ఇరాన్‌కు గడువు పొడిగిస్తూ ట్రంప్ తాజా నిర్ణయం
ABN , Publish Date - Apr 06 , 2026 | 07:15 AM
పశ్చిమాసియాలో యుద్ధ భయం పతాక స్థాయికి చేరుకున్న తరుణంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు ఇచ్చిన గడువును పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రజ్యోతి, ఏప్రిల్ 6: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన గడువును (Deadline) పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం రాత్రి 8 గంటల (Eastern Time) వరకు ఇరాన్‌కు సమయం ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
గతంలో సోమవారం నాటికి ఒప్పందం కుదుర్చుకోవాలని హెచ్చరించిన ట్రంప్, ఇప్పుడు ఆ గడువును మరో రోజు పొడిగించారు. ఇరాన్ నుంచి ఆశించిన స్పందన వస్తుందనే ఆశతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు ఇరాన్ 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' (Strait of Hormuz)ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. ఈ కీలక సముద్ర మార్గాన్ని స్వేచ్ఛగా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. గడువు పొడిగించడం అంటే చర్చల ద్వారా సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఇంకా సజీవంగా ఉందని ట్రంప్ తన ప్రకటన ద్వారా తెలియజెప్పారు.
ట్రంప్ ఇచ్చిన ఈ అదనపు సమయాన్ని ఇరాన్ సద్వినియోగం చేసుకుంటుందా? లేదా పశ్చిమాసియాలో మరో సుదీర్ఘ పోరాటానికి నాంది పలకనుందా? అనేది మంగళవారం రాత్రి తేలిపోనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఇప్పుడు వాషింగ్టన్ - టెహ్రాన్ వైపు ఆశగా, ఆందోళనగా చూస్తోంది.
ఇవి కూడా చదవండి..
టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై
ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు