Share News

యుద్ధం వేళ..ట్రంప్‌ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌!

ABN , Publish Date - May 21 , 2026 | 06:21 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఆయన కుటుంబం అక్కడి స్టాక్‌ మార్కెట్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. వారు ఇరాన్‌పై యుద్ధానికి ముందే.. రక్షణ రంగ సంస్థల షేర్లను...

యుద్ధం వేళ..ట్రంప్‌ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌!

  • రక్షణ, చమురు కంపెనీల్లో పెట్టుబడులు

  • అమెరికా ప్రభుత్వం నుంచి ఆ కంపెనీలకు ఆయుధ కాంట్రాక్టులు

  • షేర్ల ధరలు బాగా పెరిగి లాభాలు

వాషింగ్టన్‌, మే 20: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఆయన కుటుంబం అక్కడి స్టాక్‌ మార్కెట్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. వారు ఇరాన్‌పై యుద్ధానికి ముందే.. రక్షణ రంగ సంస్థల షేర్లను పెద్ద సంఖ్యలో కొనుగోలు చేసి, భారీ లాభాలు ఆర్జించినట్టుగా ఆర్థిక సంస్థలను ఉటంకిస్తూ అమెరికా వార్తాసంస్థలు తాజాగా కథనాలు ప్రచురించాయి. యుద్ధం కారణంగా రక్షణ రంగ సంస్థలకు ప్రభుత్వం నుంచి ఆయుధాల ఆర్డర్లు వస్తాయని, షేర్ల ధరలు పెరుగుతాయని ముందే తెలియడంతో ఆ సంస్థల షేర్లు కొన్నారని ఆరోపించాయి. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య ట్రంప్‌, ఆయన తరఫున అమెరికా స్టాక్‌మార్కెట్లలో ఏకంగా 3,700 సార్లు షేర్ల కొనుగోలు, విక్రయాలు జరిగినట్టు బ్లూమ్‌బర్గ్‌, వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనాలు ప్రచురించాయి. సగటున రోజుకు 40 లావాదేవీలు చేశారని పేర్కొన్నాయి. ఎన్‌వీడియా, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, బోయింగ్‌ తదితర సంస్థల షేర్లు ఇందులో ఉన్నాయని తెలిపాయి. అయితే ఆ షేర్ల విలువ, పొందిన లాభాల విలువ ఏమిటన్నది వెల్లడి చేయలేదు. ఇందులో బోయింగ్‌ సంస్థకు అమెరికా ప్రభుత్వం నుంచి రక్షణ, ఏరోస్పేస్‌ రంగ కాంట్రాక్టులు రాగా.. చైనాకు పలురకాల అడ్వాన్స్‌డ్‌ చిప్‌ల ఎగుమతి చేయడం కోసం ఇటీవలే ఎన్‌వీడియా సంస్థకు అమెరికా ప్రభుత్వం అనుమతి ఇవ్వడం గమనార్హం. మరోవైపు ఇరాన్‌తో కాల్పుల విరమణ, చర్చల సమయంలోనూ చమురు కంపెనీల షేర్లలో ట్రంప్‌ వ్యక్తిగత ఆర్థిక సలహాదారులు ట్రేడింగ్‌ చేశారని.. ట్రంప్‌ ప్రకటనలు చేసిన ప్రతిసారీ చమురు ధరలు, అమెరికా స్టాక్‌ మార్కెట్లోలో హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున నిర్ణయాలు తీసుకునే అధ్యక్షుడు ఇలా షేర్లు కొనడం ఏమిటన్న విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ప్రచారాన్ని శ్వేతసౌధం అధికారులు, ట్రంప్‌ కుటుంబ ప్రతినిధులు ఖండించారు. ట్రంప్‌ ఆర్థిక వ్యవహారాలు, వ్యక్తిగత పెట్టుబడులన్నీ పలు ఆర్థిక సంస్థలకు అప్పగించారని.. ఆ సంస్థలు చేసే ట్రేడింగ్‌లో ట్రంప్‌గానీ, ఆయన కుటుంబ సభ్యులుగానీ నేరుగా జోక్యం చేసుకోరని పేర్కొన్నారు.


ట్రంప్‌ యుద్ధ అధికారాలకు సెనేట్‌ కత్తెర!

