిశీలించి ఈ విషయాన్ని బయటపెట్టింది. ఎన్విడియా అధినేత జెన్సెన్ తొలిసారి వైట్‌హౌస్‌లో అడుగుపెట్టడానికి రెండు రోజూల ముందే ట్రంప్ సంస్థలు ఎన్విడియా షేర్లు కొన్నాయి. చైనాలో ఎన్విడియా అమ్మకాల ఆదాయంలో వాటా అమెరికా ప్రభుత్వానికి చెల్లించేలా ఓ ఒప్పందాన్ని ట్రంప్ ధ్రువీకరించిన వారానికి ఆయన ఖాతాలు తిరిగి భారీగా షేర్లు కొన్నాయి.
మరింత శక్తిమంతమైన చిప్‌లను చైనాకు అమ్ముకోవచ్చని ట్రంప్ ప్రకటించడానికి 4రోజుల ముందు, ప్రకటన వచ్చిన మరుసటి రోజు కూడా లావాదేవీలు జరిగాయి. అధ్యక్ష పదవిలోకి వచ్చిన వ్యక్తి తన నిర్ణయాలతో సొంత ఆస్తి పెరగకుండా చూసుకోవాలి. అందుకే గత నాలుగు దశాబ్దాల్లో అధ్యక్షులంతా తమ షేర్లు అమ్మేశారు, లేదా ‘బ్లైండ్ ట్రస్ట్’కు అప్పగించారు. ఆ ట్రస్ట్‌లో ఏ షేర్లు కొంటున్నారో, ఏవి అమ్ముతున్నారో అధ్యక్షుడికే తెలియదు. ట్రంప్ ఆ పని చేయలేదు. ఆయన ఆస్తులు ఉన్న ట్రస్ట్‌ను ఆయన పిల్లలే చూస్తున్నారు. అయితే, ట్రంప్ పెట్టుబడులను స్వతంత్ర సంస్థలే నిర్వహిస్తాయని, ఏ ట్రేడ్ గురించీ ఆయనకు ముందుగా తెలియదని వైట్‌హౌస్, ట్రంప్ కుటుంబ సంస్థ చెబుతున్నాయి. ఇదిలా ఉండగా, చైనా గూఢచారిగా అనుమానిస్తున్న మహిళతో హువాంగ్‌కు సంబంధం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు గతేడాదే ట్రంప్‌కు చెప్పారని న్యూయార్క్ టైమ్స్ రాసింది. అయినా ట్రంప్ ఎన్విడియాకు చైనా తలుపులు మరింత తెరవడం విశేషం.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీలో కుప్పకూలిన 50 ఏళ్ల నాటి భవనం.. చిన్నారితో సహా ఇద్దరి మృతి
గ్రామాల విలీనంపై సుప్రీం విచారణ వాయిదా