ఏఐకి కొత్త పేరు పెట్టండి.. ప్రజలకు ట్రంప్ పోలింగ్
ABN , Publish Date - Sep 20 , 2026 | 02:55 PM
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు కొత్త పేరు పెట్టాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ప్రజలకు పోలింగ్ నిర్వహించారు. ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ అనే పేరు అంతగా ఆకర్షణీయంగా లేదని, అది సరైనది కూడా కాదని ఆయన పేర్కొన్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఏఐకి కొత్త పేరు పెట్టాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ప్రజలకు పోలింగ్ నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ అనే పేరు సరైనది కాదని, అది అంతగా ఆకర్షణీయంగా కూడా లేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఏఐకి బదులుగామూడు పేర్లు సూపర్ ఇంటెలిజెన్స్, ఎక్స్‌ట్రీమ్ ఇంటెలిజెన్స్, సుప్రీం ఇంటెలిజెన్స్‌ను ఆయన సూచించారు. ఈ మూడు పేర్లలో ఏది బాగుంటుందో తన ఫాలోవర్లు ఓటు వేయాలని ట్రంప్ కోరారు. కాగా.. ఫోర్బ్స్ ప్రకారం, పోల్ ప్రారంభించిన సుమారు గంటలోనే దాదాపు 30 వేల మంది ఓటు వేశారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి సూపర్ ఇంటెలిజెన్స్ పేరుకు 42 శాతం ఓట్లు వచ్చినట్లు నివేదికలు తెలిపాయి.
ఏఐ అభివృద్ధిపై కొనసాగుతున్న చర్చ
ఏఐ అభివృద్ధి వేగం, దాని భద్రత, నియంత్రణపై అమెరికాలో ప్రస్తుతం తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఏఐ అభివృద్ధిని కొంతకాలం నెమ్మదించాలని ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ కోరగా.. ట్రంప్ మాత్రం ఏఐ అభివృద్ధిని నెమ్మదించాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారు. మరోవైపు ఏఐ రంగాన్ని మరింత విస్తరించేందుకు ట్రంప్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా కొత్త ‘ఏఐ అడ్వైజర్’ లేదా ‘ఏఐ జార్’ ను నియమించడంతో పాటు ప్రత్యేక ఏఐ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని ట్రంప్ ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
ఆసియా క్రీడలు: బంగ్లా ఘోర ఓటమి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్
ఇంగ్లండ్‌లో సిక్కు బస్ డ్రైవర్‌పై యెమెన్ దేశస్థుడి దాడి