ఇరాన్‌పై యుద్ధాన్ని వెంటనే నిలిపేయడం, అధ్యక్షుడు ట్రంప్‌ యుద్ధ అధికారాలకు కత్తెర వేయడం లక్ష్యంగా అమెరికాలోని ప్రతిపక్ష రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆ దేశ చట్టసభల్లో ఒకటైన సెనేట్‌ మంగళవారం ఆమోదించింది. ఇంతకుముందు ఏడుసార్లు సెనేట్‌లో ఈ తీర్మానం వీగిపోగా, ఎనిమిదోసారి ఆమోదం పొందింది. సెనేట్‌లోని మొత్తం 100 సీట్లకుగాను ట్రంప్‌ పార్టీ రిపబ్లికన్లకు 53, ప్రతిపక్ష డెమోక్రాట్లకు 45, స్వతంత్రులకు రెండు సీట్లు ఉన్నాయి. మంగళవారం జరిగిన ఓటింగ్‌లో 45 మంది డెమోక్రాట్లు, ఇద్దరు స్వతంత్రులతోపాటు, ముగ్గురు రిపబ్లికన్‌ ప్రతినిధులు కలిపి మొత్తంగా 50 మంది తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. మరోవైపు ముగ్గురు రిపబ్లికన్‌ ప్రతినిధులు సభకు రాకపోవడంతో.. తీర్మానానికి వ్యతిరేకంగా 47 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక ప్రతినిధుల సభ (హౌజ్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌)లోనూ తీర్మానం ఆమోదం పొందాలి. అందులో రిపబ్లికన్లకు 217 సీట్లు, డెమోక్రాట్లకు 212 సీట్లు ఉన్నాయి. అక్కడా క్రాస్‌ ఓటింగ్‌ జరిగి తీర్మానం ఆమోదం పొందినా.. అధ్యక్షుడు ట్రంప్‌కు దాన్ని నిలిపివేసే ‘వీటో’ అధికారం ఉంది. తన అధికారాలకు కత్తెర వేసే తీర్మానాన్ని ఆయన ఆమోదించే అవకాశం లేదు. అయితే సెనేట్‌, ప్రతినిధుల సభ రెండింటిలో కలిపి మూడింట రెండొంతుల మంది తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తే.. ట్రంప్‌ ‘వీటో’ అధికారాన్ని తప్పించుకుని, చట్టం అవుతుంది. అప్పుడు అమెరికా చట్టసభల నుంచి ముందుగా అనుమతి తీసుకోకుండా అధ్యక్షుడు యుద్ధం చేపట్టడానికి వీలుండదు. కానీ ఈస్థాయిలో తీర్మానం ఆమోదం పొందుతుందా, లేదా అన్నది సందేహమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


వచ్చే నెలలో ఫ్రాన్స్‌లో మోదీ-ట్రంప్‌ భేటీ!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ప్రధాని మోదీ వచ్చే నెలలో ఫ్రాన్స్‌లో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఫ్రాన్స్‌లో జూన్‌ 15 నుంచి 17 వరకు జీ7 దేశాల భేటీ జరగనుంది. జీ7లో భారత్‌ సభ్యదేశం కాకపోయినా నిర్వహించే దేశాల ఆహ్వానం మేరకు హాజరవుతూ ఉంటుంది. తాజాగా జీ7 భేటీకి రావాలంటూ మోదీని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ ఆహ్వానించారు. దీనితో అక్కడ ట్రంప్‌, మోదీ భేటీ కావొచ్చని.. వాణిజ్య ఒప్పందం, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

సెప్టెంబర్‌లో భారత్‌కు

ట్రంప్‌, జిన్‌పింగ్‌!

ఈ ఏడాది సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్‌ సమావేశాల్లో అమెరికా, చైనా అధ్యక్షులు ట్రంప్‌, జిన్‌పింగ్‌ హాజరయ్యే అవకాశం ఉంది. రష్యా అధ్యక్ష కార్యాలయం ప్రతిని యూరీ ఉషకోవ్‌ ఈ వివరాలను వెల్లడించారు. దీనికి ఇప్పటికే అమెరికా, చైనాల నుంచి సానుకూలత వచ్చిందని తెలిపారు. బ్రిక్స్‌ సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కూడా హాజరుకానుండటం గమనార్హం.

ఈ వార్తలు కూడా చదవండి...

జాలర్ల కుటుంబంతో ఆత్మీయంగా గడిపిన సీఎం చంద్రబాబు

కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ధ్వజం

స్విచ్‌లు నొక్కితే సీఎం కాలేరు.. జగన్‌పై షర్మిల సెటైర్లు

Updated Date - May 21 , 2026 | 06:21 AM