సుప్రీం లీడర్ ఇక లేరు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 28 , 2026 | 10:41 AM
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతొల్లా మొజ్తబా ఖమేనీ మరణించి ఉండొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ఆంధ్రజ్యోతి, మార్చి 28: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ మరణించి ఉండొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైనిక దాడులు ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని తుడిచిపెట్టాయని, దీంతో ఆ దేశంలో నాయకత్వం లేకుండా పోయిందని ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికాలోని మయామిలో జరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనిషియేటివ్ ప్రయారిటీ సమ్మిట్‌లో ప్రసంగిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికా కార్యకలాపాల వల్ల ఇరాన్ బలహీనపడిందని ట్రంప్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇరాన్ సైనిక సామర్థ్యాలను నిర్మూలించడంలో అమెరికా దళాలు అంచనాలకు మించి పనిచేశాయని ఆయన అన్నారు. 'ఇరాన్ నౌకాదళం అంతమైపోయింది. అదంతా అఖాతపు అడుగున మునిగిపోయింది.. వారి వైమానిక దళం పూర్తిగా, సమూలంగా నాశనమైంది. వారి విమాన నిరోధక, సమాచార ప్రసార సామర్థ్యాలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. అంతేకాదు, ఇరాన్ నాయకత్వం, సైనిక శక్తి కూడా నాశనమైంది. వారి నాయకులందరూ చనిపోయారు.. వారి సుప్రీం లీడర్ ఇక సర్వోన్నతుడు కాదు. ఆయన మరణించారు.' అని ట్రంప్ అన్నారు. ఇరాన్ ఆయుధ నిల్వలను తాము చిన్నాభిన్నం చేస్తున్నామని, ఎవరూ ఊహించని స్థాయిలో వారి క్షిపణి, డ్రోన్ కర్మాగారాలను ధ్వంసం చేస్తున్నామని ట్రంప్ తెలిపారు. వారి రక్షణ పారిశ్రామిక స్థావరాన్ని తుడిచిపెట్టేశామని ట్రంప్ చెప్పుకొచ్చారు.
అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత, ఆయన కుమారుడైన మొజ్తబా ఖమేనీ ఇరాన్ బాధ్యతలు చేపట్టినట్లు వార్తలు వచ్చాయి. ఆయన ఇరాన్ రాజకీయాల్లో అత్యంత శక్తివంతుడిగా, వివాదాస్పద వ్యక్తిగా పేరు పొందారు. అయితే, ఆయన బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఇటువంటి వార్తలు రావడం గమనార్హం. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను ఇరాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా ధృవీకరించలేదు, ఖండించలేదు. సాధారణంగా ఇరాన్ తన అత్యున్నత నాయకుల ఆరోగ్య స్థితిగతులను అత్యంత రహస్యంగా ఉంచుతుంది. గతంలో కూడా అలీ ఖమేనీ ఆరోగ్యంపై అనేక పుకార్లు వచ్చినప్పుడు ఇరాన్ నిశ్శబ్దంగానే ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి:
త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ!
Read Latest Telangana News and National News